‘అమ్మఒడి’కి కోత

Published: Sat, 25 Jun 2022 00:32:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమ్మఒడికి కోత

పలు నిబంధనలతో భారీగా వడపోత

వివరాలు లేవంటున్న విద్యాశాఖ  

సచివాలయాల్లో జాబితాల ప్రకటన

తొలగింపులపై సర్వత్రా చర్చ 

చాలామంది అకౌంట్ల్లు ఇన్‌యాక్టివ్‌

బ్యాంకులకు పరుగులు తీస్తున్న విద్యార్థుల తల్లులు

పీసీపల్లి సచివాలయ పరిధిలో 41 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా చూపించగా పాత సింగరాయకొండలో 48, సింగరాయకొండ-1 సచివాలయంలో 95 మందిని తీసేసినట్లు సమాచారం. 

దొనకొండ-1 సచివాలయంలో 349మందిని లబ్ధిదారులుగా చూపారు. ఆ సంఖ్య గత ఏడాది కన్నా తక్కువే. అలాగే అక్కడ 58 మందిని అనర్హులుగా  ప్రకటించారు. దొనకొండ-2 సచివాలయంలో 228 మందిని అర్హులుగా, 38మందిని అనర్హులుగా చూపారు. 

ఒంగోలు రూరల్‌ మండలం వలేటివారిపాలెంలో 14మందిని అనర్హులుగా పేర్కొన్నారు. దశరాజుపల్లిలో ఆరుగురిని చూపారు. 

 జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అంతా కోతలమయం. తాజాగా సచివాలయాల్లో ఉంచిన అమ్మఒడి జాబితాల్లో తొలగింపులు, తిరస్కరణలకు కారణాలను చూస్తే అత్యధికంగా విద్యుత్‌ వాడకం, కుటుంబంలోని వారు రూ.12వేల కన్నా అధికంగా వేతనం పొందడం వంటివి ఉన్నాయి. 75శాతం హాజరు లేకపోవ డంతోపాటు తల్లుల పేరున్న రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్లు లేవన్న సాంకేతిక అంశాలు అధికంగా ఉంటున్నాయి. ఈ నిబంధనలతో మధ్యతరగతి వర్గాలకు చెందిన కుటుంబాల వారికి అమ్మఒడి దక్కకుండా పోతోంది. దీనికితోడు  అర్హత లన్నీ ఉన్నా చివర్లో అకౌంట్లు ఇన్‌యాక్టివ్‌ చూపుతుండటంతో మహిళలు బ్యాంకు లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

ఒంగోలు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జగనన్న అమ్మఒడి పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా తల్లులకు చుక్కలు చూపెడుతోంది. గత రెండేళ్ల నుంచి అర్హులైన వారు ఈసారి అనర్హులు ఎలా అయ్యారో తెలియక సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అమ్మఒడి ఆంక్షలు ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈనెల 27న తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల వారీగా వెల్లడించింది. విద్యాశాఖ పరిధిలో ఈ పథకం అమలు చేస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులకు మాత్రం వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది. కాగా సచివాలయాల్లో ప్రకటించిన జాబితాల్లో అనేకమంది లబ్ధిదారులను పలు నిబంధనల పేరుతో తొలగించి వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కడైనా 1 నుంచి 10 వ తరగతి అలాగే ఇంటర్‌ చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు నగదును ప్రభుత్వం నేరుగా వేస్తుంది. అలా ఉమ్మడి జిల్లాలో 2019-20లో 2,76,115మంది తల్లులకు రూ.414.20కోట్లు, 2020-21లో 2,82,080 మందికి రూ.423.01కోట్లు జమ చేశారు. 


సచివాలయాల్లో జాబితాలు

అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో వెల్లడించగా వాటిని చూసుకున్న తల్లులు అనేకమంది తమ పిల్లలు తిరస్కరణ జాబితాలో ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఈ జాబితాలను చూస్తే గతం కన్నా అనేకచోట్ల ఎక్కువగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈసారి లబ్ధిదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో తాత్కాలికంగా వేతనాలు పొందే ఉద్యోగులతోపాటు అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు వంటి వారు అలాగే ప్రైవేటు సంస్థల్లో పీఎఫ్‌ సౌకర్యం ఉండే వారిలో అత్యధికులకు ఈ పథకం అందని పరిస్థితి ఏర్పడింది. ఇక విద్యుత్‌ వాడకం విషయం చూస్తే మారిన జీవనశైలి నేపథ్యంలో గృహ అవసరాలకు విద్యుత్‌ ఆధారిత  వస్తువుల వాడకం అధికమైంది. ఇక వేసవి సమయంలో కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగించడంతో కరెంటు బిల్లులు భారీగా వచ్చాయి. అలాంటి వారిని అమ్మఒడికి అనర్హులంటూ తీసేస్తున్నారు. మరోవైపు గతంలో లేని 75శాతం హాజరు ప్రస్తుతం పెట్టడం వల్ల కూడా చాలామంది పథకానికి దూరమైనట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సరంలో కరోనా తీవ్రత నేపథ్యంలో చాలామంది పిల్లలను స్కూళ్లకు తల్లిదండ్రులు పంపలేదు. దీనికి తోడు వలసలు అధికంగా ఉండటం వల్ల కూడా హాజరుశాతం తగ్గగా ప్రస్తుతం దానిని చూపించి కోత పెడుతున్నారు. 


