అవసరం లేని ప్రాజెక్టులకు కోట్ల అప్పు

ABN , First Publish Date - 2021-03-06T05:52:20+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని ప్రాజెక్టుల కోసం రూ.కోట్ల అప్పులు తెచ్చి నిధులను దుర్వినియోగం చేస్తోందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు.

అవసరం లేని ప్రాజెక్టులకు కోట్ల అప్పు
సమావేశంలో మాట్లాడుతున్న టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

సామాన్య జనాన్ని పట్టించుకోని ప్రభుత్వం 

టీజేఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం

నల్లగొండ క్రైం, మార్చి 5: తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని ప్రాజెక్టుల కోసం రూ.కోట్ల అప్పులు తెచ్చి నిధులను దుర్వినియోగం చేస్తోందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సామాన్య జనాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతోందని, ఉద్యోగాలు, ఉపాధి లేక ప్రజలు, నిరుద్యోగులు, సబ్బండవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ప్రభుత్వమే కమిటీ వేసి దాన్ని అమలుచేయడంలో పట్టింపులేకుండా ఉందన్నారు. ఉర్దూను రెండో అధికార భాషగా కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం ఫైనాన్స్‌ కార్పొరేషన్లు ఉన్నా వాటికి నిధులు లేవన్నారు. దీంతో నాలుగైదేళ్లుగా ఆ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్కరికీ రుణాలు మంజూరుకాక, దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. మార్పు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులు ఓటు వేయాలని, మొదటి ప్రాధాన్య ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్‌ సలీమ్‌ పాష, ఎండీ.నజీరుద్దీన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్‌, పల్లె వినయ్‌, నాగిళ్ల శంకర్‌, ధీరావత్‌ వీరూ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:52:20+05:30 IST