చల్లదనం 'పెరుగు'తుంది

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

మండుటెండల్లో చల్లదనం కావాలంటే భోజనంలో పెరుగు ఉండాల్సిందే. పెరుగుతో వెరైటీగా పెరుగు పకోడీ, రైతా, కబాబ్‌,

చల్లదనం 'పెరుగు'తుంది

మండుటెండల్లో చల్లదనం కావాలంటే భోజనంలో పెరుగు ఉండాల్సిందే.  పెరుగుతో వెరైటీగా పెరుగు పకోడీ, రైతా, కబాబ్‌, రోటీ... ఇలా రకరకాల రెసిపీలు తయారుచేసుకోవచ్చు. 

శరీరానికి చలువతో పాటు కొత్తరుచులను ఆస్వాదించాలంటే వీటిని ట్రై చేయండి.


పెరుగు వడ

కావలసినవి

మినప్పప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు(ఒక ప్లేట్‌ కోసం), గ్రీన్‌ చట్నీ - రెండు టీస్పూన్లు, చింతపండు చట్నీ - రెండు టీస్పూన్లు, కారం - చిటికెడు, జీలకర్రపొడి - చిటికెడు, ఛాట్‌ మసాలా - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ

  • నానబెట్టుకున్న మినప్పప్పులో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి.
  • మినప్పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వడలుగా ఒత్తుకుంటూ నూనెలో వేయాలి.
  • చిన్నమంటపై వడలు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.
  • అలా వేగించుకున్న వడలను గోరు వెచ్చటి నీళ్లలో వేయాలి. ఐదు నిమిషాల పాటు ఉంచితే వడలు నీటిని గ్రహిస్తాయి. 
  • తరువాత వడలను చేతుల్లోకి తీసుకుంటూ, నీరు పోయేలా ఒత్తుతూ మరో ప్లేట్‌లో వేయాలి.
  • ఇప్పుడు ఆ వడల మీద పెరుగు పోయాలి. గ్రీన్‌ చట్నీ, చింతపండు చట్నీ వేయాలి. 
  • కారం, జీలకర్రపొడి, ఛాట్‌ మసాలా, రుచికి సరిపడా ఉప్పు చల్లాలి.
  • చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

పెరుగు పకోడీ

కావలసినవి

పెసరపప్పు - ఒక కప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, కారం - పావు టీస్పూన్‌, నల్ల రాతి ఉప్పు - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ధనియాలు - ఒక టీస్పూన్‌.


తయారీ

పెసరపప్పును నీళ్లలో 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు తీసేసి మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి.

తరువాత అందులో ఉప్పు, ధనియాలు, కొత్తిమీర వేసి కలపాలి.

పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి. గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.

మరొక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని అందులో వేగించి పెట్టుకున్న పకోడీలు వేయాలి. రెండు, మూడు నిమిషాలు నీళ్లలో నానిన తరువాత తీసి మరో బౌల్‌లో వేయాలి.

మరొక బౌల్‌లో పెరుగు తీసుకొని ఉప్పు, జీలకర్రపొడి, కారం, మిరియాల పొడి, నల్ల రాతి ఉప్పు వేసి కలపాలి.

ఈ మిశ్రమంలో పకోడీలు వేయాలి. కొత్తిమీర, కారం చల్లుకుని ఈవినింగ్‌ స్నాక్‌గా సర్వ్‌ చేసుకోవాలి.


దహీ అంజీర్‌ కబాబ్‌

కావలసినవి

అంజీర్‌ - 100గ్రాములు, పెరుగు - పావుకేజీ, పనీర్‌ - 400గ్రాములు, సెనగపిండి(వేగించినది) - 150గ్రాములు, బ్రెడ్‌ ముక్కలు - 150గ్రాములు, అల్లం - 50గ్రాములు, పచ్చిమిర్చి - 25గ్రాములు, కొత్తిమీర - 50 గ్రాములు, నెయ్యి - 200గ్రాములు, గరంమసాలా - 40 గ్రాములు, యాలకుల పొడి - 15 గ్రాములు, జీలకర్రపొడి(వేగించినవి) - 10 గ్రాములు, ఉప్పు - తగినంత.


తయారీ

ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో పనీర్‌, అల్లం, పచ్చిమర్చి, కొత్తిమీర, గరంమసాలా, యాలకుల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

తరువాత సెనగపిండి, బ్రెడ్‌ ముక్కలు వేసి చేత్తో నెమ్మదిగా మరోసారి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేయాలి.

ఒక్కో ఉండను వెడల్పుగా చేసుకుంటూ మధ్యలో అంజీర్‌ పెట్టి ఒత్తుకోవాలి. 

పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కబాబ్‌లు వేసి వేగించాలి. 

ఈ కబాబ్‌లను పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.


పెరుగు బ్రెడ్‌ 

కావలసినవి

బ్రెడ్‌ ముక్కలు - నాలుగైదు, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, క్యారెట్‌ తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, ఆవాలు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - కొద్దిగా.


తయారీ

బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. 

తరువాత నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో పెరుగు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి వేగించాలి.

కరివేపాకు, ఇంగువ వేయాలి.

ఇప్పుడు పెరుగు వేసి కలపాలి. కొద్దిగా క్యారెట్‌ తురుము, కొత్తిమీర వేయాలి. 

తరువాత వేగించి పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలున్న బౌల్‌లో పెరుగు మిశ్రమం వేయాలి.

చివరగా మిగిలిన క్యారెట్‌ తురుము, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వడ్డించాలి..


దహీ రోటీ

కావలసినవి

పెరుగు - అరకప్పు, జీలకర్రపొడి(వేగించినది) - రెండు టీస్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్‌ - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, గోధుమ పిండి - రెండు కప్పులు.


తయారీ

  • ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో జీలకర్రపొడి, చిల్లీ ఫ్లేక్స్‌, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  • తరువాత గోధుమపిండి వేసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి.
  • మూతపెట్టి ఒక అరగంటపాటు పక్కన పెట్టాలి.
  • పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీలు చేసుకోవాలి.
  • వీటిని పాన్‌పై కాల్చాలి. కొద్దిగా నూనె పెట్టుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  • వేడి వేడిగా తింటే ఈ చపాతీలు టేస్టీగా ఉంటాయి.

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST