విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

ABN , First Publish Date - 2021-12-06T04:32:04+05:30 IST

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందాడు. ఈ ఘటన లింగసముద్రం పంచాయతీ పరిధిలోని జంపాలవారిపాలెం పొలాల్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య,కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్లో) మృతుడు నరసింహం

ఫ్యూజు వైరు తగిలిస్తుండగా ఘటన

విషాదంలో భార్య, కుటుంబ సభ్యులు

పెంట్రాల(లింగసముద్రం), డిసెంబరు 5 : విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందాడు. ఈ ఘటన లింగసముద్రం పంచాయతీ పరిధిలోని జంపాలవారిపాలెం పొలాల్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు బెజవాడ నరసింహం(38) తాను కౌలుకు తీసుకున్న పొలంలో మోటారు వేసేందుకు ఒక ఇనుప పైపునకు పైభాగంలో కర్ర బిగించి ఎడ్జ్‌ ఫ్యూజు తగిలిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఇనుప పైపు 11 కేవీ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో పాటు కింద ఉన్న ఎర్త్‌ తీగలు కూడా నరసింహం కాళ్లకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నరసింహం కేకలు విన్న చుట్టుపక్కల ఉన్న కొందరు గొర్రెల కాపరులు పరుగున వచ్చి చూచి వారి బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది వచ్చి నరసింహాన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ధనలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.


జీవనోపాధికి పెంట్రాలకు వచ్చి...

మండలంలోని అంగిరేకులపాడు గ్రామానికి చెందిన నరసింహం రెండేళ్ల నుంచి పెంట్రాలలో తన అత్త, మామలు ఇరిగినేని తిరుపతమ్మ, కొండలరావుల వద్ద ఉంటున్నాడు. జంపాలవారిపాలెంలో సుమారు 20 ఎకరాల మెట్ట భూముల్లో పత్తి సాగు చేసేందుకు కౌలుకు తీసుకున్నాడు. ఈ భూములలో ఉన్న మోటారు వేసేందుకు వచ్చి ఫ్యూజు తగిలిస్తుండగా ప్రమాదం జరిగింది. నరసింహం అకాల మృతితో పెంట్రాల, అంగిరేకులపాడు గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-12-06T04:32:04+05:30 IST