సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు.

సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి
వెలుగోడు జలాశయం స్థితి గతులను అధికారులను అడిగి తెలుసుకుంటున్న పయ్యావుల కేశవ్‌

  1. వీబీఆర్‌ కింద సాగులో ఉన్న పైర్లకు నీరివ్వాలి
  2. అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌


ఆత్మకూరురూరల్‌, జనవరి 22: సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. శనివారం వెలుగోడులోని తెలుగుగంగ జలాశయాన్ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జేసీ రామసుందర్‌రెడ్డి, సీఈ మురళీనాథరెడ్డి ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ జలాశయం నీటి సామర్థ్యం, బానక చెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ద్వారా వీబీఆర్‌కు నీటి చేరిక, అక్కడి నుంచి ప్రధాన కాలువ ద్వారా చెన్నైకు వెళ్లే కాలువను, రిజర్వాయర్‌ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయంలో 6.22 టీఎంసీల నీరు నిలువ ఉందని, చెన్నై ప్రధాన గేట్ల ద్వారా 2700 క్యూసెక్కుల నీటిని.. వన్‌ఎల్‌, వన్‌ఆర్‌తూముల ద్వారా 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ గత ఏడాది చెన్నై ప్రధాన కాలువ లైనింగ్‌ పనులను 8 కిలోమీటర్ల మేర పూర్తి చేశారన్నారు. ఇంకా ఆరు కిలోమీటర్ల మేర లైనింగ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పనులు ఆగి పోవడానికి కారణాలపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందిస్తామన్నారు. వీబీఆర్‌ కింద ఇప్పటికే సాగు చేసిన పంటలకు మార్చి రెండో వారం వరకు సాగు నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈ సుబ్బరాయుడు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, తెలుగుగంగ అధికారులు పాల్గొన్నారు.


‘తెలంగాణ ప్రాజెక్టులతో ఆంధ్రకు తీవ్ర నష్టం’

పాములపాడు: తెలంగాణ ప్రాజెక్టులతో ఆంధ్రకు తీవ్ర నష్టం కలుగు తోందని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. శనివారం మండలంలోని బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మురళీనాథరెడ్డి పోతిరెడ్డి పాడు నుంచి నీటి పారుదల ప్రాజక్టుల వివరాలను మ్యాప్‌ ద్వారా ఆయనకు వెల్లడించారు. అనంతరం కేసీ కెనాల్‌, తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌లను ఆయన పరిశీలించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కోర్టు స్టే ఇచ్చినప్పటికీ పాలమూరు, రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి తీవ్రనష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని తెలంగాణ ప్రాజెక్టులను నిలుపు చేయించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీనివాస రెడ్డి, ఆర్డీ హరినాథ్‌, ఈఈలు మనోహర్‌రాజు, చెంగయ్య కుమార్‌, డీఈలు జార్జ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, జేఈలు దేవేంద్ర, విశ్వనాథ్‌, తిమ్మారెడ్డి, విష్ణు పాల్గొన్నారు.       

   

రైతులకు సాగు నీరు అందించాలి: ఎమ్మెల్యే బుడ్డా 

 తెలుగుగంగ ఆయకట్టు కింద రబీలో రైతులు సాగు చేసిన పంటలకు సాగు నీరు అందించాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వెలుగోడు రిజర్వాయర్‌ పరిశీలించేందుకు వచ్చిన పీఏసీ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైతులతో కలిసి ఓ వినతిపత్రాన్ని పయ్యావుల కేశవ్‌కు ఆయన అందజేశారు. 



Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST