కాటేస్తున్న కరెంట్‌

Published: Thu, 18 Aug 2022 00:35:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాటేస్తున్న కరెంట్‌లింగంపేట్‌లో విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన రైతు శ్రీనివాస్‌

- రైతులకు యమపాశాలుగా మారుతున్న విద్యుత్‌ కనెక్షన్‌లు

- పంట పొలాల్లోనే కరెంట్‌కు బలవుతున్న అన్నదాతలు

- జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న సంఘటనలు

- ఓ వైపు విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం.. మరోవైపు రైతుల అజాగ్రత్త

- గడిచిన నాలుగు నెలల్లోనే ఆరుగురు రైతుల మృతి

- పంట పొలాల్లోనే వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని విద్యుత్‌శాఖ

- చేసేదేమిలేక రైతులే మరమ్మతులు చేసుకుంటున్న వైనం

- ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న అన్నదాతలు

- రైతు కుటుంబాల్లో విషాదం నింపుతున్న ఘటనలు


కామారెడ్డి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమో.. రైతుల అజాగ్రత్తనో.. అన్నదాతలు కరెంట్‌కు బలవుతున్నారు. పంట పొలాల వద్ద విద్యుత్‌ మోటార్‌లు, కనెక్షన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను సరిచేసే క్రమంలో రైతులు విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పంట చేనుల్లో విద్యుత్‌ తీగలే రైతన్నలకు యమపాశాలుగా మారుతున్నాయి. పంటలకు నీరు పెట్టేక్రమంలో, పొలాల వద్ద ఉన్న మోటార్‌బోర్లను సరిదిద్దే క్రమంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రెండు రోజుల క్రితం లింగంపేట మండలం నాగారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే రైతు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురై పొలంలోనే కుప్పకూలాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. గడిచిన నాలుగు నెలల్లో ఆరుగురు రైతులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. బాధిత అన్నదాత కుటుంబాల్లోనూ విషాదం నింపుతోంది.

రైతు ప్రాణాలకు భరోసా కరువు

పొలం వద్దకు వెళ్లిన రైతు తిరిగి ఇంటికి చేరుతాడనే గ్యారంటీ లేకుండాపోతోంది. వేలాడే విద్యుత్‌ తీగలతో పాటు మోటార్‌ను, స్టాటర్‌లకు ఉండే కనెక్షన్‌ల వద్ద ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. దుక్కిదున్నిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పగలు, రాత్రి తేడాలేకుండా పొలానికి వెళ్లాల్సిందే. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాలను బలికొంటుంది. ప్రధానంగా విద్యుత్‌ రూపంలో మృత్యువు కోరలు చాస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం మరికొన్నిచోట్ల రైతుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో సుమారు లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. కొత్త కనెక్షన్‌ల కోసం మరో రెండు వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. మోటార్‌లు, స్టాటర్‌ల వద్ద ఏదైనా సమస్య తలెత్తితే రైతులే మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రైతుల ప్రాణాల మీదకు వస్తోంది. అన్నదాతలే కాకుండా ఈ విద్యుత్‌ తీగలకు ఎన్నో మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.

లో వోల్టేజీతో కాలిపోతున్న బోర్లు

వ్యయ ప్రయాసలకు ఓర్చి చీడపీడల నుంచి పంటలను కాపాడుకోగా చివర దశకు వచ్చిన పంటలకు నీరు అందించి పంటకు ప్రాణం పోసేందుకు రైతులు బోర్ల వద్దకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో అన్నదాతలు పంట పొలాల్లో విద్యుత్‌ మోటార్ల వద్ద ప్రమాద పరిస్థితుల్లో నీటిని పారించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. లో ఓల్టేజీ కారణంగానో హై ఓల్జేజీతోనో పంట పొలాల్లోని బోర్‌ మోటార్లు, స్టాటర్‌లు తరచూ కాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఎక్కడ పంట పొలాలు ఎండిపోతాయని దిగులుతో రైతులే కాలిపోయిన మోటార్లను మరమ్మతులు చేసుకునే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విద్యుత్‌శాఖ నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేయకపోవడం లో, హై వోల్టేజీ కరెంట్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌లు, మోటార్లు, స్టాటర్‌లు కాలిపోతూ రైతుల ప్రాణాల మీదకు వస్తోంది.

