స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
వేములవాడ, మార్చి 27 : దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట రద్దీగా మారింది. స్వామివారి సర్వదర్శనం, శీఘ్రదర్శనం, కోడెమొక్కుల క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. ఆదివారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ వంటి ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.