మూతపడి మూడేళ్లు..

ABN , First Publish Date - 2020-09-23T06:59:33+05:30 IST

రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు.. అందుబాటులో వైద్యులు, సిబ్బంది. అవసరమైన మందులు.. ఇలా

మూతపడి మూడేళ్లు..

ఖమ్మం దవాఖానాలో మూలనపడ్డ సీటీ స్కాన్‌

పలు వ్యాధుల నిర్ధారణలో కీలకం 

కరోనా బాధితులైన టెస్టు తప్పనిసరి 

‘ప్రైవేటు’లో టెస్ట్‌కు రూ.5వేలు గుంజుతున్న వైనం

గుల్లవుతున్న పేదరోగుల జేబులు


ఖమ్మం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు.. అందుబాటులో వైద్యులు, సిబ్బంది. అవసరమైన మందులు.. ఇలా అన్నీ ఉన్నా కరోనాతో పాటు ఇతర ఊపిరితిత్తులు, మెదడు, ఛాతి సంబంధిత తదితర వ్యాధుల తీవ్రతను తెలుసుకునే సీటీస్కాన్‌ యంత్రం మాత్రం ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అందుబాటులో లేదు. ఈ యంత్రం మూడేళ్లుగా మూలన పడటంతో రోగులు అనివార్యంగా ప్రైవేటు సీటీస్కాన్‌ సెంటర్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఓ వైపు కరోనా వణికిస్తున్న ప్రస్తుత సమయంలో ఇక ఈ సీటీస్కాన్‌ అనివార్యమైంది. కరోనా తీవ్రత తెలుసుకోవాలంటే ఈ టెస్ట్‌ తప్పనిసరి కావడంతో ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఒక్కో టెస్టుకు రూ.5వేలు గుంజుతున్నారు. జిల్లాఆసుపత్రికి వచ్చే పేద రోగులు ప్రైవేట్‌కు వెళ్లి అంతమొత్తంలో చెల్లించడం భారంగా మారింది. ఇంతజరుగుతున్నా ఖమ్మం ఆసుపత్రిలోని సీటీస్కానింగ్‌ యంత్రం మరమ్మతులు చేయించడం, లేదంటే కొత్తది ఏర్పాటు చేసే విషయంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉన్న సిటీస్కాన్‌ మూడేళ్లుగా మూతపడే ఉంది. దీనికి అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో లేక చివరకు సిటీస్కాన్‌ రూంకు తాళం వేసి ‘సిటీస్కాన్‌ నాట్‌వర్కింగ్‌’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


నిరుపయోగంగా రూ.కోటి50లక్షల యంత్రం..

2007లో అప్పుటి వైద్యవిధానపరిషత్‌ మంత్రిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రూ.కోటి50లక్షలతో సీటీస్కానింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. తోషిబా కంపెనీ దీని సర్వీసింగ్‌ నిర్వహించింది. ఆ తర్వాత కంపెనీ సర్వీస్‌ గడువు ముగియడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ రాష్ట్రంలోని సీటీస్కాన్‌ యంత్రాల సర్వీసింగ్‌ను చేపట్టింది. అయితే ఖమ్మంలోని సీటీస్కాన్‌ యంత్రానికి సంబంధించిన పలు పరికరాలు ఆ ఏజెన్సీ వద్ద లేకపోవడంతో నిర్వహణ సాధ్యం కావడంలేదు. ఈ క్రమంలో మూడేళ్లుగా అది నిరుపయోగంగా ఉన్నా.. దాని స్థానంలో కనీసం కొత్తది ఏర్పాటు చేసే విషయంలోనూ అధికారులు చొరవ తీసుకోవడంలేదు. 


పేద రోగులకు మరింత భారం.. 

520పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోజుకు 1000నుంచి 1500మందివరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలనుంచి ఓపీ పేషంట్లు, అత్యవసర వైద్యం అవసరమైన రోగులు వస్తుంటారు. వీరిలో రోజుకు కనీసం 30మంది పేషంట్లకు సీటీస్కాన్‌ అవసరమవుతోంది. ఖమ్మం ఆసుపత్రిలోని యంత్రం పనిచేయకపోవడంతో రోగులను అంబులెన్సులో ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు తీసుకెళ్లి పరీక్ష చేయిస్తున్నారు. ఈ క్రమంలో సిటీస్కాన్‌కు రూ.5వేలతోపాటు అంబులెన్సుకు మరో రూ.2వేల వరకు చెల్లించాల్సి రావడంతో భారంగా మారింది.


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి గుండె, ఊపిరితిత్తులపై ఆ వైరస్‌ ప్రభావం ఎలా ఉందన్న విషయం తెలుసుకోవడం ఒక్క సీటీస్కాన్‌ ద్వారానే సాధ్యమవుతోంది. పాజిటివ్‌ వచ్చిన వారు కొందరు డాక్టర్ల సలహాలతో చికిత్స తీసుకుంటున్నా.. లోపల వ్యాధి తీవ్రత పెరిగి శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీటీస్కాన్‌ ఖచ్చితంగా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారీతిన దోచుకుంటున్నారు. 

Updated Date - 2020-09-23T06:59:33+05:30 IST