పింఛన్లు కట్‌

ABN , First Publish Date - 2021-08-02T05:05:34+05:30 IST

జిల్లాలో సామాజిక పింఛన్ల ఏరివేత తంతు కొనసాగుతూ ఉంది. గత నెలలో ఒంటరి, వితంతు పింఛన్లు తొలగించగా ఆరోగ్య పింఛన్లలోనూ అనర్హులు ఉన్నారంటూ కోత విధించారు. తాజాగా ఈకేవైసీ చేయించుకో లేదన్న సాకుతో 2,014 పింఛన్లు ఆగస్టు నెలలో ఆపేశారు. జిల్లాలో 16 రకాల పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది.

పింఛన్లు కట్‌

ఒక్క నెలలోనే 2 వేల మందికి నిలిపేసిన వైనం

ఈకేవైసీ సాకుతో బ్రేక్‌

(కొమరాడ)

జిల్లాలో సామాజిక పింఛన్ల ఏరివేత తంతు కొనసాగుతూ ఉంది. గత నెలలో ఒంటరి, వితంతు పింఛన్లు తొలగించగా ఆరోగ్య పింఛన్లలోనూ అనర్హులు ఉన్నారంటూ కోత విధించా రు. తాజాగా ఈకేవైసీ చేయించుకో లేదన్న సాకుతో 2,014 పింఛన్లు ఆగస్టు నెలలో ఆపేశారు. జిల్లాలో 16 రకాల పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూలై నెలలో 3,31,216 మందికి మంజూరు కాగా ఆగస్టులో వారి సంఖ్య 3,29,202కు తగ్గింది. అంటే 2,014 మంది ఆగస్టులో పింఛన్లు పొందే అర్హత కోల్పోయారు.  ఏరివేతలో భాగంగానే తగ్గిపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణాలు, లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వలస పోవడం తదితర కారణాల వల్లే తగ్గాయని అధికారులు చెబుతున్నారు. చాలామంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈకేవైసీ (ఎలకా్ట్రనిక్‌ నో యువర్‌ కష్టమర్‌)ని గత నెలలో జిల్లా వ్యాప్తంగా చేపట్టింది. ఈకేవైసీ చేయించుకోవడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లబ్ధిదారుల వద్దకు వలంటీర్లు వెళ్లి వేలిముద్రలు తీసుకోవాలి. సరిగా పడకపోతే ఫొటో తీసి వివరాలను ఈకేవైసీ చేసి సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌కు పంపాలి. అక్కడ పరిశీలన అనంతరం ఎంపీడీవో లాగిన్‌కు పంపించాలి. లబ్ధిదారుల వివరాలను ఎంపీడీవో పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాతే పింఛన్‌ పొందడానికి వీలుంటుంది. అయితే ఈ విధానంలో తీవ్రమైన సాంకేతిక సమస్య ఉన్నట్లు సమాచారం. అందువల్ల అర్హత ఉన్నా ఆగస్టు నెల పింఛను పొందలేని పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు.

పింఛను రాలేదు

ప్రతి నెల పింఛను ఇచ్చేందుకు వలంటీరు వచ్చేవారు. ఈ నెలలో పింఛను నిలిచిపోయిందని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ఈకేవైసీ జరగలేదని చెప్పారు. నా బతుకు పింఛన్‌పై ఆధారపడి ఉంది. ఈ నెలరోజులూ నేను ఎలా బతకాలి.

- చింతాడ పున్నయ్య, పెదఖేర్జిల, కొమరాడ మండలం

ఆందోళన చెందవద్దు

అర్హతున్న లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరోమారు వారి అర్హత (ఈకేవైసీ) పరిశీలించి పింఛను అందజేస్తాం.

- ఎం.గోపాలకృష్ణ, ఎంపీడీవో, కొమరాడ


Updated Date - 2021-08-02T05:05:34+05:30 IST