కర్ఫ్యూ.. యథాతథం!

ABN , First Publish Date - 2021-05-18T04:49:02+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు యథావిధిగా కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి.

కర్ఫ్యూ.. యథాతథం!
శ్రీకాకుళంలో కర్ఫ్యూ

 నెలాఖరు వరకు కొనసాగింపు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు యథావిధిగా కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ముందుగా రెండు వారాల పాటు కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు  ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి కల్పించింది. ఈ గడువులోగా  వాణిజ్య సంస్థలు, బార్లు, రెస్టారెంట్‌లు తెరిచేందుకు, రాకపోకలు సాగించేందుకు అవకాశమిచ్చింది. మిగిలిన వేళల్లో పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల రెండు రోజులు కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కొత్తగా 1,287 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు మరింత పకడ్బందీగా కర్ఫ్యూ అమలుకు చర్యలు చేపడుతున్నారు. 144 సెక్షన్‌ కొనసాగించనున్నారు. ఎక్కువమంది గుమిగూడినా, మార్కెట్‌లు, వాణిజ్య సంస్థల వద్ద అధికంగా కొనుగోలుదారులు చేరినా పోలీసులు కేసులు నమోదు చేస్తారు.  


కొవిడ్‌తో  ఏడుగురి మృతి

జిల్లాలో కొవిడ్‌తో పోరాడి సోమవారం మరో ఏడుగురు మృతిచెందినట్టు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో మరో 1,287 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం 6,704 మందికి కరోనా పరీక్షలు చేశారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ 11,72,726 మంది నుంచి శ్వాబ్‌ సేకరించారు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 95,246కు చేరుకుంది. వీరిలో చాలామంది కోలుకున్నారు. సోమవారం 2,632 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 12,719 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  హోం ఐసోలేషన్‌లో 10,084 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 818 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1,817 మంది చికిత్స పొందుతున్నారు.  


జాబితాలో ఉన్నవారికే వ్యాక్సిన్‌ : కలెక్టర్‌ నివాస్‌

కలెక్టరేట్‌, మే 17 : జాబితాల్లో ఉన్నవారికే కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. సోమవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేస్తాం. ప్రభుత్వ సూచన మేరకు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయాలి. ఫలానా రోజు.. ఫలానా వ్యాక్సిన్‌ కేంద్రానికి రావాలని ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలి. జాబితాలో పేరు లేనివారికి వ్యాక్సిన్‌ వేయరాదు’ అని సూచించారు. ‘ఫీవర్‌ సర్వే పక్కాగా చేయాలి. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి.. నమూనాలు సేకరించాలి. పాజిటివ్‌ ఉన్న వారిని హోం ఐసోలేషన్‌ లేదా.. క్వారంటైన్‌ కేంద్రాలు, కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించేలా చర్యలు చేపట్టాలి. పాత్రునివలస, సంతబొమ్మాళి క్వారంటైన్‌ కేంద్రాల్లో అనేక బెడ్‌లు ఖాళీగా ఉన్నాయి. హోం ఐసోలేషన్‌ బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. గత 15 రోజులుగా ఏ ప్రాంతంలో తక్కువ నమూనాలు సేకరించారనే విషయాన్ని మండల సర్వేలైన్స్‌ అధికారులు గుర్తించి.. నివేదిక సమర్పించాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు. నమూనాలు తీసిన వెంటనే వాటిని పరీక్షలకు పంపేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 24 గంటల లోపు కరోనా ఫలితాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీనివాసులు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ గరోడ, ఆర్డీవోలు కిషోర్‌, టి.వి.ఎస్‌.జి. కుమార్‌ ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-05-18T04:49:02+05:30 IST