డీసీఐలో అడ్డగోలు వ్యవహారాలు!

ABN , First Publish Date - 2022-07-24T09:04:01+05:30 IST

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా మారింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టునే అడ్డదారిలో దక్కించుకునే పరిస్థితులు ఉన్నాయంటే...అక్కడ పర్యవేక్షణ లోపం

డీసీఐలో అడ్డగోలు వ్యవహారాలు!

ఒక్కొక్కటిగా వెలుగులోకి.. 

నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించినా గుర్తించని వైనం

అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

సస్పెండైన అధికారులు డిస్మిస్‌ అయ్యే అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా మారింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టునే అడ్డదారిలో దక్కించుకునే పరిస్థితులు ఉన్నాయంటే...అక్కడ పర్యవేక్షణ లోపం ఎంతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంస్థ మొత్తం తన చెప్పుచేతల్లో ఉండాలనే ఆలోచనతో కంపెనీ సెక్రటరీగా పనిచేసిన కె.అశ్వనీ శ్రీకాంత్‌ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించాడు. ఎండీ పోస్టుకు విక్టర్‌ సమర్పించిన పత్రాలన్నీ ఒక కంపెనీ సెక్రటరీగా ఆయనే పరిశీలించాలి. వాటిని పోలీస్‌ వెరిఫికేషన్‌ కోసం కూడా పంపాలి. కానీ ఏడాదైనా వాటిని పంపలేదు. అందులోని లోపాలు బయట పడతాయనే విక్టర్‌ కీలకమైన పదవిలో కొనసాగేలా తన సహకారం అందించాడు. అక్కడితో ఆగకుండా ఇద్దరూ కలసి ఇంకా చాలా విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించారని ప్రాథమిక సమాచారం ఉండడంతో ఒకరి తరువాత మరొకరిని సస్పెండ్‌ చేశారు. 


వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినా పట్టించుకోలేదు

కొందరు హ్యాకర్లు ఏకంగా డీసీఐ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించి, దరఖాస్తులు ఆహ్వానించారు. తద్వారా ఫీజుల రూపంలోను, ఉద్యోగాలు ఇప్పిస్తామని బయట వసూళ్లు ప్రారంభించారు. ఈ విషయం కూడా వీరు గుర్తించలేదు. ఒడిశా నుంచి ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?, రిజర్వేషన్లు ఏమిటి? అంటూ సమాచారం కోరడంతో...అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దొంగలు పడిన ఆరు నెలలకు...హ్యాకర్లు సొమ్ము చేసుకున్నాక.. తాపీగా ఇక్కడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కంపెనీ సెక్రటరీగా ఉండాల్సిన వ్యక్తి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాన్ని కూడా తన ఆఽధీనంలో ఉంచుకోవడంతో వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయిన విషయాన్ని గుర్తించలేకపోయారని అధికారులు చెబుతున్నారు.


కొనసాగుతున్న విచారణ ప్రక్రియ

డీసీఐలో ఎండీగా విక్టర్‌, సెక్రటరీగా అశ్వనీశ్రీకాంత్‌లు విడివిడిగా, కలిసి నడిపిన వ్యవహారాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఎండీపై నివేదిక రాగానే దానిని బోర్డు డైరెక్టర్ల సమావేశంలో చర్చకు పెట్టి, డిస్మిస్‌ చేస్తారు. ఆ తరువాత లేని అధికారాలు ఆపాదించుకొని చేసిన బదిలీలు, మార్పులు, తీసుకున్న నిర్ణయాలపై చర్యలుంటాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2022-07-24T09:04:01+05:30 IST