ముడి చమురు భగ భగ

ABN , First Publish Date - 2022-01-19T06:08:51+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. బ్యారల్‌

ముడి చమురు  భగ భగ

  •  ఏడేళ్ల గరిష్ఠ స్థాయిలో ధర
  •  87 డాలర్లకు చేరిక
  •  త్వరలో 100 డాలర్లకు!


న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర మంగళవారం 87.70 డాలర్లకు చేరింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి చేరటం ఇదే మొదటిసారి. మరోవైపు బ్యారల్‌ ముడి చమురు ధర 100 డాలర్లకు చేరే సమయం ఎంతో దూరంలో లేదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలోపే పీపా చమురు ధర 90 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 


భారం తప్పదు: చమురు సెగతో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న భారత్‌  వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్యారల్‌ చమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత ద్రవ్య లోటు 0.10 శాతం పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన గత నెలన్నర రోజుల్లోనే ముడి చమురు ధర 25 శాతానికి పైగా పెరిగింది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కోరలు చాస్తున్న సమయంలో చమురు సెగలు ప్రభుత్వాన్నీ భయపెడుతున్నాయి. దీంతో ఆర్‌బీఐ ఊహించిన దానికంటే ముందే వడ్డీ రేట్ల పెంపునకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


సెగ ఇందుకే: కొవిడ్‌ ప్రభావం నుంచి భారత్‌తో సహా అన్ని దేశాలు ఇపుడిప్పుడే బయటపడుతున్నాయి. దీంతో వినియోగం పెరిగి ముడి చమురుకు డిమాండ్‌ పెరిగింది. ఇదే సమయంలో అమెరికా, యూరప్‌ దేశాల్లో నిల్వలు ఊహించిన దానికంటే పడిపోయాయి. మరోవైపు యూఏఈలోని చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్‌ దాడులు మార్కెట్‌ను కుదిపేశాయి. దీంతో సరఫరాలకు ఎక్కడ అంతరాయం ఏర్పడుతుందోనని మార్కెట్‌ భయపడుతోంది.




ధరల పెంపు దాటవేత!


అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా మన దేశంలో ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సవరిస్తుంటాయి. గత నెల రోజుల్లో ముడి చమురు ధర 25 శాతానికిపైగా పెరిగినా, గత 74 రోజుల నుంచి మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ మాత్రం పెరగలేదు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా వంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఆయిల్‌ కంపెనీలు ఇదే వైఖరి కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ఆ తర్వాత మాత్రం వాహనదారుల జేబులకు చిల్లు తప్పకపోవచ్చు.


బడ్జెట్‌లో ఊరట !

మరోవైపు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్‌ సుంకం మరింత తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయిల్‌ కంపెనీలు ధరలు పెంచకపోవడానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక మంత్రి అందుకు సాహసిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.


Updated Date - 2022-01-19T06:08:51+05:30 IST