ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకోండి:సీఎస్

ABN , First Publish Date - 2021-10-14T20:39:55+05:30 IST

తెలంగాణలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకోండి:సీఎస్

హైదరాబాద్: తెలంగాణలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు తగు చర్యలు  తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో హార్టికల్చర్, పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్ష  నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును చేపట్టడానికి రాష్ట్ర కేబినెట్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించినట్లు సీఎస్ తెలిపారు. రైతులు మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు వరి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు 4 నుండి 5 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునని ఒక అధ్యయనంలో తేలిందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ అధ్యయనంలో, తెలంగాణలోని చాలా ప్రాంతాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పురోగతిని సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 నర్సరీలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 23.41 లక్షల ఆయిల్ పామ్ మొలకలు లబించాయని, 36,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు సరిపోతాయని సంబంధిత అధికారులు తెలిపారు. 2.11 కోట్ల ఆయిల్ పామ్ మొలకల కోసం వివిధ కంపెనీలకు సరఫరా నిమిత్తం ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు, కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ విత్తనాలపై కస్టమ్ డ్యూటీ 30 నుండి 5శాతానికి కి తగ్గించింది. ఆయిల్ పామ్ సాగు రైతులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు వెంకట్రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎం.డి.సురేందర్ లు హాజరయ్యారు.

Updated Date - 2021-10-14T20:39:55+05:30 IST