సంక్షేమానికి కోత

ABN , First Publish Date - 2021-10-05T06:40:45+05:30 IST

ల్లాలో రేషన్‌ కార్డుల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

సంక్షేమానికి కోత

జిల్లాలో భారీగా రేషన్‌ కార్డుల తొలగింపు

నెల వ్యవధిలోనే 28వేలు కట్‌

అన్నింటికీ రైస్‌ కార్డే ప్రామాణికం  

సచివాలయాలకు పేదల పరుగు

అక్కడ సరైన సమాధానం రాక ఆందోళన 

ప్రభుత్వ పథకాలకు దూరం

రాచర్ల మండలంలోని అనుమలవీడు గ్రామానికి చెందిన దాసు పెద్దలక్ష్మమ్మకు 70 సంవత్సరాలు. భూమి లేకున్నా ఎక్కువ పొలం ఉన్నట్లు చూపించి రేషన్‌కార్డు తీసివేశారు. భర్త లేకపోవడం, ఒంటరిగా జీవిస్తుండటం, వృద్ధాప్యంలో ఉండటంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక కనిపించిన వారందరినీ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈమె ఒక్కరే కాదు.. ఇలా వివిధ కారణాలతో 28వేల కార్డులను ప్రభుత్వం తొలగించింది. వారికి పథకాలను దూరం చేసింది. 

పేదల సంక్షేమమే ధ్యేయం అంటూనే కోతల పర్వానికి సర్కారు పదును పెట్టింది. అన్నింటికీ కీలకమైన రేషన్‌ కార్డులను తొలగిస్తోంది.  పింఛన్లు, అమ్మఒడి, జగనన్న ఇళ్లు, రైతు సంక్షేమ పథకాలకు ఆయా కుటుంబాలను దూరం చేస్తోంది.  ప్రభుత్వం ఇటీవల విధించిన ఆంక్షలతో వివిధ కారణాలు చూపి అన్నింటికీ ప్రామాణికమైన రేషన్‌  కార్డులను తీసేసే కార్యక్రమం ఊపందుకుంది. అందులో భాగంగా తొలుత  కార్డు కట్‌ చేసి ఆ తరువాత పింఛన్లు, ఇతర పథకాలను నిలిపివేస్తుండటంతో  పేదలు గగ్గోలు పెడుతున్నారు.

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 4 : జిల్లాలో రేషన్‌ కార్డుల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నెల వ్యవధిలోనే 28వేలకుపైగా రైస్‌ కార్డులు రద్దు చేయడంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలకు రైస్‌ కార్డే ప్రామాణికం కావడం.. ఇప్పుడు ఆ కార్డును తొలగించడంతో పేదలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రైస్‌కార్డు మీదనే ఆధారపడి జిల్లావ్యాప్తంగా వేలాదిమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పేదలు పింఛన్లు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి పేదల రైస్‌కార్డులు తొలగించడంతో సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. 


ఎందుకు తొలగిస్తున్నారో తెలియదు

జిల్లాలో సెప్టెంబరు నెలలో 10,09,853 రైస్‌కార్డులు ఉండగా అక్టోబరు 1నాటికి వాటి సంఖ్య 9,81,007కు తగ్గింది. అంటే సుమారు 28,846 రైస్‌కార్డులను తొలగించారు. వీటిని  ఎందుకు రద్దు చేశారో కూడా పేదలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. గతనెలలో బియ్యం, పింఛన్‌ తీసుకున్న వారు ఈనెల 1న పింఛన్‌ తీసుకునేందుకు వెళ్లి పేరు లేకపోవడంతో అవాక్కయ్యారు.  


పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నారని.. విద్యుత్‌ బిల్లులు అధికమని..

రైస్‌ కార్డులను తొలగింపుపై పేదలు సచివాలయాల వద్దకు వెళితే కరెంటు బిల్లులు అధికంగా వచ్చిందని, మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారని తదితర కారణాలతో కార్డు పోయిందని సిబ్బంది సమాధానం చెబుతున్నారు. కొన్నిచోట్ల అయితే కనీసం సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారు. అయితే చిన్నచిన్న ఇళ్లలో ఉన్న పేదల కార్డులను కూడా విద్యుత్‌ చార్జీ అధికంగా వచ్చిందనే కారణంతో తొలగించారు. ఈ విషయం అర్థంకాక, ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో చాలామంది ఉన్నారు. మరికొంత మంది కార్డుల్లో ఉన్న వారి పిల్లలు వివిధ ప్రాంతాల్లో అనేక రకాల ఉద్యోగులు చేస్తున్న కారణంగా  రైస్‌కార్డు తొలగించారని సచివాలయ సిబ్బంది చెబుతుం డటంతో  ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా జిల్లాలో 8వేల మందికిపైగా సచివాలయ ఉద్యోగుల రైస్‌కార్డులను తొలగించేందుకు సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు  వాటితోపాటు మరో 20వేల కార్డులను తొలగించడంతో వారంతా దిక్కుతోచని పరిస్థిని ఎదుర్కొంటున్నారు.  


ప్రభుత్వ పథకాలను కోల్పోతున్న పేదలు

ప్రభుత్వం అమలు చేసే విఽవిధ పథకాలు రైస్‌కార్డు ప్రామాణికంగానే అందుతున్నాయి. అయితే ఇప్పుడు రైస్‌ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అందించే అన్ని పథకాలను కోల్పోవడం ఖాయం. దీంతో పేదలు రోడ్డున పడాల్సి వస్తోంది. దీనిపై ఎవరి వద్దకు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తమను పట్టించుకునేవారే కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని గ్రామాల్లో కొన్నివర్గాలు లక్ష్యంగా కార్డులను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి చోట్ల వలంటీర్లు కీలకంగా మారినట్లు సమాచారం. వలంటీర్లు చెప్పిన వారి కార్డులను నిర్ధాక్షిణ్యంగా అధికారులు తొలగించారనే అపవాదు ఉంది. మరి ఉన్నతాధికారులు పేదలను ఏవిధంగా ఆదుకుంటారో చూడాలి.


Updated Date - 2021-10-05T06:40:45+05:30 IST