Advertisement

బీఆర్‌ఏయూకు సీఎస్‌ఐ గుర్తింపు

Dec 2 2020 @ 23:39PM
సీఎస్‌ఐ ధ్రువపత్రాన్ని అందుకుంటున్న వీసీ ప్రొఫెసర్‌ రాంజీ

ఎచ్చెర్ల, డిసెంబరు 2: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీకి కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) గుర్తింపు లభించిందని వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ తెలిపారు. ఈ గుర్తింపు పత్రాన్ని సీఎస్‌ఐ రీజనల్‌ -5 ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.సుందరప్రసాద్‌బాబు వర్సిటీ అధికారులకు బుధవారం అందజేశారు. ఇందులో భాగంగా ఈ నెల 5న సీఎస్‌ఐ విద్యార్థి శాఖను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వీసీ రాంజీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో సంస్థల పరంగా 500, విద్యార్థుల భాగస్వామ్యంతో 500 శాఖలను సీఎస్‌ఐ కలిగి ఉందన్నారు. ముంబై కేంద్రంగా 1,956 నుంచి పనిచేస్తున్న సీఎస్‌ఐ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ రంగాల్లో విద్యార్థులకు వివిధ విద్యా సంస్థలకు మార్గదర్శకంగా నిలిచామన్నారు. అంబేడ్కర్‌ వర్సిటీకి 2030 సంవత్సరం వరకు సభ్యత్వాన్ని ఇచ్చినట్టు చెప్పారు. సీఎస్‌ఐ అధికారి సుందరప్రసాదబాబు మాట్లాడుతూ, తమ సంస్థ దేశ వ్యాప్తంగా 8 రీజియన్లుగా పనిచేస్తూ 80 చాప్టర్లను కలిగి ఉందన్నారు. ఏటా ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థి శాఖల సమావేశాలు, ప్రత్యేక సెమినార్‌లు, వర్క్‌షాపులు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంటు ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబాబు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్‌ టి.కామరాజు, ప్రొఫెసర్‌ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు. 


రెగ్యులర్‌ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ :

అంబేడ్కర్‌ యూనివర్సిటీకి రెగ్యులర్‌ వీసీ నియామకానికి ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించింది. ఈ మేరకు బుధవారం జీవో నంబరు 166ను జారీ చేసింది. వర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ కూన రాంజీ మూడేళ్ల పదవీ కాలం ఈ నెల 7తో ముగియనుంది. దీంతో ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసి రెగ్యులర్‌ వీసీ నియామకానికి చర్యలు తీసుకుంది. ఈ సెర్చ్‌ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా ప్రొఫెసర్‌ సీఆర్‌ విశ్వేశ్వరరావు (పూర్వపు వైస్‌ ఛాన్సలర్‌, విక్రమ సింహంపురి యూనివర్సిటీ, నెల్లూరు), పాలకమండలి నామినీగా ప్రొఫెసర్‌ ఎన్‌.ప్రభాకరరావు (పూర్వపు వైస్‌ ఛాన్సలర్‌, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి), యూజీసీ నామినీగా ప్రొఫెసర్‌ ఎన్‌పీ గౌతమ్‌ (వైస్‌ ఛాన్సలర్‌, మహాత్మాగాంధీ చిత్రకోట గ్రామోద్యోయ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్‌)లు ఉన్నారు. చైర్మన్‌గా ప్రొఫెసర్‌ సీఆర్‌ విశ్వేశ్వరరావు వ్యవహరించనున్నారు. వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించి మూడు పేర్లను షీల్డ్‌ కవరులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు అందజేయనుంది. అనంతరం రాష్ట్ర గవర్నర్‌కు కమిటీ సూచించిన పేర్లను పంపించనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని వైస్‌ చాన్సలర్‌గా గవర్నర్‌ నియమించనున్నారు.  


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.