మునిగిన పంటలు.. ఆందోళనలో రైతన్నలు

ABN , First Publish Date - 2020-11-30T04:53:06+05:30 IST

నివర్‌ తుఫాన్‌ వల్ల చేతికి వచ్చే పంటలు నీట మునగడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.

మునిగిన పంటలు.. ఆందోళనలో రైతన్నలు
ఎర్రగుంట్లలో నీటముగిన పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, అధికారులు

 దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు   నష్ట పరిహారంపై వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ, రెవెన్యూ అధికారులు  ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు

ఎర్రగుంట్ల, నవంబరు 29: నివర్‌ తుఫాన్‌ వల్ల చేతికి వచ్చే పంటలు నీట మునగడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఇక పంట సాగుకు కరువుతీరుతుందన్న ఎన్నో ఆశలతో రైతన్నలు వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన వరి,  పత్తి, మినుము, బుడ్డశనగ వర్షార్పణమయ్యాయి. దీంతో ఈ యేడు కూడా తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు తలలుపటుకుంటున్నా రు. ఇదిలా ఉండగా  నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఎర్రగుంట్లమండలంలోని వై.కోడూరు పంచాయతి పరిధిలోని నీట మునిగిన శనగపంటను ఆయన ఏడీఏ వెంటకసుబ్బయ్య, రైతులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలతో ఇటీవల సాగుచేసిన బుడ్డశనగపంట పూర్తిగా నీటమునిగి కుళ్లిపోతోందని ఇక ఎందుకు పని కి రాదని, పూర్తిగా నష్టపోయామని రైతులు ఎమ్మెల్యే  ఎదుట వాపో యారు. పత్తి, వరి, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. చీనీ చెట్లు సైతం కుళ్లిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 11వేల ఎకరాల్లో శనగపంట పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందాల్సిందేనని డిసెంబరు 4వ తేదీలోగా రైతుల వివరాలు సేకరించి 5న అప్‌డేట్‌ చేయాల్సిందేనని ఆయన అధికారులకు డెడ్‌లైన్‌ పెట్టారు. రైతుల పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించినా సహించనన్నారు. డిసెంబరు 30తేదీనాటికి సీఎం రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారని అందుకు తగ్గట్టుగా నియోజవర్గంలోని అన్ని మండలాల నుంచి వ్యవసాయాధికారులు నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులు తిరిగి పంట వేసుకునేందుకు నిధుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ వెంకటసుబ్బయ్య, వైసీపీ మండల ఇన్‌చార్జి ఎం.సురేంద్రనాథ్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ఛైర్మన్‌ మల్లుగోపాల్‌రెడ్డి, రైతులు ఎస్‌.సూర్యనారాయణరెడ్డి, వాసు, ప్రతా్‌పరెడ్డి, మైసూరారెడ్డి, హరి, జీరెడ్డి మల్లికార్జునరెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ విశ్వభార్గవరెడ్డి,  గంగాబ్రదర్స్‌, ఎంపీఈవో వినోద్‌, తదితరులు పాల్గొన్నారు. 


 నష్టపోయిన రైతులకు నష్టపరిహారమివ్వాలి

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 29: నివర్‌ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం గోపవరం గ్రామంలో నీటమునిగిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నివర్‌ తుఫాను వలన మండలంలో వరి, వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రూ.30 వేలు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పక్కీరయ్య, సుబ్బారావు, పెద్దన్న, చెన్నారెడ్డి, శ్రీను, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-30T04:53:06+05:30 IST