కార్డులో పేర్లు లేవు.. 

ఇక సాంకేతికంగా తల్లుల రేషన్‌ కార్డులలో పిల్లల పేర్లు లేవన్న సాకుతో అనేక మందిని నిలిపేసినట్లు సమాచారం. అది ఆలాఉంచితే అసలు జిల్లాలో ఎంతమంది అర్హులన్న విషయంపైనే స్పష్టత లేదు. ఈ పథకం అమలు చేసే విద్యాశాఖ అధికారులు దానిపై స్పష్టత ఇవ్వలేని దుస్థితిలో ఉండగా సచివాలయాల్లో ఆ పరిధిలోని వివరాలు మాత్రమే ఉంటున్నాయి. పైగా అన్ని విషయాల్లో అర్హత సాధించిన పలువురు బ్యాంక్‌ అకౌంట్ల విషయంలో దెబ్బతిన్నారు. 


ఆరునెలలు ఆలస్యంగా..

మూడో ఏడాదైన 2022-23కి జనవరిలోనే అమ్మఒడి ఇవ్వాల్సి ఉండగా వడపోత లక్ష్యంగా నిబంధనలు మార్చి ఆరు మాసాలు ఆలస్యంగా ప్రస్తుతం ఇస్తున్నారు. లెక్కకు రూ.15వేలు అని చెప్తున్నా ప్రభుత్వం తొలుత ఒక్కొక్కరి నుంచి పాఠశాల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు మినహాయించి రూ.14వేలు జమ చేసింది. ఈ ఏడాది నుంచి మరో వెయ్యి మినహా యించి రూ.13వేలు మాత్రమే ఇవ్వనుంది. అలా నగదు తగ్గించడ మే కాక ఈ ఏడాది లబ్ధిదారుల ఎంపికలో నిబంధనల పేరుతో అనేక ఆంక్షలను విధించింది. ప్రధానంగా నెలకు రూ.12వేలపైన వేతనం లభించడం, పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం లో ఇల్లు, ఏడాదిలో 75 శాతం హాజరు, నెలకు 300 యూని ట్లపైన వాడకం చేయడం, నాలుగు చక్రాల వాహనాలు వంటివి ఉన్నవారికి అమ్మఒడిని తొలగించి వేశారు. గతంలో ఇచ్చిన వారికి సైతం ఈసారి నిబంధనల పేరుతో నిలిపేస్తుండగా, కోతలే లక్ష్యంగా ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఇన్‌యాక్టివ్‌ అకౌంట్‌తో పరుగులు

జాబితాల్లో చాలామంది పేర్లు పక్కన ఇన్‌యాక్టివ్‌ అకౌంట్‌ అని చూపించింది. దీంతో వలంటీర్లు లబ్ధిదారులకు ఫోన్‌ చేసి మీ అకౌంట్‌ ఎన్‌పీసీఐ కాలేదని, వెంటనే బ్యాంకుకు వెళ్లి చేయించుకోవాలని చెబుతున్నారు. లేకుంటే అమ్మఒడి లబ్ధిపడదని తేల్చిచెబుతున్నారు. దీంతో మహిళలు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. అక్కడ చూస్తే సర్వర్‌ పనిచేయని పరిస్థితి. ఎలాగోలా అన్ని పరీక్షలు దాటుకుని అకౌంట్‌కు ఎన్‌పీసీఐ చేసినా మూడు రోజుల తర్వాత కానీ యాక్టివేట్‌ అవుతున్న పరిస్థితి. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు గతంలోనే ఎన్‌పీసీఐ కోసం బ్యాంకుల్లో ఆధార్‌ ఇచ్చినా చేయని పరిస్థితి. ఇంత గందరగోళం మఽధ్య ఎంతమందికి అమ్మఒడి లబ్ధి దక్కుతుందో 27వతేదీ వరకు వేచిచూడాల్సిందే.Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.