రైతులకు తప్పని తిప్పలు
పంట చేతికందే దశలో నీరందక ఎండుముఖం
ఆందోళనలో అన్నదాతలు
చేర్యాల/అక్కన్నపేట/హుస్నాబాద్ రూరల్/మద్దూరు, మార్చి 27 : వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కొద్ది రోజులుగా విద్యుత్‌శాఖాధికారులు కోతలు మొదలుపెట్టారు. వేసవికాలం ప్రారంభం కావడంతో విద్యుత్ వినియోగం అధికమైందన్న కారణంగా త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరాను ఇష్టారీతిగా తీస్తున్నారు. అయితే కరెంటు కోతలతో వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతులు విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా రైతులు 24 గంటల విద్యుత్‌కు అలవాటు పడటం, వర్షాలు సంమృద్ధిగా కురిసి నీటివనరులు పెరగడంతో ప్రభుత్వం వరి వద్దు అని ప్రకటించినప్పటికీ గతానికన్నా అధికంగా వరి సాగు చేశారు.
ప్రస్తుత యాసంగి సీజన్లో ముందస్తుగా సాగుచేసిన వరి పొట్ట దశకు చేరుకుని మరికొద్ది రోజుల్లో చేతికందనుంది. గతంలో సుమారు 20 గంటల పాటుగా త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయగా, వారం రోజుల నుంచి ఉదయం, సాయంత్రం కలిపి ప్రతీరోజు 16 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. సగానికిపైగా కోతపెట్టడంతో పంటకు సరైన నీరు అందక ఎండే పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయ బావుల ఆధారంగా వరి పంట సాగు చేసిన రైతులు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రీ-ఫేజ్ సరఫరా చేస్తుండటంతో గృహ అవసరాల వినియోగమూ అధికమై లోఓల్టేజ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మోటార్లు కాలిపోయే పరిస్థితి నెలకొన్నది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే త్రీఫేజ్ సరఫరా వ్యవధిని తగ్గించామని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి చేతికందే దశలో ఉన్న పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
కోతలు ఎత్తివేయాలంటూ బెక్కల్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
విద్యుత్ కోతలు ఎత్తివేసి రైతాంగాన్ని ఆదుకోవాలంటూ దూళిమిట్ట మండలంలోని బెక్కల్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆదివారం ధర్నా దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూకట్ల బాల్‌రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం వరిసాగు చేసుకున్న రైతులను నట్టేట ముంచేందుకు విద్యుత్ కోతలు విధిస్తుండటం సరైంది కాదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం యాసంగిలో వరి సాగుచేసుకున్న రైతుల పొలాలకు నీళ్లందకుండా విద్యుత్ కోతలు విధిస్తుండం శోచనీయమన్నారు. హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో రాత్రిపూట కరెంటు కోత విధించడంతో వరిచేన్లు ఎండిపోతుండడంతో శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి ఆదివారం రైతులతో కలిసి పరిశీలించారు.