గంగా సాగర్ మేళాకు కలకత్తా హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2022-01-07T21:30:58+05:30 IST

గంగా సాగర్ మేళాను నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్

గంగా సాగర్ మేళాకు కలకత్తా హైకోర్టు అనుమతి

న్యూఢిల్లీ : గంగా సాగర్ మేళాను నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, కోవిడ-19 నిరోధక మార్గదర్శకాలను అమలు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేళాను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. 


పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గురువారం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో, ఈ మేళాను ముందుగా ప్రకటించినట్లుగానే నిర్వహిస్తామని, కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేళా జరిగే ప్రదేశంలో పెద్ద ఎత్తున పోలీసు, వాలంటీర్లు, వైద్య సిబ్బందిని మోహరిస్తామని తెలిపింది. అదేవిధంగా ఐసొలేషన్ బెడ్స్, సురక్షిత గృహాలు, క్వారంటైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది. 


గంగా సాగర్ మేళా సంక్రాంతి పర్వదినంనాడు జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాది మంది తరలివచ్చి, పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో గంగా సాగర్ ఉంది. గంగా నది బంగాళాఖాతంలో కలిసే చోటు ఇది. ఇక్కడ కపిల ముని ఆశ్రమం కూడా ఉంది. 


Updated Date - 2022-01-07T21:30:58+05:30 IST