కేంద్రం తవ్వే అప్పుల గొయ్యి!

ABN , First Publish Date - 2022-04-07T08:12:22+05:30 IST

రాష్ట్రాలు అప్పులు చేయడానికి పరిమితులు ఉన్నాయి. ఒక పద్ధతి ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం సహా అనేక చట్టాలు ఉన్నాయి. కానీ... ఆంధ్రప్రదేశ్‌కు ఇవేవీ వర్తించవన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది.

కేంద్రం తవ్వే అప్పుల గొయ్యి!

ఆంధ్రను ఊబిలోకి తోస్తున్న కేంద్రం!

అప్పుల వెంట పరుగులు తీస్తున్న రాష్ట్రం

అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తున్న కేంద్రం

తాజాగా రూ.80,000 కోట్లకు అభ్యర్థన 

ఇప్పటికే ఏపీ అప్పులు 7.85 లక్షల కోట్లు

ఇలా చేస్తూ పోతే పరిస్థితి దుర్భరమే

ఆదాయమంతా అప్పులు, వడ్డీలకే!


కేంద్రం ఏం కోరుకుంటోంది? ఆంధ్రా బాగుపడాలనుకుంటోందా? లేక... అప్పులపాలై, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవాలనుకుంటోందా? పోలవరం అంచనాలకు ఆమోదం, ప్రత్యేక హోదా వంటి విభజన హామీలు అమలుచేయకున్నా పర్లేదు... ‘అడిగినంత అప్పు... ఇంకా చెప్పాలంటే, అడిగిన దానికంటే ఎక్కువ అప్పులకు అనుమతిస్తే చాలు! ఏపీ సర్కారు అలా సర్దుకుపోతుంది’ అని కేంద్రం భావిస్తోందా? ప్రస్తుతం కేంద్ర వైఖరి చూస్తే అలాగే అనిపిస్తోంది!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రాలు అప్పులు చేయడానికి పరిమితులు ఉన్నాయి. ఒక పద్ధతి ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం సహా అనేక చట్టాలు ఉన్నాయి. కానీ... ఆంధ్రప్రదేశ్‌కు ఇవేవీ వర్తించవన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ‘ముఖ్యమంత్రి అడగడమే ఆలస్యం’ అన్నట్లుగా అదనపు అప్పులకు అనుమతి ఇస్తోంది. ఏపీ సర్కారు పంపుతున్న తప్పుడు లెక్కలను చూసీ చూడనట్లుగా వదిలేస్తోంది. అంతేకాదు... అనుమతించిన దానికంటే ఎక్కువ అప్పు చేసినా పట్టించుకోవడంలేదు. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా కుప్పకూలిపోతే... ఆ పాపంలో రాష్ట్రానికి ఎంత వాటా ఉందో, కేంద్రానికీ అంతే ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.7.85 లక్షల కోట్లకు చేరాయి. వైసీపీ సర్కారు మూడేళ్లలో ఏటా లక్ష కోట్లకు తగ్గకుండా అప్పులు చేస్తోంది. ఒక రాష్ట్రం స్తోమతకు మించి, పరిమితి దాటి, అడ్డగోలుగా అప్పులు చేస్తే... అడ్డుకోవాల్సింది కేంద్రమే. కానీ.. ఏపీ విషయంలో కేంద్రం ‘ఉదారం’గా వ్యవహరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్లలో కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి ఏడాదికి సగటున రూ.45,000 కోట్లు. అయినప్పటికీ... జగన్‌ సర్కారు ఏడాదికి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది. ఇప్పుడు ఏకంగా రూ.80,000 కోట్ల అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఈ మేరకు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకే స్థాయిలో అప్పులు చేస్తుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అడిగిన దానికంటే ఎక్కువే 

జనవరి 3వ తేదీన సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి గత ఆర్థిక సంవత్సరానికి 42,400 కోట్లకు తగ్గకుండా అప్పులకు అనుమతివ్వాలని ప్రధానిని కోరారు. కానీ, ఆ ఏడాదికి కేంద్రం రూ.46,400 కోట్ల అప్పులకు అనుమతిచ్చింది. ఈ నెల 5వ తేదీన ప్రధాని మోదీతో జగన్‌ మరోసారి భేటీ అయ్యారు. 2022-23లో ఏపీకి రూ.80,000 కోట్లకు తగ్గకుండా అప్పులకు అనుమతివ్వాలని కోరారు. ప్రతి సంవత్సరం కేంద్రం రాష్ట్రాలకు రెండుసార్లు ఈ అనుమతులు ఇస్తుంది. కానీ, తమకు ఒకేసారి మొత్తం అప్పులకు అనుమతివ్వాలని జగన్‌ సర్కారు కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది. 


