భూమి కోసం..

ABN , First Publish Date - 2020-11-17T06:07:12+05:30 IST

సరిగ్గా రెండు నెలల క్రితం విజయవాడ విమానాశ్రయ రన్‌వే భూముల్లో రైతులు వరి నాట్లు వేశారు.

భూమి కోసం..
వరిపైరుతో కళకళలాడుతున్న రన్‌వే సమీపంలోని భూములు

ఎయిర్‌పోర్టు విస్తరణ బాధిత రైతుల తెగువ

సాగుబాటలో ఎయిర్‌పోర్టు భూముల రైతులు

రన్‌వేకు సమీపంలోని భూముల్లో వరి సాగు 

చేతికి అందివచ్చిన వరి.. కోతకు సిద్ధం

భూములు లేక, ప్యాకేజీకి విలువ లేక మరికొందరు ఆందోళన


విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చారు. భూమికి బదులుగా అమరావతిలో భూమిని పొందారు. దీని విలువ కోట్లలో ఉండగా, మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో భూమి విలువ పడిపోయింది. ఇక్కడ తమభూముల్లో విమానాశ్రయ విస్తరణ జరగడంతో ఏమీ చేయలేని అసహాయ స్థితిలో కొందరు రైతులు కుమిలిపోతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ భూములిచ్చి అమరావతిలో ప్యాకేజీ అందుకోని రైతులు తమ భూములను దక్కించుకోవలసిందేనని నిర్ణయించుకున్నారు. రన్‌వే సమీపంలో ఖాళీగా ఉన్న భూముల్లో వరి సాగు చేశారు. వారి సాహసం మరికొందరికి ధైర్యాన్నిచ్చింది. సాగు చేసిన వరి కోతకు సిద్ధంగా ఉంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

సరిగ్గా రెండు నెలల క్రితం విజయవాడ విమానాశ్రయ రన్‌వే భూముల్లో రైతులు వరి నాట్లు వేశారు. అది ఏపుగా పెరిగి, ధాన్యం కంకులతో కళకళలాడుతోంది. నేడో, రేపో రైతులు కోతకు సిద్ధమవుతున్నారు. వరి నారు పైరుగా మారినా, రైతుల భూముల వ్యవహారం మాత్రం అంగుళం కూడా ముందుకు కదలలేదు. పంటలు వేసిన  రైతులు తమ భూములపై నమ్మకం పెట్టుకున్నారు. ఇచ్చిన భూముల్లో రన్‌వేను నిర్మించగా, భూములు కోల్పోయిన రైతులు మాత్రం అమరావతి ప్యాకేజీకి విలువల లేక విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ హడావిడి చేశారే తప్ప.. ఈనాటికి గన్నవరం ప్రాంత రైతుల భూ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదు. 


 విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. నిరుపయోగంగా ఉన్న భూముల్లో కొందరు రైతులు తెగించి వరినాట్లు వేశారు.  సాగు చేశాం కాబట్టి భూమి మాదే అంటున్నారు రైతులు. ఒకవైపు రన్‌వే, మరోవైపు డీవోవీఆర్‌ (రాడార్‌ తరహా టవర్‌).. నడుమ రైతులు సాగు చేసిన భూములు.. ఏమి చేయాలో పాలుబోక ఎయిర్‌పోర్టు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్తులో రన్‌వేను ఇంకా విస్తరించటానికి ఇది ఇబ్బందిగానే ఉంటుంది. 


విజయవాడ విమానాశ్రయ విస్తరణకు గత ప్రభుత్వ హయాంలో 700 ఎకరాలను స్థానికంగా ఉంటున్న కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, దావాజీగూడెం, చిన్న అవుటపల్లి గ్రామాల రైతులు సమీకరణ విధానంలో అప్పగించారు. ఈ భూములను నాటి జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు అప్పగించింది. తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ప్రస్తుతం ఉన్న 2,286 మీటర్ల రన్‌వేను 3,360 మీటర్లుగా విస్తరించాలని ఏఏఐ నిర్ణయించింది. కొత్తగా 1084 మీటర్ల మేర రన్‌వేను విస్తరించింది కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఈ రన్‌వేను భవిష్యత్తు అవసరాల కోసం ఇంకా విస్తరించటానికి కూడా ముందుగానే భూములను సమీకరించి ఇచ్చారు. ప్రస్తుతం విస్తరించిన రన్‌వే ఎండింగ్‌ పాయింట్‌.. రైతుల నుంచి సమీకరించిన భూముల చివరి హద్దుల నడుమ ఏలూరు కాల్వ వెళుతోంది. ఈ కాల్వను మళ్లిస్తే తప్ప మొత్తం భూముల్లో రన్‌వేను నిర్మించటం సాధ్యం కాదు. విదేశీ విమానయానం పతాకస్థాయికి చేరుకున్నప్పుడు ఈ రన్‌వేను ఇంకా విస్తరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికి ఆ భూములను సాగు చేసినా, ఎయిర్‌పోర్టు అథారిటీకి వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ, భవిష్యత్తులో ఈ భూములను స్వాధీనంలోకి తీసుకోవటానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఈ భూములను స్వాధీనంలోకి తీసుకోవాలన్నా బోలెడంత ఖర్చు అవుతుంది. 


భూములు కోల్పోయిన వారిది ఒక సమస్య .. సాగు చేసుకుంటున్న వారిది మరో సమస్య విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులు అందుకు బదులుగా అమరావతిలో అందుకున్న ప్యాకేజీకి విలువలేకపోవడంతో లబోదిబో మంటున్నారు. ఎకరం రూ.కోటికి పైగా  ఖరీదు చేసే భూములను వదులుకుని, అమరావతిలో అందుకున్న 500 చదరపు గజాల రెసిడెన్షియల్‌, 750 చదరపు గజాల కమర్షియల్‌ స్థలాలకు కనీస విలువ కూడా లేకపోవటంతో రైతులు పడుతున్న ఆవేదన అంతా, ఇంతా కాదు. ఇదే సందర్భంలో అమరావతిలో ప్లాట్లు అందుకోని రైతులు విస్తరించకుండా విమానాశ్రయం స్వాధీనంలో నిరుపయోగంగా ఉన్న తమ భూముల్లో వరి సాగు చేపట్టారు. పంట దక్కుతుంది గానీ, ఎయిర్‌పోర్టు స్వాధీనంలో ఉన్న భూములు తమకు దక్కుతాయో, లేదోననే ఆందోళన మాత్రం వీరిని వీడడం లేదు. 

Updated Date - 2020-11-17T06:07:12+05:30 IST