రాజన్న ఆలయంలో అపచారం

ABN , First Publish Date - 2021-03-06T08:44:25+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో గురువారం అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదాస్పదమైంది.

రాజన్న ఆలయంలో అపచారం

  • గర్భగుడిలో కైలాసగిరి వెండి పటం బిగింపు
  • విమర్శలు రావడంతో తొలగించిన ఆలయ ఏఈవో

వేములవాడ, మార్చి 5: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో గురువారం అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదాస్పదమైంది. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వరంగల్‌కు చెందిన ఓ వైద్యుడు ఆరున్నర కిలోల వెండితో ఈ పటాన్ని తయారు చేయించారని, పటం సరిగా అమరుతుందో.. లేదోనని వైద్యుడికి సన్నిహితుడైన ఆలయ అధికారి ఒకరు తాత్కాలికంగా బిగించి చూశారని కొందరు సిబ్బంది తెలిపారు. కాగా.. వెండి పటం విషయమై తమకు సమాచారం లేదని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ స్పష్టం చేశారు. విషయం తమ దృష్టికి రాగానే వెంటనే తొలగించామని ఏఈవో హరికిషన్‌ వివరించారు. కాగా.. గర్భాలయంలో వెండి పటాన్ని బిగించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అధికారులను నిలదీశారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా మధ్య ఉన్న రాజన్న ఆలయంలోకి అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి వెండి పటం ఎలా బిగిస్తారని ప్రశ్నించారు.

Updated Date - 2021-03-06T08:44:25+05:30 IST