జలకళకు కోత!

Published: Sat, 21 May 2022 23:59:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జలకళకు కోత!బోర్లు వేసేందుకు ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన బోరు వాహనాలు

ఖర్చు తగ్గింపే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు

ఏడాదిన్నరలో ఒక్కశాతం మాత్రం అందని లబ్ధి

తాజాగా ఏటా నియోజకవర్గానికి వంద బోర్లే

అది కూడా విద్యుత్‌ శాఖ క్లియరెన్స్‌ ఉన్న వాటికే

ఒంగోలు, మే 21 (ఆంధ్రజ్యోతి):


 జగన్‌ ప్రభుత్వం మరో కీలక పథకానికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది.  ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటనలన్నీ ఉత్తవేనని తేలిపోతోంది. వైఎస్సార్‌ జలకళ పేరుతో ఏడాదిన్నర క్రితం చేపట్టిన పథకం ఇప్పటికి లక్ష్యంలో పట్టుమని ఒక శాతం కూడా అమలుకు నోచుకోలేదు. 25వేల దరఖాస్తులు ఈ పథకం లబ్ధి కోరుతూ  వస్తే ఇంతవరకు 25మందికి కూడా మంజూరు చేయలేదు. కారణాలు అన్వేషించి సత్వర చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా తాజాగా ఆంక్షలు పెట్టింది. నిబంధనలు మార్పు చేస్తూ కోతలు విధించి అసలు పథకం రైతులకు అందకుండా చేసే చర్యలకు పూనుకుంది. నిజానికి గత ప్రభుత్వ కాలంలో మెట్ట ప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపకరించిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది.


 రైతుల సంక్షేమం కోసం ప్రతిపాదించిన మరో కీలక పథకం రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోంది. పాలకుల తీరుతో పూర్తిగా అటకెక్కే పరిస్థితి నెలకొంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడులు తగ్గడమే కాక పెట్టుబడులు కూడా రాక ఆందోళన చెందే రైతులకు బోర్లు తవ్వించి విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్‌ జలకళ పథకాన్ని రూపొందించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో తొలుత ఇందిర జలప్రభ పేరుతో భూ అభివృద్ధితో కలిపి బోర్ల ఏర్పాటు పథకాన్ని చేపట్టారు. అప్పట్లో రూ.49.50కోట్లతో పథకం మంజూరుకాగా దాదాపు వెయ్యిమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకాన్ని మరింత మెరుగ్గా రైతులకు ఉపకరించేలా మార్గదర్శకాలను మార్పు చేసి ఎన్‌టీఆర్‌ జలసిరి-పేజ్‌ 2 పేరుతో అమలు చేపట్టింది. 


గత ప్రభుత్వంలో 4వేల సోలార్‌ పంపుసెట్లు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వర్షాధార సాగు చేసే ప్రాంతంలో రూ.129.48కోట్ల వ్యయంతో 6,500 బోర్లు లక్ష్యంగా మంజూరు చేశారు. పదిశాతం లబ్ధిదారుల వాటాగా తీసుకొని మిగిలిన మొత్తంలో కొంత రాష్ట్రప్రభుత్వం, మరికొంత విద్యుత్‌ సంస్థలు భరించేలా పథకాన్ని రూపొందించారు. అలా రూ.20కోట్ల వ్యయంతో 6,373 బోర్లను తవ్వించడంతో పాటు సోలార్‌ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చి 4వేల బోర్లకుపైగా సోలార్‌ పంపు సెట్లు ఏర్పాటుచేశారు. త్రిపురాంతకం, మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి, అద్దంకి, పంగులూరు తదితర మండలాల్లో భారీగా బోర్ల తవ్వకం చేశారు. మంచి ఫలితాలు రైతులకు అందాయి. ఒక్క మార్టూరు మండలం ఇసుకదర్శిలోనే 200 బోర్లు ఏర్పాటు చేయగా మెరుగైన ఫలితాలను ఆ గ్రామరైతులు పొందారు. అలాంటిది పలు గ్రామాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి.


వైసీపీ రాగానే బిల్లుల పెండింగ్‌

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇతర శాఖల పరిధిలోని కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపినట్లే జలసిరి పథకంలో బోర్లు వేసిన వారికి బిల్లులు ఆపి ఇబ్బందులపాల్జేసింది. దాదాపు ఏడాదికి పైగా అసలు పథకాన్నే నిలిపేసి అనంతరం 2020 సెప్టెంబరులో వైఎస్సార్‌ జలకళ పేరుతో ఆర్భాటంగా మొదలుపెట్టింది. నియోజకవర్గానికి ఒక బోరు తవ్వే రిగ్గును ఇస్తున్నట్లు ప్రకటించి వైసీపీ జెండా రంగులు వేసి జిల్లాలకు పంపించారు. మెట్టప్రాంతంలో బోర్లు తవ్వి భూగర్భజలంతో పంటలు పండించుకునేలా ఎన్ని బోర్లు అయినా తవ్వుకోవచ్చని చెప్పారు. విద్యుత్‌ సౌకర్యం, మోటార్లు అన్నింటిని ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటించారు. రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. పథక మార్గదర్శకాల ప్రకారం 5ఎకరాల లోపు ఉండే చిన్న సన్నకారు రైతులకు బోరుతో పాటు విద్యుత్‌, మోటారు సౌకర్యం ఉచితంగా కల్పిస్తారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే కేవలం బోరు డ్రిల్లింగ్‌తోపాటు విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తారు. గరిష్ఠంగా 400 అడుగుల లోతున బోరు వేస్తారు. ఇందుకు అవసరమైన నిధులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ద్వారా చెల్లిస్తారు. 


