మూగ జీవాలకు కరెంట్‌ కాటు

ABN , First Publish Date - 2022-08-14T06:59:11+05:30 IST

వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయం చేకూరుతుందనుకుంటున్న రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మేత కోసం వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురవుతున్నాయి. కిందికి వచ్చిన తీగలు తగిలి కొన్ని, రక్షణ వలయాలు లేని ట్రాన్స్‌ఫార్మర్‌లను తాకి మరికొన్ని వాటితో పాటు ప్రస్తుతం పడుతున్న వర్షాలకు ఇనుప స్తంభాలకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృత్యువాత పడుతున్నాయి.

మూగ జీవాలకు కరెంట్‌ కాటు
గత మూడు రోజుల కిందట తాడ్వాయిలో విద్యుదాఘాతంతో మృతి చెందిన గేదెలు

- బలిగొంటున్న లూజ్‌ లైన్‌లు, ఇనుప స్తంభాలు, కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు

- రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో మృత్యువాత

- ఆర్థికంగా నష్టపోతున్న రైతులు

తాడ్వాయి, ఆగస్టు 13: వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయం చేకూరుతుందనుకుంటున్న రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మేత కోసం వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురవుతున్నాయి. కిందికి వచ్చిన తీగలు తగిలి కొన్ని, రక్షణ వలయాలు లేని ట్రాన్స్‌ఫార్మర్‌లను తాకి మరికొన్ని వాటితో పాటు ప్రస్తుతం పడుతున్న వర్షాలకు ఇనుప స్తంభాలకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో గేదెలు మరణించాయి. వీటిధర రూ.వేలల్లో ఉండడంతో పేదరైతులు ఆర్థికంగా కోలుకోలేని స్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వపరంగా అందాల్సిన రుణం సైతం అంతంత మాత్రంగానే అందుతుందని రైతులు వాపోతున్నారు. గత మూడు రోజుల కిందట తాడ్వాయి మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మరణించడంతో రైతులకు రూ.3లక్షల వరకు నష్టం కలిగింది.

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు

విద్యుత్‌ అధికారులు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించకపోవడంతోనే విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కంచెలు లేని ట్రాన్స్‌ఫార్మర్‌లు, వేలాడే వైర్లు, ఇనుప స్తంభాలు ఉన్నవాటిపై దృష్టిసారించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడే త్వరలోనే పలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆ హామీలను అట్టకెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ప్రమాదానికి గురై మరణించిన గేదెల విద్యుత్‌షాక్‌కు గురికావడం ముమ్మాటికి విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్థులు అధికారులను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో ఇనుప విద్యుత్‌ స్తంభాలు తొలగించాల్సి ఉండగా వాటిని తొలగించకపోవడం, తీరా ప్రమాదం జరిగి గేదెలు మరణించిన తర్వాత మారుస్తామని విద్యుత్‌ అధికారులు చెప్పడంలోనే వారి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు.

ఇవీ ప్రమాదాలకు కారణాలు

ప్రస్తుతం వర్షాలు బాగా కురియడంతో రైతులు తమ పాడి పశువులను పొలాలకు, పచ్చిక బయళ్లు ఉన్న ప్రాంతానికి మేతకు తీసుకెళ్తున్నారు. మేత మేస్తూ కిందికి వెలాడుతున్న వైర్లను లేదంటే కిందికి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను తాకి విద్యుత్‌ ప్రమాదానికి గురవుతున్నాయి. వాస్తవానికి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ 5 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేయాల్సి ఉన్న చాలా చోట్ల తక్కువ ఎత్తులోనే ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాల కారణంగా తేమ ఎక్కువ ఉండడంతో ఇనుప స్తంభాలకు ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ సరఫరా అయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఆర్థిక సహాయం ఇలా పొందాలి

విద్యుదాఘాతంతో మృతి చెందిన పాడిపశువులకు ఆ శాఖ నుంచి ఆర్థిక సహాయం పొందడానికి రైతు తన ఆధార్‌కార్డు, పశువుల డాక్టర్‌ ధ్రువీకరణ, రెవెన్యూ అధికారుల పంచనామా, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ, గేదె మృతి చెందినట్లు వచ్చిన వార్త న్యూస్‌ పేపర్‌ కటింగ్‌, పాడి పశువు ఫొటో, సాక్షుల వివరాలతో కూడిన దరఖాస్తు ఫారాన్ని మండల ట్రాన్స్‌కో కార్యాలయంలో అందజేయాలి. అన్ని వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో సమర్పిస్తే మూడు నెలల్లో ఆర్థిక సహాయం అందుతుంది. కానీ కొన్నిచోట్ల రైతులకు అవగాహన లేకపోవడం, విద్యుత్‌ అధికారులు కనీసం దరఖాస్తు ఫారాన్ని నింపే పద్ధతి తెలియజేయకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.


Updated Date - 2022-08-14T06:59:11+05:30 IST