దుర్భిణీ జ్ఞానం

ABN , First Publish Date - 2022-04-30T06:55:24+05:30 IST

చరిత్రను తలచుకుని గర్వపడడం వ్యక్తులకు, సమూహాలకు, వర్గాలకు , జాతులకు, దేశాలకు, సమస్త శ్రేణులకు సహజమే కాదు, అవసరం కూడా..

దుర్భిణీ జ్ఞానం

చరిత్రను తలచుకుని గర్వపడడం వ్యక్తులకు, సమూహాలకు, వర్గాలకు , జాతులకు, దేశాలకు, సమస్త శ్రేణులకు సహజమే కాదు, అవసరం కూడా. వర్తమానం సంక్షుభితమై, భవిష్యత్తు అనిశ్చితమైనపుడు, గతకీర్తి మరింత అవసరం. ఒక విజయానికి, వైభవానికి పరంపరాగత సంబంధం ఉన్నదనుకున్నప్పుడు, కర్తవ్యాలకు ప్రేరణ దొరుకుతుంది. కానీ, ఉష్ట్రపక్షి వలె గతంలో తలదూర్చి విశ్రమించడం హితవు కాదు. వర్తమాన వైఫల్యాలను మభ్యపెట్టుకునే ఆత్మవంచనా మంచిది కాదు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష, అన్న వెటకారం కానీ, తాతలు నేతులు తాగారు మూతులు వాసన చూడమనే సామెత కానీ గతస్మరణల్లో తారసపడే వికారాలకు ఉదాహరణలు. మనుషులు, వారి సహేతుకమైన గత విజయాలకు తప్పకుండా గర్వపడవలసిందే. పూర్వీకుల మేధకు సాధనకు అబ్బురపడవలసిందే. 


భారత ఉపఖండంలోని సమాజాలు కూడా ఒకనాడు అనేక రంగాలలో ఔన్నత్యాన్ని చవిచూశాయి. భౌతిక, కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో ప్రపంచంలోని మరే నాగరికతకూ తీసిపోని విజయాలను సాధించాయి. కానీ, మన పరంపర ఎక్కడో తప్పిపోయింది. భారతీయ సమాజాలలో ఏర్పడిన వర్ణ అంతరాలు, వివక్ష చదువును, పరిశోధనను, విజ్ఞానాన్ని సార్వజనీనం కాకుండా అడ్డుపడ్డాయి. తనకు తాను ముడుచుకునిపోయిన భారతీయ గ్రామం, విశాల ప్రపంచం నుంచి, ఆలోచనలనుంచి అత్యధికులను దూరం చేసింది.  ఐరోపా తనదైన పరిస్థితుల మధ్య, ప్రపంచం నలుమూలలకు వేయి బాహువులు చాచింది. పారిశ్రామిక విప్లవం ఆ దేశాలలో సకల శాస్త్రాలను, సాహిత్యాది రంగాలను వికసింపచేసింది. తమ ఆకాంక్షలకు, దురాశను తోడు చేసి, వాటికి మరింత వేగాన్నిచ్చే యంత్రాన్ని పూన్చి, పరుగులు తీసిన ఐరోపా సమాజాలు సైనికంగానే కాదు, బౌద్ధికంగానూ ప్రపంచాన్ని లోబరచుకున్నాయి. వలస నుంచి బయటపడడానికి భారతదేశంతో సహా అనేక దేశాలు తమను తాము కొత్తగా కనుగొనవలసి వచ్చింది. అందుకు వారికి చరిత్ర సహాయం చేసింది. ఒకనాటి స్వర్ణయుగాలు స్ఫూర్తి ఇచ్చాయి. ఆ స్ఫూర్తితో ఎంత వరకు ప్రయాణించగలిగాము? ఇంకా మన విజ్ఞానాన్ని జర్మనీవాడు, ఇంగ్లీషు వాడు ఎత్తుకుపోయి బాగుపడ్డారని నమ్ముతూ పోతున్నామా?


