Hyderabad: భారీ వర్షాలు, వరద సహాయ చర్యలపై సీఎస్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-07-14T21:31:15+05:30 IST

భారీ వర్షాలు (Heavy Rains), వరద సహాయ చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ (CS Someshkumar) సమీక్ష నిర్వహించారు.

Hyderabad: భారీ వర్షాలు, వరద సహాయ చర్యలపై సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌: భారీ వర్షాలు (Heavy Rains), వరద సహాయ చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ (CS Someshkumar) సమీక్ష నిర్వహించారు. 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 223 శిబిరాల్లో 19,071 మందికి షల్టర్‌ కల్పించామని పేర్కొన్నారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భారీ నష్టం జరగలేదని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలో ఇటీవలే విత్తిన, మొలక దశలో ఉన్న వివిధ రకాల పంటలు నీట మునిగాయి. వర్షపాతం భారీగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా (Adilabad District)లో 10 వేల ఎకరాల్లో పత్తి, 4 వేల ఎకరాల్లో సోయాబీన్‌, 3 వేల ఎకరాల్లో కంది పనికి రాకుండా మారాయి. ఈ జిల్లాల్లో  5.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా వేల ఎకరాల్లో నీట మునిగాయి. నిర్మల్‌ జిల్లా (Nirmal District)లో 12 వేల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అల్లాదుర్గం, రేగోడ్‌, టేక్మాల్‌, హవేలీ ఘన్‌‌పూర్‌, నర్సాపూర్‌, శివ్వంపేట, తూప్రాన్‌, కౌడిపల్లి మండలాల్లో ప్రధాన పంటలతో పాటు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.


కరీంనగర్‌ జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మునిగాయి. పెద్దపల్లి జిల్లాలో 4,246 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. వరి, మొక్కజొన్న నీటిలో నానుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 45 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో కంది, వేయి ఎకరాల్లో ఇతర పంటలూ  ఇదే స్థితిలో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 వేల ఎకరాల్లో నాట్లు కొట్టుకుపోయాయి. మొక్కజొన్న, కంది, పెసర  మునిగిపోయాయి. జగిత్యాల జిల్లాలో 17,500 ఎకరాల్లోని పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో 14 మండలాల పరిధిలోని 286 గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీని విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో మాత్రమే పంట నష్టం స్వల్ఫంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదల కారణంగా 130 గ్రామాల్లో పంటలు మునిగాయి. 

Updated Date - 2022-07-14T21:31:15+05:30 IST