రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని: సీఎస్

ABN , First Publish Date - 2022-01-02T01:56:35+05:30 IST

తెలంగాణలో కోవిడ్ పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని: సీఎస్

హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న ఒమైక్రాన్ వేరియంట్ పై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా దేశంలోని ఆయా రాష్ట్రాల్లోనూ, విదేశాల్లో ఒమైక్రాన్ విస్తరణను నివారించడానికి తీసుకుంటున్నచర్యలు, మన రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా చర్చించారు. కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. 


ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించిందన్నారు. భారీగా ప్రజలు ఒక దగ్గరకు చేరే విషయంలో ప్రత్యేకించి మతపరమైన, రాజకీయపరమైన, కల్చరల్ ఈవెంట్స్ పై కూడా పలు ఆంక్షలు విధించిందని అన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, షాప్స్, మాల్స్, కార్యాలయాలు తదితర వాటిలో తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలన్న నిబంధనలు కూడా పాటించాలని ఆదేశించినట్టు తెలిపారు. 


ఆయా చోట్ల ఎంట్రీ పాయింట్ లోనే థర్మోస్క్రీనింగ్, థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. పాఠశాలలు, వివిధ ఇన్ స్టిట్యూషన్లలో కూడా సిబ్బంది, టీచర్లు, విద్యార్ధులు తప్పని సరిగా మాస్క్ ధరించాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించినట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ప్లేస్ లలో మాస్క్ లు ధరించని వారిపై 1000 జరిమానా విధించాలని అన్నారు.దీనిని ఖచ్చితంగా అమలుచేయాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ,డైరెక్టర్ ఆఫ్ హెల్త్ , డీఎంఈ రమేష్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-01-02T01:56:35+05:30 IST