మహా రెబెల్స్‌కు ఊరట!

ABN , First Publish Date - 2022-06-28T08:08:02+05:30 IST

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా సమయమిచ్చింది.

మహా రెబెల్స్‌కు ఊరట!

అనర్హత నోటీసులపై జవాబుకు 12 దాకా గడువిచ్చిన సుప్రీం


అప్పటిదాకా ఆ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని డిప్యూటీ స్పీకర్‌కు ఆదేశాలు

వారి ప్రాణాలు, ఆస్తుల్ని కాపాడాలని ఉత్తర్వు

బలపరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన  కోర్టు

తదుపరి విచారణ జూలై 11కు వాయిదా

వారాంతంలోనే బలపరీక్ష?

షిండే శిబిరానికి పర్బణి ఎమ్మెల్యే రాహుల్‌!

9 మంది మంత్రుల శాఖల తొలగింపు

వారి పోర్టుఫోలియోలు ఇతరులకు..

మనీలాండరింగ్‌ కేసులో రౌత్‌కు ఈడీ సమన్లు

నన్ను ఆపడానికి పన్నిన కుట్ర ఇది: రౌత్‌

రాజీనామాకు రెండుసార్లు సిద్ధమైన ఉద్ధవ్‌

బీజేపీ వ్యూహాన్ని పసిగట్టి ఆపిన పవార్‌!


ముంబై/న్యూఢిల్లీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా సమయమిచ్చింది. అప్పటిదాకా అనర్హత ప్రక్రియపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని.. 39 మంది రెబెల్‌ శివసేన ఎమ్మెల్యేల ప్రాణాలను, స్వేచ్ఛను, వారి ఆస్తులను కాపాడాల్సిందిగా ఆదేశించింది.


16 మందిరెబెల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చిన డిప్యూటీ స్పీకర్‌ వాటికి సమాధానం ఇవ్వడానికి జూన్‌ 27 సాయంత్రం 5.30 గంటల దాకా మాత్రమే గడువిచ్చారు. అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ షిండే ఒక పిటిషన్‌ వేయగా.. డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలన్న తీర్మానంపై నిర్ణయం తీసుకునేదాకా తమపై ఆయన ఎలాం టి చర్యలూ తీసుకోకుండా నియంత్రించాలని కోరుతూ మిగతా 15 మంది ఎమ్మెల్యేలూ మరో పిటిషన్‌ సుప్రీంకోర్టులో వేశారు. వాటిపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ సోమవారం విచారణ జరిపి.. అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి గడువును పదిహేను రోజులు పొడిగించింది. ఈ పిటిషన్లపై ఐదురోజుల్లోగా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని డిప్యూటీ స్పీకర్‌కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసి, తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. కాగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు పెండింగ్‌లో ఉన్న సమయంలో.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు ఉంటుందా లేదా తేల్చడమే కోర్టు పని అని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. ఆ అధికారం డిప్యూటీ స్పీకర్‌కు ఉండదని గతంలో నబమ్‌ రెబియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనానికి తెలిపారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు ఈ పిటిషన్లు హైకోర్టులో కాకుండా నేరుగా సుప్రీంకోర్టులో ఎందుకు వేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. ముంబైలో పరిస్థితులు వారికి అనుకూలంగా లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


ఇక, అనర్హత పిటిషన్లపై ఏ విషయం తేలేదాకా సభలో బల పరీక్ష జరపకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని శివసేన చీఫ్‌విప్‌ సునీల్‌ ప్రభు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ దేవదత్‌ కామత్‌ అభ్యర్థించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. రెబెల్‌ ఎమ్మెల్యేలు బలపరీక్షకు కోరితే అప్పుడు యథాతథస్థితికి భంగం వాటిల్లుతుందని కామత్‌ ఆందోళన వెలిబుచ్చగా.. చట్టవిరుద్ధంగా ఏదైనా జరిగితే శివసేన కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక.. గువాహటిలో తలదాచుకున్న 39 మంది ఎమ్మెల్యేల ఆస్తులు, ప్రాణాలకు ఎలాంటి ముప్పూ రానివ్వబోమని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. 

కాగా.. త్వరలోనే గువాహటి నుంచి ఇద్దరు రెబెల్‌ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకుని గవర్నర్‌ కోష్యారీని కలిసి, బలపరీక్ష పెట్టాల్సిందిగా కోరతారని, ఈ వారాంతంలోనే గవర్నర్‌ ఫ్లోర్‌ టెస్టుకు ఆదేశిస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, ఇప్పటికే కుదేలైన శివసేనకు మరో షాక్‌. ఆ పార్టీకి చెందిన పర్బణి ఎమ్మెల్యే రాహుల్‌ పా టిల్‌ కూడా షిండే గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. తిరుగుబాటు చేసినవారిలో మంత్రులంతా సోమవారం వారి పదవులను కోల్పోయారు. షిండే సహా మొత్తం తొమ్మిది మంత్రుల పోర్టుఫోలియోలను వారి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖ, పీడబ్ల్యూడీలను సుభాష్‌ దేశాయ్‌కి అప్పగించారు. ఇప్పటికే ఆయన నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖకు ఇవి అదనం.

ఉదయ్‌ సామంత్‌ నిర్వహిస్తున్న ఉన్నత విద్యా శాఖను ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. కాగా, రెబెల్‌ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన ఒక కేసులో విచారణకు మంగళవారం హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొంది. ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని కుట్రగా రౌత్‌ అభివర్ణించారు. ఇది నన్ను ఆపడానికి చేసిన కుట్రే అన్నారు. 


రాజీనామాకు రెండుసార్లు సిద్ధమైన ఉద్ధవ్‌

బీజేపీ వ్యూహాన్ని పసిగట్టి ఆపిన పవార్‌!

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమసిపోవాలంటే విశ్వాస పరీక్ష అవసరమని, అయితే బీజేపీ కూడా అందుకు సుముఖంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏక్‌ నాథ్‌ షిండే వర్గం తమ పార్టీలో విలీనం అయితే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలలో పలువురు అందుకు అంగీకరించకపోవడంతో తమ గేమ్‌ ప్లాన్‌ ఫలిస్తుందా అన్నది చెప్పలేమని ఆ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన వెంటనే ఠాక్రే రాజీనామా చేస్తారని బీజేపీ భావించిందని.. ఆ అంచనాకు తగ్గట్టే జూన్‌ 21న, 22న రెండుసార్లు ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారని, కానీ బీజేపీ వ్యూహాన్ని ముందే గుర్తించిన ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ ఠాక్రే వెనుక బలంగా నిలబడి, రెండుసార్లూ వారించడంతో కమలనాథుల గేమ్‌ ప్లాన్‌ ఫలించలేదని తెలుస్తోంది. ఇక, శివసేన ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వస్తే వారిలో ఎంతమంది తిరిగి ఉద్ధవ్‌ శిబిరంలో చేరతారో చెప్పలేమని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఈ క్రమంలోనే.. ఏక్‌నాథ్‌ షిండే వర్గం విశ్వాస పరీక్ష కోసం గవర్నర్‌కు ఇప్పటిదాకా లేఖ రాయలేదని, గవర్నర్‌ కూడా ఈ విషయంపై అందుకే నిర్ణయం తీసుకోలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎవరి ప్రణాళిక ఎలా ఉన్నా.. సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో తమకు సమయం చిక్కిందని అన్ని వర్గాలూ భావిస్తున్నాయి. 

Updated Date - 2022-06-28T08:08:02+05:30 IST