ఆవు ఆక్సిజన్‌ను వదులుతుందని ప్రచారం చేసే అజ్ఞానయుగం అవతరించిన తరువాత , మన గొప్పతనం గురించి గప్పాలు చెప్పే వారు పెరిగిపోయారు. దానితో నిజమైన భారతీయ ఔన్నత్యం మరుగునపడిపోతున్నది. టెలిస్కోపును భారతదేశంలో ఎప్పుడో కనుగొన్నారని చెబుతూ కర్ణాటకలోని హళేబీడులోని ఒక ఆలయంలో ఉన్న శిల్పాన్ని సాక్ష్యంగా చూపుతూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు సంచరిస్తున్నాయి. టెలిస్కోపును కనిపెట్టినది గెలీలియో అని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాము.  టెలిస్కోపు కానీ, మరే సాధనం కానీ ఒక్కరోజులో ఒక్క మనిషి కనిపెట్టడమో, సృష్టించడమో జరగదు. దానికెంతో నేపథ్యం ఉంటుంది. దూరంలో ఉన్న లక్ష్యాలను స్పష్టంగా చూడడానికి పనికివచ్చే సాధనం క్రీస్తుపూర్వం నుంచి ఏదో ఒక రూపంలో అందుబాటులో ఉన్నది. పాలపుంతలను లక్షలాది నక్షత్ర గుచ్ఛాలుగా గ్రీకు తత్వవేత్తలు అభివర్ణించారంటే, నగ్నదృష్టిని మించిన పరిశీలన ఏదో జరిగి ఉండాలి.  గెలిలియో, అతని బృందం, రోదసీలోకి మునుపటి కంటె మరింత దూరానికి, మరింత ప్రభావవంతంగా చూడగలిగే మెరుగైన దూరదర్శినిని రూపొందించారు. ఆధునిక టెలిస్కోపునకు ఆయనను ఆద్యుడిగా చెప్పడం అందుకే.  అద్దాలను తయారుచేసే సాంకేతికత పెరుగుతున్న క్రమంలోనే భూతద్దాలు కూడా అవతరించాయి. దర్పణశాస్త్రానికి ఆద్యులలో ఆక్సఫర్డ్ శాస్త్రవేత్త రోజర్ బేకన్ ను చెబుతారు. ఆయన కంటె ముందు ఇస్లామిక్ శాస్త్రవేత్తలు 8,9 శతాబ్దాలలో ఈ రంగంలో కీలక విజయాలు సాధించారు. మధ్య ఆసియా నుంచి భారతదేశానికి సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆర్యులు ఆకాశాన్ని లోతుగా అధ్యయనం చేశారు. రుగ్వేదంలో రోదసీ విశేషాలు చాలా ఉంటాయి. నావికాయానం లో దూరదర్శన పరికరాల ఉపయోగం ఎంతో ఉంటుంది. టెలిస్కోపు నకు పూర్వరూపం అనదగ్గ సాధనాలు భారతీయ నావికుల దగ్గర కూడా ఉంటాయి. మన జానపద కథలలో, స్థానిక జనగాథలలో  దూరాన్ని చూసే దుర్భిణీలు, ఎక్కడ ఉన్నా కనుగొనగలిగే మాంత్రిక ‘అంజనాలు’ తెలిసినవే. మన భాషలో ఆ మాటలు ఉన్నాయంటే, ఆ సాధనాల వెనుక ఆలోచన లేదా ఊహ మనుషులలో ఉన్నట్టే. అయితే, విమానాలు పురాణాలలో ఉన్నాయంటే, ఎగిరే ఊహ ఉన్నదని మాత్రమే తప్ప, ఆ నాడే విమానాలున్నట్టు కాదు. హళేబీడులోని హొయసల కాలపు శిల్పులకు దూరదర్శన సాధనమేదో తెలిసిఉండవచ్చు. ఆ కాలానికి, అంటే 12 వ శతాబ్దానికి ప్రపంచంలో అటువంటి సాధనం ఉనికిలో ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.


’శబ్ద రత్నాకరం‘ నిఘంటువులో ‘ఓకు’ అన్న ‘ఆరోపం’ (ఎంట్రీ) ఉన్నది. దాన్ని నిఘంటుకర్త ‘గ్రామ్యం’ అన్న కోవలోని పదంగా చెప్పారు. అంటే, గ్రామీణ సామాన్యులు, చదువుకోనివారు వాడే మాట. దాని అర్థం ఏమిటంటే, దుర్భిణీ అద్దము. దూరపు వస్తువులను చూడడానికి ఉపయోగించే పరికరం. దుర్భిణి అన్న మాటను అదే నిఘంటువులో హిందీభాషాపదంగా చెప్పారు. బ్రౌన్ కూర్చిన నిఘంటువులో ‘టెలిస్కోపు’ అన్న ఇంగ్లీషు మాటకు దుర్బీను, ఓకు అనే సమానార్థక పదాలను చెబుతూ, దూరాన ఉండేదాన్ని చూచే, కొసన అద్దము ఉండే గొట్టము అని వివరించారు. ఐరోపా నావికులు వచ్చాక, ఆ సాధనం పరిచయమైందా లేక, సాంప్రదాయికంగా దూరదర్శన సాధనం ఉన్నందున అచ్చతెలుగులో ఆ మాట ఉన్నదా అన్నది పరిశోధించాలి.  తెలుగు సమాజంలో కానీ, భారతదేశంలో కానీ ఒకప్పుడు దేశీయ దుర్భిణీలు ఉన్నప్పటికీ, ఎందువల్లనో అవి తరువాత కాలంలో టెలిస్కోపులు కాలేకపోయాయని అర్థం చేసుకోవాలి. గెలీలియో మన దగ్గర నుంచి టెక్నాలజీని ఎత్తుకుపోయాడని అనుకున్నా, ఇంగ్లీషు చరిత్రకారులు పాకిస్థాన్ లంచాలు తిని పుస్తకాలలో గెలీలియో పేరు రాశాడనుకున్నా, మన మీద లోకం జాలిపడుతుంది తప్ప ఉపయోగం ఉండదు.  మన దేశ వైభవం, విజ్ఞానం, తాత్వికత ఎందుకు సార్వజనీనం కాలేదో, పరంపరగా మారలేదో ఆత్మవిమర్శ చేసుకుంటే, భవిష్యత్తులో అయినా మరమ్మత్తు జరుగుతుంది.

Updated Date - 2022-04-30T06:55:24+05:30 IST