Advertisement

అన్నదాత ఆగమాగం.. 20వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

Oct 15 2020 @ 10:47AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 కోట్ల రూపాయలకు పైనే పంట నష్టం

వరుస వర్షాలతో ఉమ్మడి జిల్లా రైతులు అతలాకుతలం

పలుచోట్ల నేలకొరిగిన వరి.. నీటి పాలైన ధాన్యం, సోయా

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు మృత్యువాత 

విరిగిపడిన చెట్లు.. కూలిన ఇళ్లు

ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు 


( ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌ / కామారెడ్డి ): వరుస వర్షాలు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతాంగాన్ని ఆగమాగం చేస్తున్నాయి. నిజామాబాద్‌ రూరల్‌, వర్ని, చందూర్‌, మోస్రా, ఎడపల్లి, బోధన్‌, కోటగిరి, రెంజల్‌, నవీపేట, వర్ని, మోపాల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు తదితర ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 23మండలాల పరిధిలో సుమారు 20వేల ఎకరాల్లో వరి, సోయా తదితర పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం, సోయా, మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్లూర్‌లో విద్యుత్‌ షాక్‌తో ఓ వృద్ధుడు, అలాగే గాంధారిలో ఈతకు వెళ్లి మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. 94 ఇళ్లు పాక్షికంగా.. 3 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి.   వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడం తో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల  తో పంటలు దెబ్బ తింటుండడంతో రైతాంగం అతలాకు తలమవుతోంది. చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడం.. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. వర్షానికి వరి, సోయా పంటలు నేలకొరగడం తో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటలను కాపా డుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇంకా ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో పండించిన ధాన్యం, ఇతర పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. 


వరి పంటకు భారీ నష్టం..

నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం 16 మి.మీల వర్షం నమోదైంది. సిరికొండ మండలంలో అత్యధికంగా 35 మి.మీ వర్షం పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 907 మి.మీ వర్షం పడాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 973 మి.మీ వర్షం పడింది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలో వరి పంటకు భారీగా నష్టం జరిగింది. వర్ని, చందూర్‌, మోస్రా, ఎడపల్లి, బోధన్‌, కోటగిరి, రెంజల్‌, నవీపేట, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, మాక్లూరు, నందిపేట మండలాల పరిధిలో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. కోసిన వరి ధాన్యాన్ని రోడ్లు, పొలాల వద్దనే ఽధాన్యం కుప్పలుగా పోశారు. దీంతో పంటం మొత్తం తడిసిముద్దయింది. ప్రభుత్వం ఈ వానాకాలంలో సన్న రకాలు సాగుచేయ మనడంతో ఎక్కువ మంది వేశారు. ఈ వర్షాలకు ఎక్కువ పెరిగిన సన్నరకాలు నేలకొరిగాయి. దొడ్డు రకాలతో పోల్చితే సన్న రకాలు ఎక్కువగా రాలే అవకాశం ఉంది. అకాలంగా వర్షాలు రావడంతో తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక తక్కువ రేటుకు అమ్ముకుంటున్న మొక్కజొన్న రైతులు ప్రస్తుతం తడువడంతో కొనే పరిస్థితి ఉండదని వారు అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వ్యాపా రులు అతి తక్కువ రేటుకు మొక్కజొన్నలను రైతులు అమ్ముతున్నారు. జిల్లా పరిధిలో సోయా పంట కూడా భారీగా దెబ్బతింది. జిల్లాలో వర్షాలకు కోసిన ధాన్యం తడిసిపో యింది. సోయా పంట దెబ్బతింటుంది. ధాన్యంతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. బుధవారం కొన్ని గ్రామాల పరిధిలో కొనుగోళ్లు ప్రారంభించారు. తడిసిన సోయాను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.


పంట నష్టంపై అధికారుల ఆరా..

వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా పంట నష్టంపై ఆరా తీస్తున్నారు. భారీ వర్షాలు కాకుండా ముసురు, ఓ మోస్తరు వర్షం పడడం వల్ల వరి నేల కొరుగుతోందని వారు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని 71గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. మోర్తాడ్‌, కోటగిరి, ఆర్మూర్‌, చందూర్‌, వర్ని, మోస్రా, రుద్రూర్‌, ముప్కాల్‌, కమ్మ ర్‌పల్లి మండలాల్లో బుధవారం అందిన సమాచారం ప్రకారం 1800 ఎకరా ల్లో వరి దెబ్బతిందని అంచనా వేశారు. సోయా పంట వంద ఎకరాలకు పైగా దెబ్బతిన్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం పడుతున్న వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నామని జేడీఏ గోవింద్‌ తెలిపారు. జిల్లాలోని పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ అధికారులు వర్షాలకు రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలను ఆరా తీస్తున్నారు.


అలాగే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14 వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా వరి 6 వేల ఎకరాల్లో, పత్తి 7 వేల ఎకరాల్లో దెబ్బతినగా 15 వేల మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ భారీ వర్షాల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ముగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. 97 గృహాలు కూలిన ట్లు అధికారుల సర్వేలో తెలింది. జిల్లాలోని పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


20వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

వరుసగా పడుతున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 20వేల ఎకరాల్లో వివిధ వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారుల సర్వేలో తేలింది. మొత్తం 23 మండలాల పరిధిలో ఈ నష్టం ఎక్కువగా ఉంది. కామారెడ్డి జిల్లాలోనే ఏకంగా 18 మండ లాల్లోని 284 గ్రామాల్లోని పంటనష్టం వాటిల్లింది. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 8కోట్ల రూపాయలకు పైనే పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

     


తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి..: లక్ష్మణ్‌, వీరన్నగుట్ట

 వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట అంతా తడిసిపోయింది. రెండు రోజుల కిందటనే వరి కోత మిషన్‌ ద్వారా ధాన్యాన్ని కోశాం. కల్లాల్లోని వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే మొలకలు కూడా వచ్చాయి. ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.


విత్తనాల పైసలు కూడా వచ్చేటట్లు లేవు..: సతీష్‌, కందకుర్తి

వర్షాకాలం ప్రారంభంలోనే సోయా విత్తనాలు వేశాం. అవి మొలకెత్తకపోవడంతో రెండోసారి చేతికి వచ్చిన పంట వర్షం కారణంగా నీళ్ల పాలయింది. విత్తనాల పైసలు కూడా వచ్చేటట్లు లేవు. పంటను కోసే దశలో వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టపోయాం.  నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.