నందకం, ఆస్థాన మండపం వద్ద సర్వదర్శన క్యూలో వేచి ఉన్న భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
తిరుమల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి తిరుమలకు భక్తుల రాక పెరిగింది. దీంతో క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి ఆలయంతోపాటు మాడవీధులు, గదులు కేటాయించే కేంద్రాలు, బస్టాండ్, కల్యాణకట్టలు, లడ్డూకౌంటర్లు, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం వంటి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ లేపాక్షి మీదుగా నందకం వరకు వ్యాప్తించింది. వీరికి 15 గంటల దర్శన సమయం పడుతోంది. ఆదివారం రాత్రి వరకు రద్దీ ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి.