సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగతి: సీఎస్

ABN , First Publish Date - 2021-09-03T01:11:06+05:30 IST

దూరదృష్టి గల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఏడు సంవత్సరాల కాలంలో వేగంగా పురోగతిని సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగతి: సీఎస్

హైదరాబాద్: దూరదృష్టి గల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఏడు సంవత్సరాల కాలంలో వేగంగా పురోగతిని సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. “ఎగుమతిదారుల సవాళ్లు ... అధిగమించడం” అన్న అంశం పై గురువారం ఫిక్కీ భవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం ముందస్తుగా పకడ్బందిగా చర్యలు తీసుకున్నందున, లాక్‌డౌన్‌ లో కూడా రాష్ట్రం అద్భుతమైన వృద్ధిని సాధించిందని తెలిపారు. ఎగుమతిదారులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన హమీ ఇచ్చారు.


ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎగుమతుల రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కోవిడ్ అనంతర కాలంలో కూడా ఇలాగే కొనసాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు కింద 20 లక్షల ఎకరాలను వినియోగం లోనికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన సీఎస్ వెల్లడించారు. రాష్ట్రం నుంచి వ్యవసాయ ఎగుమతులను పెంచడం పై కూడా ప్రత్యేక దృష్టి సారించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. లాక్డౌన్ కాలంలో కూడా ఉత్పత్తిని అనుమతించి ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చినందుకు వివిధ ఎగుమతి విభాగాల  ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎగుమతిదారులు కంటైనర్ కొరత గురించి  వివిధ రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నారని, కంటైనర్ల కొరత తీర్చాలని ఆయనకు విజ్ఞప్తి చేసారు. 


మూలధన వస్తువులకు సంబంధించి జీఎస్‌టీ రీ ఫండ్ సమస్యను భారత ప్రభుత్వంతో కలసి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ జీ ఐ ఏలో ఎగుమతిదారుల కొరకు అంతర్జాతీయ కొరియర్ కార్గో క్లియరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఎగుమతిదారులకు ఎగుమతుల నాణ్యత కోసం ఒక పట్టణాన్ని నోటిఫై చేయాలని, రాష్ట్రం నుండి ఎగుమతులను పెంచడానికి మరొక ఇన్ లాండ్ కంటైనర్ డిపో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎగుమతులను పెంచడానికి తగు సలహాలు ఇవ్వాలని  ఎగుమతిదారులను సీఎస్ కోరారు. ఎగుమతిదారులు తెలిపిన సమస్యలను ప్రభుత్వం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎఫ్టిసిసిఐ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, రైల్వేశాఖ డీజీఎఫ్టి, కాంకర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T01:11:06+05:30 IST