భారీగా దరఖాస్తులు

  గతంలో జలసిరి లబ్ధిని చూసిన జిల్లా రైతులు వైఎస్సార్‌ జలకళ పథకానికి భారీగానే దరఖాస్తు చేశారు. అలా ప్రస్తుతం జిల్లాలో 19,312 దరఖాస్తులు డ్వామా అధికారులకు రాగా రైతుల భూమి వాస్తవికతపై వీఆర్వోల పరిశీలనకు వారు పంపగా 15,475 సరైనవేనని స్పష్టత ఇచ్చారు. వాటిని డ్రిల్లింగ్‌ కాంట్రాక్టు ఏ జెన్సీలకు డ్వామా ఏపీడీలు అందజేయగా గ్రౌండ్‌ వాటర్‌ జియాలజిస్టులకు వారు పంపారు. అందులో 4,568 దరఖాస్తులకు సంబంధించి గ్రౌండ్‌ వాటర్‌ జియాలజిస్టులు సర్టిఫికెట్‌ పొంది తిరిగి ఏజెన్సీల వారు ఏపీడీలకు పంపగా మరో 10,868 సర్వే చేయాల్సి ఉంది. కాగా తమకు అందిన 4,568 దరఖాస్తుల్లో 3,936 దరఖాస్తులను ఏపీడీలు ఆమోదించి 3,784 పనులకు రూ.29.35 కోట్లు వ్యయం అంచనాగా గుర్తించారు. రూ.27.56 కోట్లతో 3,543 పనులు చేసేందుకు పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం రూ. 7.09కోట్ల వ్యయంతో 1,548 బోర్లను తవ్వారు. 


పదిశాతమే తవ్వకం..కనెక్షన్లు ఆలస్యం

ఇలా పథక లబ్ధి కోసం వచ్చిన  దరఖాస్తుల్లో పదిశాతం మాత్రమే బోర్ల తవ్వకం ఉండగా ఇక విద్యుత్‌ కనెక్షన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తవ్విన 1,548 బోర్లలో 991 బోర్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించిన విద్యుత్‌ అధికారులు వాటిలో 621కే అనుమతి ఇచ్చారు. వాటిలోనూ 591 కనెక్షన్లను రూ.12.31కోట్లతో మంజూరు చేశారు. తీరా ఇప్పటివరకు ఇచ్చిన కనెక్షన్లు మాత్రం కేవలం 18 మాత్రమేనని అధికారవర్గాల సమాచారం. కాగా ఉమ్మడి జిల్లాలో తవ్విన బోర్ల వివరాలు పరిశీలిస్తే త్రిపురాంతకం మండలంలో గరిష్ఠంగా 349 తవ్వగా తర్లుపాడులో 202, చీరాలలో 152, మార్కాపురంలో 92 ఉండగా కొమరోలు, పుల్లచెరువు, ఎస్‌ఎన్‌పాడు, వెలిగండ్ల, దొనకొండ, కురిచేడు తదితర మండలాల్లో 50 నుంచి 100 లోపు ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాటుకు రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు వ్యయమయ్యే పరిస్థితి ఏర్పడటంతో తవ్విన బోర్లకు కూడా కనెక్షన్లు ఇవ్వకుండా ఆ శాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. 


నియోజకవర్గానికి వందే

ఏమైనా ఏడాదిన్నరలో అందిన దాదాపు 20వేల దరఖాస్తుల్లో 20మందికి కూడా ప్రయోజనం చేకూరిన పరిస్థితి లేదు. అయితే అందుకు వాస్తవ కారణాలు గుర్తించి మరింత మెరుగ్గా, వేగంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అసలు పథకానికే ఎసరు పెట్టే చర్యలు చేపట్టింది. గతంలో అర్హత ఉన్న రైతులు అందరికి బోర్ల తవ్వకం అన్న ప్రభుత్వం తాజాగా నియోజకవర్గానికి ఏడాదికి 100 మాత్రమేనని మెలిక పెట్టింది. అందులోనూ డ్వామా అధికారులు పరిశీలించి మంజూరు కాకుండా తొలుత విద్యుత్‌ శాఖ వారు పరిశీలించి ఓకే చేస్తేనే తవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు డ్వామా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి అధికారిక సమాచారం అందింది. ఈ పరిస్థితి చూస్తే విద్యుత్‌ కనెక్షన్ల భారం తగ్గించుకోవడం లక్ష్యంగా కనిపిస్తుండగా ఈ తరహాలో నిబంధనలు, మార్పుతో భారీగా జలకళ పథకానికి కోత పడనుంది. 


కనెక్షన్లలో జాప్యాన్ని నివారించేదుకే..: పీడీ

 విద్యుత్‌ కనెక్షన్లలో జాప్యాన్ని నివారించే లక్ష్యంతో ఏటా నియోజకవర్గానికి వంద బోర్లు వేయడం పెట్టారని డ్వామా పీడీ శీనారెడ్డి వివరించారు. విద్యుత్‌ లైన్‌ వేయడం, మోటారు ఏర్పాటు ఆ శాఖకు అప్పగించారని తెలిపారు. ఇప్పటివరకు 60 బోర్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు విద్యుత్‌ అధికారులు చెప్తున్నారని, మోటార్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.  


జలకళకు కోత!కురిచేడులో ప్రాంతంలో ఓ రైతు భూమిలో వేస్తున్న బోరు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.