నష్టం ఒకరికి.. పరిహారం మరొకరికి..!

ABN , First Publish Date - 2022-06-29T06:22:23+05:30 IST

కౌలు రైతు పేరు ఆళ్ల బ్రహ్మం గత సీజన్‌లో ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి వేయగా దెబ్బకొట్టింది.

నష్టం ఒకరికి.. పరిహారం మరొకరికి..!

భూ యజమానుల ఖాతాల్లో పంట బీమా సొమ్ము

 దయనీయ స్థితిలో కౌలు రైతులు

   కౌలు రైతు పేరు ఆళ్ల బ్రహ్మం గత సీజన్‌లో ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి వేయగా దెబ్బకొట్టింది. వరుస నష్టాలతో రూ.18 లక్షలకుపైగా అప్పులయ్యాయి. తనకున్న అరెకరం అమ్మి రూ.12 లక్షల అప్పు తీర్చాడు. బీమా సొమ్ము భూయజమానికి వచ్చాయి. పంట నష్టపోయిన కౌలు రైతుకు ఆ సొమ్ము ఇవ్వడం లేదు. జూ దయనీయ స్థితిలో కౌలు రైతులు 

కంచికచర్ల, జూన్‌ 28 : ఎన్టీఆర్‌ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.  గడిచిన సీజన్‌లో ఎంతో ఆశతో సాగు చేసిన పంటలు దెబ్బకొట్టాయి. ఆశించిన దిగుబడులు రాక, గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు చేతికి అందక తీవ్రంగా నష్టపోయారు. చివరకు పంటల బీమా సొమ్ము కూడా అందక నానా అవస్థలు పడ్డారు. ప్రాధేయ పడుతున్నప్పటికీ బీమా సొమ్ము ఇచ్చేందుకు భూ యజమానులు నిరాకరిస్తుండటంతో ఏం చేయలేక తలలు పట్టుకుంటున్నారు. 

ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో 70 శాతం మంది కౌలు రైతులున్నారు. గత సీజన్‌లో ముఖ్యంగా పత్తి, మిర్చి పంటలు దెబ్బకొట్టాయి. పత్తి నామమాత్రంగా దిగుబడి వచ్చింది. తామర పురుగు ప్రభావం వల్ల ఎక్కువ శాతం మిర్చి తోటలు తొలగించారు. అక్కడక్కడా ఒకటీ అరా తోటలు కిలోల వంతున మాత్రమే దిగుబడి వచ్చాయి. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ప్రకటించిన పంట బీమా పరిహారపు సొమ్ము కౌలు రైతులకు అందలేదు. బీమా సొమ్ము కౌలు రైతులకు కాకుండా, భూ యజమానుల ఖాతాల్లో పడ్డాయి. యజమానుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ కనికరించటం లేదు. బీమా సొమ్ము ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. పైగా మీకెందుకు ఇవ్వాలంటూ భూ యజమానులు ప్రశ్నిస్తుండటంతో కౌలు రైతులకు ఏమీ చేయాలో పాలు పోవటం లేదు. 2019 ఏపీసీసీఆర్‌సీ చట్టం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. భూ యజమాని అంగీకారం లేనిదీ తామేమీ చేయలేమంటూ  అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 33,458 సీసీఆర్‌సీ కార్డులు ఇవ్వగా, ఈ ఏడాది (2022) 41,422 కార్డులు ఇవ్వాలన్నది అధికారుల లక్ష్యం. అయితే ఇప్పటికీ 9,718 కార్డులు అందజేశారు. 

 మొండిచెయ్యి 

భూయజమానులు సీజన్‌ ప్రారంభానికి ముందే ఏప్రిల్‌ నెలలోనే పంట రుణాలు రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. పీఎం కిసాన్‌, రైతు భరోసా సొమ్ములు వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. చివరకు  పంటల బీమా పరిహారపు సొమ్ము కూడా భూయజమానుల ఖాతాల్లోనే పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బీమా సొమ్మైనా ఇవ్వాల్సిందిగా కౌలు రైతులు వేడుకుంటున్నప్పటికీ భూ యజమానుల కనికరించటం లేదు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవంగా పంటలు సాగు చేసిన రైతులకు బీమా సొమ్ము అందించాలని రైతు సంఘం నాయకుడు కొమ్మినేని సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

 ముచ్చింతాలలో ధర్నా

పెనుగంచిప్రోలు : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పంటల బీమాను తమకే ఇవ్వాలని కోరుతూ ముచ్చింతాల గ్రామంలో కౌలు రైతులు మంగళవారం ధర్నా చేశారు. అర్ధగంట పాటు గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నినాదాలు చేశారు. 

పెనుగంచిప్రోలు : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పంటల బీమాను తమకే ఇవ్వాలని కోరుతూ ముచ్చింతాల గ్రామంలో కౌలు రైతులు మంగళవారం ధర్నా చేశారు. అర్ధగంట పాటు గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నినాదాలు చేశారు. 

Updated Date - 2022-06-29T06:22:23+05:30 IST