దాడుల సంస్కృతి

ABN , First Publish Date - 2021-02-03T06:27:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిధి కె. పట్టాభిరామ్‌పై విజయవాడలోని ఆయన నివాసం వద్ద జరిగిన దాడి అత్యంత హేయమైనది...

దాడుల సంస్కృతి

తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిధి కె. పట్టాభిరామ్‌పై విజయవాడలోని ఆయన నివాసం వద్ద జరిగిన దాడి అత్యంత హేయమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష రాజకీయాలు ఉద్రిక్తంగా ఉన్న మాట నిజమే కానీ, అవి తరచు హింసాత్మక రూపం తీసుకోవడం ఇటీవల అధికమైంది. ప్రభుత్వాన్ని నిష్కర్షగా విమర్శించడంలో, అవినీతిని ప్రస్తావించడంలో పట్టాభి ఏ మాత్రం వెనుకాడేవారు కాదని, అతనిని, పార్టీ కార్యకర్తలను, నేతలను భయభ్రాంతులను చేసేందుకే ఈ దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ చెబుతున్నది. కారుపై కూర్చున్న పట్టాభిపై ఇనుప రాడ్లతో దాడిచేసి గాయపరిచారు. రాజకీయ స్పర్థలను కానీ, అసహనాన్ని కానీ ఈ తరహాలో నెరవేర్చుకోవడమే మార్గమైతే, చట్టానికి, వ్యవస్థలకు అర్థమేముంటుంది? సరైన దర్యాప్తు జరిగి, దోషులకు కఠినంగా శిక్ష పడేట్టు వ్యవహరించకపోతే, అధికారపార్టీ నిర్వాకమే ఈ దాడి అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది.


పరిణామక్రమంలో మానవులు అనేక సంస్కారాలను రూపొందించుకున్నారు. ప్రయోజనాల ఘర్షణ ఉన్నప్పుడు భౌతికంగా తలపడడం ఒక్కటే తెలిసేది. ఒకరి నుంచి ఒకరు అపహరించడం లేదా రక్షించుకోవడం ఇదే జీవితంగా సాగేది. కాలక్రమంలో, బలప్రయోగం ఒక్కటే కాక, పరస్పరత ద్వారా, మంచిచెడ్డల వాదన ద్వారా, మధ్యవర్తుల ప్రమేయం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం అలవాటు చేసుకున్నారు. భారత రామాయణాల్లో కూడా యుద్ధాలకు ముందు రాయబారాలున్నాయి. కానీ, ఆధునికమయిన ముఠాకోరులు మాత్రం, శాసనాలను, మర్యాదలను పక్కనబెట్టి అసాంఘిక వర్తనకే మొగ్గుచూపుతారు. రానురాను ఈ ధోరణి పెరిగిపోవడం, మన నాగరికతా ప్రస్థానంపైనే సంశయం కలిగిస్తోంది. ఇంతకీ మనం ముందుకే వెడుతున్నామా? 


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ముఠాకోరు పంతం అని తప్ప మరో రకంగా చెప్పలేము. తమదే పైచేయి అనే భూస్వామ్య పోకడను ప్రదర్శించడం కోసం, ఎంత ప్రజాధనం ఖర్చుచేస్తున్నారో, ఎంతటి ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ప్రతిపక్ష నాయకులపై అకారణపు విచారణలు జరిపి, వారిని జైళ్లలో, ఆస్పత్రులలో ఉంచి ఆనందించడంలో ఏమి తృప్తి ఉన్నదో తెలియదు. రాజకీయ స్పర్ధ ఉండవచ్చు, ప్రతీకారేచ్ఛ కూడా ఉండవచ్చు. కానీ, వాటిని తీర్చుకోవడానికి న్యాయమైన, చట్టబద్ధమైన పద్ధతులున్నాయి. రాజకీయంగా పోరాడడం, రాజకీయంగా ఓడించడం అన్నవి సంస్కారవంతమైనవి. 


