కరెంటు వర్రీ

ABN , First Publish Date - 2022-06-29T07:26:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌ వేళల్లో కుదింపు చేసింది. ఇప్పటి వరకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ప్రభుత్వం.. దాన్ని 9గంటలకు కుదించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక కరెంటు నిరంతరం సరఫరా కాక వేసిన విత్తనాలు మొలవక ఆందోళన చెందుతున్నారు.

కరెంటు వర్రీ

జిల్లాలో వ్యవసాయానికి కరెంటు కోత

తొమ్మిది గంటల సరఫరాతో రైతుల ఇబ్బందులు

నిరంతరం సరఫరా చేయాలని రోడ్డెక్కుతున్న రైతులు

సర్కారు ఆదేశాల మేరకే కోతలు : అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌ వేళల్లో కుదింపు చేసింది. ఇప్పటి వరకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ప్రభుత్వం.. దాన్ని 9గంటలకు కుదించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక కరెంటు నిరంతరం సరఫరా కాక వేసిన విత్తనాలు మొలవక ఆందోళన చెందుతున్నారు. కనీ సం 12గంటలైనా అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఆందోళన చేస్తున్నారు. 

ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు..

జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను అధికారులు కొనసాగిస్తున్నారు. గత యాసంగి వరకు నిరంతర విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేసి పంటలకు ఇబ్బందులు లేకుండా చూశారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ట్రాన్స్‌కో అధికారులు ఏప్రిల్‌ నుంచి ఈ విధానాన్ని మొదలుపెట్టారు. యాసంగి పంటలు ఏప్రిల్‌ వరకే చివరి దశకు వచ్చినందున రైతులకు ఇబ్బందులు ఏర్పడలేదు. వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు పడలేదు. అనుకున్న విధంగా చెరువుల్లో నీళ్లు రాలేదు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు వర్షాలు లేక భూగర్భ జలాలపైనే ఆధారపడి ఈ పంటలను వేస్తున్నారు. మొక్కజొన్న, సోయా, పసుపు, ఇతర పంటలను సాగుచేశారు. వీటితో పాటు వరిని కూడా వేస్తున్నారు. బోధన్‌ డివిజన్‌లో ఎక్కువ మొత్తంలో వరిసాగు చేశారు. ఈ ప్రాంతానికి గడిచిన మూడు రోజుల క్రితం నిజాంసాగర్‌ నీటిని విడుదల చేయడం వల్ల సమస్య తప్పినా మిగతా ప్రాంతాల్లో మాత్రం కరెంటు సమస్య తగ్గలేదు.

సాగుకు సరిపోని కరెంట్‌

జిల్లాలో వ్యవసాయానికి 9 గంటల కరెంటు నిరంతరం ఇస్తున్నా పంటలు వేసిన రైతులకు సరిపోవడంలేదు. ఆలోపు నీటిని అందించేందుకు సాధ్యం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి. కొంతమంది రైతులు ఆరుతడి పంటలకు డ్రిప్‌ వాడుతుండగా మరికొంతమంది రైతులు నేరుగా నీటిని అందిస్తున్నారు. ఇప్పటి వరకు సబ్‌స్టేషన్‌ల వారీగా అధికారులను కలిసిన రైతులు తమకు నిరంతరం విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కనీసం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరం విద్యుత్‌ 12 గంటల పాటు సరఫరా చేయాలని కోరుతున్నారు. భారీ వర్షాలు పడకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు మోర్తాడ్‌ వద్ద మంగళవారం రహదారిపై ధర్నా నిర్వహించారు. తమకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.

ప్రతిరోజూ 1.7 మిలియన్‌ యూనిట్ల వినియోగం

జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయానికి ప్రతిరోజూ 1.7 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతుంది. జిల్లాలో లక్షా 75వేలకు పైగా బోర్లు ఉన్నాయి. వీటిలో లక్ష బోర్ల వరకు ప్రస్తుతం కరెంటు వినియోగిస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేస్తున్నారు. వరిసాగు పూర్తి స్థాయిలో మొదలైతే అన్ని బోర్లు వినియోగిస్తే మరింత ఎక్కువగా కరెంటు వినియోగం అవుతుందని వారు అంచనాకు వస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ 5.8 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతుంది. వేసవి ఎక్కువగా ఉన్న మే నెలలో 9లక్షల మిలియన్‌ యూనిట్‌ వరకు జిల్లాలో వినియోగం అయింది. వ్యవసాయానికి తక్కువగా వినియోగం అయిన వేసవిలో ఇళ్లతో పాటు పరిశ్రమలు ఎక్కువగా వినియోగించడం వల్ల విద్యుత్‌వినియోగం అయింది. కొద్దిగా వర్షాలు పడడం వల్ల వేడి తగ్గడంతో గృహ వినియోగం కొంత తగ్గినా వ్యవసాయం వినియోగం పెరిగింది. ప్రభుత్వం పట్టించుకుని కనీసం 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తే రైతులకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. 

కోతలు లేకుండా సరఫరా చేయాలి..

ఫ సాగర్‌, మాయాపూర్‌  

వానాకాలం మొదలైనప్పటి నుంచి కరెం టు కోతలు లేకుండా ఇవ్వడంలేదు. తొమ్మిది గంటలే సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు లేక సోయా వేశాను. నిరంతర కరెంటు ఇస్తే వరినాట్లు వేసేవాన్ని. గత సంవత్సరంలాగా వ్యవసాయానికి నిరంతర కరెంటు సరఫరా చేయాలి. ఇబ్బందులు లేకుండా చూడాలి.

ప్రభుత్వ ఆదేశాల మేరకే సరఫరా..

ఫ రవీందర్‌, ఎస్‌ఈ 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవసాయానికి 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా ఆ సమయంలో కోతలు విధిస్తే అంతమొత్తంలో పెంచి విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం.

రహదారిపై రైతుల బైఠాయింపు

మోర్తాడ్‌: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై తిమ్మాపూర్‌కు చెందిన రైతులు బైఠాయించారు. వ్యవసా యానికి కరెంటు కోతలకు నిరసనగా మంగళవారం రాస్తారోకో చేపట్టారు. కేవలం నాలుగు గంటల కరెంటు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 12గంటలైనా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఎస్సై ముత్యంరాజ్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌, ఏడీఈ జయరాజ్‌, విద్యుత్‌ శాఖ ఏఈలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Updated Date - 2022-06-29T07:26:36+05:30 IST