కేంద్రానికి తప్పుడు సమాచారం 

అప్పులకు సంబంఽధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం  ఇస్తోంది. జీఎ్‌సడీపీ అంచనాల నుంచి ఈఏపీ, నాబార్డు రుణాలు, స్టేట్‌ పీఎఫ్‌ నెట్‌ వరకు అన్ని గణాంకాలు తప్పుగానే పంపుతోంది. స్తోమతకు మించి రుణ అర్హత సాధిస్తోంది. ఇందుకు కేంద్రం కూడా ఉదారంగా సహకరిస్తోంది. ఉదాహరణకు 2022-23లో ఏపీ జీఎ్‌సడీపీ రూ.13,38,575 కోట్లుగా నమోదవుతుందని రాష్ట్రం అంచనా వేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇందులో 3.5 శాతం మాత్రమే అప్పుగా తెచ్చుకునేందుకు రాష్ట్రానికి అనుమతివ్వాలి. అంటే దాదాపు రూ.47,000 కోట్లు. కానీ రాష్ట్రం ఏకంగా రూ.80,000 కోట్ల అప్పులకు అనుమతి కోరింది. ఈ మొత్తం రాష్ట్ర జీఎ్‌సడీపీలో దాదాపు 6 శాతం. ఇక రాష్ట్ర ఉద్యోగుల ఈపీఎఫ్‌ నగదును కూడా రాష్ట్రం వాడుకుంటోంది. గత మూడేళ్ల నుంచి ఏటా సగటున రూ.11,000 కోట్ల వరకు వాడుకుంది. కానీ, ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో రూ.240 కోట్లు మాత్రమే పీఎఫ్‌ నగదు వాడుతామని పేర్కొంది. ఈ అంచనాలనే కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం అనుమతి ఇవ్వాలనుకున్న అప్పు నుంచి రూ.240 కోట్లు మినహాయించుకుని మిగిలిన మొత్తానికి అనుమతిస్తుంది. వాస్తవానికి రాష్ట్రం సరైన లెక్కలు పంపితే మొత్తం అప్పుల అనుమతి నుంచి రూ.11,000 కోట్లు కేంద్రం మినహాయించుకోవాలి. 


కేంద్రం ద్వంద్వ వైఖరి 

గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఈపీఎఫ్‌ నగదు వాడకానికి సంబంధించి కాగ్‌ నిర్ధారించిన లెక్కల్లో గణాంకాలు స్పష్టంగా ఉన్నాయి. ఏటా 11,000 కోట్లు వాడుకుంటున్నట్టు తేల్చింది. అయినా రాష్ట్రం మళ్లీ దొంగ లెక్కలే పంపుతోంది. కేంద్రం కూడా చూసి చూడనట్టుగా రాష్ట్రం అడిగినన్ని అప్పులు ఇచ్చేస్తోంది. అంతేగాక కేంద్రం రాష్ట్రానికి అప్పులిచ్చే విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందనే విమర్శలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చేముందు ఆలోచించుకోవాలని ఓ వైపు బ్యాంకులకు చెబుతోంది. మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ రాష్ట్రానికి అర్హతకు మించిన అప్పులకు అనుమతిస్తోంది. 


అన్నీ తెలిసి కూడా అనుమతులు

2020-21లో ప్రభుత్వానికి రూ.1,18,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.57,408 కోట్లుమాత్రమే. మిగిలినది కేంద్రం నుంచి వచ్చిన పన్నుల్లో వాటా, గ్రాంట్లు, పన్నేతర ఆదాయం. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కట్టిన అప్పుల అసలు, వడ్డీలు రూ.64,000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కంటే  ఎక్కువ. ఆ ఏడాది తెచ్చిన అప్పు దాదాపు రూ.లక్ష కోట్లు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు చేస్తోంది. అప్పుల విషయంలో జగన్‌ సర్కార్‌ రాజ్యాంగ విరుద్ధ విధానా లు పాటిస్తోంది. కేంద్రానికి ఈ విషయాలన్నీ తెలిసి కూడా అడిగిన దాని కంటే ఎక్కువ అప్పులకు అనుమతివ్వడం రాష్ట్రాన్ని ఆర్థికంగా ముం చేయడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


అప్పులు తేవడంపైనే దృష్టి 

ప్రభుత్వాలు సొంత ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారిస్తాయి. అవసరమైనంత మేరకు అప్పు చేస్తాయి. వాటిలో ఎక్కువగా అభివృద్ధి కోసం ఖర్చు పెడతాయి. కానీ, జగన్‌ సర్కారు తీరే వేరు. రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించడం లేదు. ఎక్కడెక్కడ నుంచి అప్పులు తేవాలనే దానిపై మాత్రమే దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నంతమంది సలహాదారులు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేరు. జగన్‌ నియమించిన సలహాదారులు కొందరు అప్పులు ఎలా తేవాలి? వాటికి సంబంధించి కొత్త మార్గాలను అన్వేషించే పనిలో ఉన్నారు. అప్పులు పుట్టించడం కోసమే ఆర్థిక శాఖలో ఏకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేశారు. దానికి రీసోర్స్‌ మొబిలైజేషన్‌ అనే పేరు పెట్టారు. 

Updated Date - 2022-04-07T08:12:22+05:30 IST