పంట పొలాల్లోనే కుప్పకూలుతున్న అన్నదాతలు

పంట పొలాలకు నీటిని పారించే క్రమంలో బోరుబావుల వద్దకు వెళ్తున్న రైతులు విద్యుత్‌షాక్‌ భారిన పడి పంట పొలాల్లోనే కుప్పకులుతున్నారు. రెండు రోజుల క్రితం లింగంపేట మండలం నాగారం గ్రామానికి చెందిన చింతకుంట శ్రీనివాస్‌ అనే రైతు పంట పొలాల్లోని మోటార్‌బోరు వద్ద విద్యుత్‌షాక్‌ తగిలి మృతి చెందాడు. ఆగస్టు 4న లింగంపేట మండలం ముంబాజిపేట గ్రామానికి చెందిన నరేష్‌ అనే యువరైతు తన పంట పొలంలో కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. జూన్‌ 7న రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లమ్మతండాకు చెందిన నవీన్‌ అనే రైతు పొలాల్లో ఎరువులు ట్రాక్టర్‌పై అన్‌లోడ్‌ చేస్తుండగా విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. ఏప్రిల్‌ 12 న రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామంలో వంశీ అనే యువకుడు తన పొలంలో స్టాటర్‌ డబ్బాకు విద్యుత్‌ వైర్లు తగిలి ఉండడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ ఏదో ఒక్కచోట జరుగుతునే ఉన్నాయి. ఈ సంవత్సరం నాలుగు నెలల కాలంలోనే ఆరుగురు మంది రైతులు బోరుబావుల వద్ద కరెంట్‌ షాక్‌ తగిలి పంట పొలాల్లోనే కుప్పకులారు.

విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం

జిల్లాలో ఏదో ఒకచోట పంట పొలాల్లో విద్యుత్‌షాక్‌కు గురై రైతులు మృతి చెందుతున్నా సంబంధిత శాఖ అధికారుల్లో చలనం రావడం లేదు. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పొలాల్లోని విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్‌ స్తంభాలకు మరమ్మతులు చేయకపోవడంతో వాటి భారిన పడి రైతులు మృత్యువాత పడుతున్నారు. విద్యుత్‌ సరఫరాలోను కోతలు ఉండడంతో బోరుమోటార్లు, స్టాటర్‌లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని సరిచేసే క్రమంలోనే అన్నదాతలు ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో బాధిత రైతుల కుటుంబాల్లో విషాదం నెలకొనడమే కాకుండా రోడ్డుబారిన పడుతున్నారు.

రైతుల అజాగ్రత్తతోను ప్రమాదాలు

మోటార్లు, స్టాటర్‌ బాక్స్‌ల వద్ద సమస్యలు తలెత్తుతున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మరమ్మతులు చేసే ప్రయత్నంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ కంచెలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. విద్యుత్‌ వైర్లను గమనించని రైతులు అటువైపు వెళ్లినప్పుడు షాక్‌కు గురై చనిపోతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్యలు ఉన్నాయి. విద్యుత్‌లైన్‌లు వేలాడుతూ ప్రమాదకరంగా ఉంటున్నాయి. చాలా చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లకు సరైన కంచెలు లేవు. ఆయా సమస్యల పరిష్కారంపై విద్యుత్‌శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బోరు బావుల వద్ద స్టాటర్‌ల విషయంలోను, సర్వీస్‌ వైర్ల విషయంలోను రైతులకు శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించి రైతులు ప్రమాదబారిన పడకుండా చూడాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.