
పెట్రోల్, డీజిల్, నూనెల ధరలు పైపైకి
హార్వెస్టర్లు, ట్రాక్టర్ల ఛార్జీలపై ప్రభావం
హోటళ్లలో టిఫిన్లు, భోజన రేట్లు పెంపు
గృహ వినియోగదారులకూ తప్పని షాక్
జిల్లా ప్రజలపై ఆర్థిక భారం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 27 : సిద్దిపేటలోని ఓ హోటల్లో వారం రోజుల కిందట రూ.30కి టిఫిన్ లభించేది. కానీ నేడు రూ.35కి ధర పెంచారు. ఇదేంటని ప్రశ్నించగా.. గ్యాస్ ధర పెరిగిందని, నూనెల రేట్లు మండిపోతున్నాయనే సమాధానం వచ్చింది.
ఇప్పుడిప్పుడే వరికోతలు ప్రారంభం అవుతున్నాయి. గతంలో హార్వెస్టర్ వినియోగానికి గంటకు రూ.1400 ఛార్జీ వసూలు చేయగా ప్రస్తుతం రూ.2వేలు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ భూములను చదును చేసే డోజర్ బ్లేడు ట్రాక్టర్‌కు రూ.200 పెంచేశారు. ఆటోలకూ అక్కడక్కడ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీనికి డీజిల్ ధరలను కారణంగా చూపిస్తున్నారు.
వంట గ్యాస్‌తోపాటు పెట్రోల్, డీజిల్, నూనెల ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నది. ప్రయాణం, భోజనం, రోజువారీ కార్యక్రమాలపై ఈ ధరలు ప్రభావం చూపుతున్నాయి. పరోక్షంగా రోజువారీ కూలీలు, వేతన జీవులకు కుటుంబ పోషణ కష్టమైంది.
నెలకు 1.10లక్షల గ్యాస్ సిలిండర్లు
సిద్దిపేట జిల్లాలో 2.91 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 19 గ్యాస్ ఏజన్సీలు ఉండగా ప్రతీనెల 1.10లక్షల సిలిండర్లను జిల్లా వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ఇందులో గృహ, వాణిజ్య అవసరాలు ఉన్నాయి. కాగా గడిచిన ఆరునెలల క్రితం గ్యాస్ ధరలు పెంచారు. ఆ తర్వాత ఇటీవలే సిలిండర్‌పై రూ.50 చొప్పున ధర పెరిగింది. ఈ లెక్కన ప్రతీనెల జిల్లా ప్రజలపై అదనంగా రూ.55 లక్షలు, ఏటా రూ.6.60కోట్ల భారం పడబోతున్నది. సబ్సిడీ కూడా రూ.50కి మించి వినియోగదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఒక్కో సిలిండర్‌కు రూ.1020పైగా వసూలు చేస్తున్నారు.
విద్యుత్ వినియోగదారులకు షాక్
విద్యుత్ వినియోగదారులకు కూడా ప్రభుత్వం షాకిచ్చింది. ఒక్కో యూనిట్‌పై 14 శాతం ఛార్జీలు పెంచనున్నారు. ప్రతీనెల జిల్లాలో విద్యుత్ ఛార్జీల ద్వారా సుమారుగా రూ.16 కోట్లు వసూలవుతున్నాయి. పెరిగిన శాతంతో అదనంగా మరో రూ.2 కోట్ల వరకు ప్రజలపై భారం పడనున్నది. జిల్లా వ్యాప్తంగా 5.27లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 3.20లక్షలు గృహ కనెక్షన్లు, 36,835 కమర్షియల్, 4240 పరిశ్రమలు, 1.50లక్షల వ్యవసాయ కనెక్షన్లు, దాదాపు మరో 10వేల వరకు ఇతర కనెక్షన్లు ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలతో భారం
జిల్లాలో 160 పెట్రోల్ బంకులు ఉన్నాయి. సగటున ప్రతీనెల 40లక్షల లీటర్ల పెట్రోల్, 80లక్షల లీటర్ల డీజిల్‌ను ఈ బంకుల్లో విక్రయిస్తున్నట్లు అంచనా. ఐదారు రోజులుగా ప్రతీరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.112 పలుకుతుండగా డీజిల్ ధర రూ.100కు చేరింది. ఈ లెక్కన ఏ రోజుకారోజు ప్రతీ వినియోగదారుడిపై భారం పడుతూనే ఉంది. ఇంధనాన్ని వినియోగించిన ప్రతీ సందర్భంలోనూ ఆయా ధరల ఆధారంగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నది.
ధరలపై పార్టీల పోరుబాట
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేసినట్లు నిరసనలు తెలిపారు. అంతేగాకుండా ద్విచక్రవాహనాన్ని తాళ్లతో లాగి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఇక పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ బీజేపీ నాయకులు వరుస ఆందోళనలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు పోరు సంధించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ధరల పెరుగుదల కొత్త ఊపు తెచ్చిందనే చెప్పాలి. సిద్దిపేట జిల్లాలో సాదాసీదాగా ఉన్న ఆ పార్టీ తరపున నిత్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా నినదిస్తూ ధరలు తగ్గించాలనే నినాదం ఎత్తుకున్నారు.
సబ్సిడీ డబ్బులు రావట్లేదు
వంట గ్యాస్ కంటే కట్టెల పొయ్యిని నమ్ముకుంటేనే మంచిది. ఒక్క సిలిండర్‌కు వెయ్యి రూపాయలకు పైన వసూలు చేస్తున్నారు. మా ఖాతాలో గ్యాస్ సబ్సిడీ డబ్బు కూడా వేయడం లేదు. మాలాంటి పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా కష్టం అవుతున్నది. నూనెల ధరలు కూడా పెంచారు. అన్ని రేట్లు పెరిగాయి.
- అనూష, గృహిణి, రామవరం
ఎవుసం భారంగా మారింది
పెట్రోల్, డీజిల్ ధరలతో ఎవుసం భారంగా మారింది. ఇప్పటికే హార్వెస్టర్ల రేట్లు పెంచారు. లెవలింగ్ ట్రాక్టర్ ఽకిరాయి పెరిగింది. వాళ్లను గట్టిగా ప్రశ్నిస్తే డీజిల్ ధర పెరిగిందని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకొక్క రేటు ఉంటున్నది. కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ధరలతో బతకడమే కష్టమైతాంది.
- స్వామి, యువరైతు, పోతారెడ్డిపేట
తగ్గించే దాకా పోరాటం
పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఇలా అన్నింటి ధరలు పెంచుతూపోతున్నారు. నియంత్రించాల్సిన టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వంట నూనెలను ఇష్టం వచ్చిన రేట్లకు విక్రయిస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ లేదు. మెడికల్ మాఫియాను కూడా అరికట్టాలి. ధరలు తగ్గేదాకా పోరాటం చేస్తాం.
- అత్తుఇమామ్, కాంగ్రెస్ సిద్దిపేట అధ్యక్షుడు