తెలంగాణలో రెండు రోజుల కిందట ఒక శాసనసభ్యుడి ఇంటిపై జరిగిన దాడిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. నివాసంపై రాళ్లు రువ్వడం ఏమిటి, విధ్వంసానికి పాల్పడడం ఏమిటి? తమకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అటువంటి చర్యకు పాల్పడతారా? జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అంత నిగ్రహం లేకుండా ప్రవర్తించడం ఏమిటి? ఆ వెంటనే, రాష్ట్ర అధికారపార్టీ కార్యకర్తలు, బిజెపి కార్యాలయంపై దాడి చేశారు. వీరు కూడా అదే కోవలోని వారు! అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరుగుతున్న విరాళాల సేకరణ వివాదాస్పదం ఎందుకు అవుతున్నదో ఒకసారి సంబంధిత పక్షాలన్నీ ఆలోచించాలి. ధార్మిక, మత పరమైన కార్యక్రమాన్ని ధార్మిక, మత సంస్థలే చేయడంలో సమస్య లేదు. ప్రత్యేకంగా ఒక పార్టీ, రామాలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణలో ముందుండి పనిచేయడం, మతాన్ని, రాజకీయాన్ని కలగాపులగం చేస్తుంది. ఆలయ నిర్మాణానికి విరాళాలిచ్చే వారు అన్ని పార్టీల వారూ ఉండవచ్చు. దేవుడిని ఈ జంఝాటం నుంచి వెలుపల ఉంచాలి. లేకపోతే, ధార్మిక కార్యక్రమాలు రాజకీయ పోరాటాలకు దారితీస్తాయి. చందాల వసూలుకు సంబంధించి లెక్కలను, సాధికారతను శాసనసభ్యుడు ప్రశ్నించాడనుకోండి, లేదా ఒక పార్టీ మీద అనుమానం కలిగేటట్టుగా ఆరోపణ చేశారనుకోండి, దానికి దాడి చేయడం ఎందుకు? తమ వైఖరిని, వాదనను ప్రజలకు చెప్పుకుంటే సరిపోదా?


ఇళ్ల మీద దాడులు అత్యంత దుర్మార్గమైనవి. ఒకప్పుడు బెంగాల్‌లో రాజకీయపోరాటాలు ఆరూపంలో జరిగేవి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, తక్షణ న్యాయం అమలుచేస్తామనే ఉత్సాహం రాజకీయపార్టీల కార్యకర్తలలో పెరిగితే, అది అరాచకానికే దారితీస్తుంది. అదే దేశవ్యాప్తం అయితే, సార్వత్రకం అయితే ఫాసిజంగా పరిణమిస్తుంది. అభ్యంతరాన్ని, విమర్శలను వెలిబుచ్చడానికి ఉన్న చట్టబద్ధ రూపాలను అధికారంలో ఉన్నవారే ఉల్లంఘిస్తే ఎట్లా? 


రామాలయ విరాళాల తీరు మీద వ్యాఖ్యలు చేసిన శాసనసభ్యుడే, మరొక వేదిక మీద రిజర్వేషన్ల మీద అభ్యంతరకరంగా మాట్లాడారు. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలలో చేరినవారికి సామర్థ్యం, ప్రతిభ ఉండవన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏదో మొక్కుబడి క్షమాపణ చెప్పినప్పటికీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయపార్టీ సంజాయిషీ కోరవలసిందే, ఏదో చర్య తీసుకోవలసిందే. శాసనసభ్యుడి కుసంస్కారపు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వివిధ సామాజిక, ప్రగతిశీల ఉద్యమసంఘాలు తీవ్ర నిరసనలు తెలిపాయి. ప్రదర్శనలు జరిపాయి. వారెవరూ మనుషుల మీదకు, ఇళ్ల మీదకు దాడులకు వెళ్లలేదు. తాము రాళ్ల దాడులు, రాడ్ల దాడులు చేసే వంటివారము కాదు, ప్రజాస్వామ్యవాదులము అని ఆ శ్రేణులు నిరూపించుకున్నాయి.

Updated Date - 2021-02-03T06:27:26+05:30 IST