పంట నష్టం.. రైతన్నకు కష్టం

ABN , First Publish Date - 2021-07-27T03:56:27+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వర్షాలకు పత్తికి తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి.

పంట నష్టం..  రైతన్నకు కష్టం
హవేళీఘనపూర్‌ మండలంలో నీటమునిగిన వరి

 ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నిలిచిన నీరు 

 దెబ్బతింటున్న పంటలు 

 పత్తికి తెగుళ్లు సోకే అవకాశం  

 కలుపు తీసేందుకు కూలీల కొరత

 పరేషాన్‌లో పత్తిరైతులు 

 పంట నష్టంపై వ్యవసాయశాఖ ప్రాథమిక సర్వే


మెదక్‌/బెజ్జంకి, జూలై 26 : ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వర్షాలకు పత్తికి తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. పత్తి చేనులో గడ్డి విపరీతంగా పెరగడంతో కలుపు తీసేందుకు కూలీలు దొరకడం లేదు. నీరంతా చేనులో ఉండిపోయి పత్తి మొక్కలు కుళ్లిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం పెట్టుబడి రాదనిఆందోళన చెందుతున్నారు. 


186 ఎకరాల్లో వరికి నష్టం

 మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పంట నష్టం అధికంగా ఉంది. ప్రాథమికంగా నిజాంపేట మండలంలో 101 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. హవేళీఘనపూర్‌ మండలంలోని వాడీ గిరిజన తండాల్లో 40 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. మెదక్‌ మండలంలోని పాతూర్‌లో 23 మంది రైతులకు చెందిన 45 ఎకరాల విస్తీర్ణంలోని నారుమళ్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా 186 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో వరికి అగ్గితెగులు సోకే అవకాశం ఉంది. 


200 ఎకరాల్లో పత్తికి నష్టం

 ఇటీవల కురిసిన వర్షాలకు మెదక్‌ జిల్లాలో 200 ఎకరాల్లో పత్తి నీట మునిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. పెద్దశంకరంపేట మండలంలో 45 ఎకరాలు, అల్లాదుర్గం మండలంలో 45 ఎకరాలు, రేగోడ్‌ మండలంలో 54 ఎకరాలు, టేక్మాల్‌ మండలంలో 55 ఎకరాల్లో పత్తిచేను నీటి మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. పత్తికి తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  


ఆందోళనలో పత్తి రైతులు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడి రైతులు వర్షాలపై ఆధారపడి పత్తి పంటలను సాగు చేస్తారు. గతేడాది, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతుండడంతో వరి సాగు పెరిగింది. బెజ్జంకి మండలవ్యాప్తంగా 31వేల ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 12వేల ఎకరాల్లో వరి, 8వేల ఎకరాల్లో పత్తి, 5వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వందల ఎకరాల్లో పత్తికి తెగుళ్లు సోకి మొక్కలు ఎర్రపడి ఆకులపై మచ్చలు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. వానలు ఇలాగే కురిస్తే పెట్టుబడి కూడా చేతికి రావడం కష్టమని ఆవేదన చెందుతున్నారు.  

పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు

-శ్రీనివాస్‌రెడ్డి, గాగిల్లాపూర్‌, రైతు

ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి మొక్కలు ఎర్రబడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు మందు పిచికారి చేశాను. వర్షాలు ఇలాగే కురిస్తే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 


చీడల నివారణకు జాగ్రత్తలు

-పరశురాంనాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి, మెదక్‌

పత్తి పంటకు తెగుళ్లు సోకే అవకాశం ఉండడంతో వీటి నివారణకు అగ్రిమైసిన్‌, ప్లాంటోమైసిన్‌, మందులను పిచికారి చేయాలి. పొలాల్లో తాత్కాలికంగా నత్రజని ఎరువు వాడకం నిలిపివేయాలి. మొక్కజొన్నలో ఎరువు వేస్తూ ఎకరాకు అదనంగా 30కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ వేయాలి. పత్తి, కంది, మొక్కజొన్న, సోయాబిన్‌ పొలాల్లో నిలిచిన వర్షం నీటిని తొలగించాలి.

Updated Date - 2021-07-27T03:56:27+05:30 IST