కట్‌కటా..!

ABN , First Publish Date - 2020-12-01T06:34:10+05:30 IST

కట్‌కటా..!

కట్‌కటా..!

కేంద్ర ప్రభుత్వ ఉచిత కోటా పంపిణీ కమీషన్‌ 35 పైసలేనట..

65 పైసలు డీలర్‌ నష్టపోవాల్సిందే 

డీలర్లలో ఆందోళన

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత నిత్యావసరాల కోటా పంపిణీకి సంబంధించి డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్‌లో కోత పడింది. ఉచిత నిత్యావసరాల పంపిణీకి సంబంధించి కేంద్రం రూపాయి బదులు 35 పైసలనే కమీషన్‌గా ఇస్తామని నిర్దేశించింది. దీంతో డీలర్ల నెత్తిన పిడుగు పడినట్టైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాము ఈ భారాన్ని భరించలేమని, మీరే భరించాలని  కేంద్రానికి లేఖ రాయటంతో డీలర్ల పరిస్థితి సందిగ్ధంలో పడింది. 

సందిగ్ధంలో డీలర్లు

కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు నెలాఖరు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత నిత్యావసరాల కోటా పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 8 విడతలు, కేంద్ర ప్రభుత్వం 8 విడతల చొప్పున ఇచ్చారు. ప్రతి నెలలో 15 రోజులకు ఒకటి చొప్పున రెండు కోటాలు ఇచ్చారు. ఎంతో ఒత్తిడి మధ్య డీలర్లు నెలలో రెండు కోటాలను ఇచ్చారు. కొందరు డీలర్లు కరోనా బారినపడి చనిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో డీలర్ల కృషిని గుర్తించి అభినందించాల్సింది పోయి కమీషన్‌ 35 పైసలే ఇస్తామని కేంద్ర ప్రకటించడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించే పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉచిత కోటాలో భాగంగా కమీషన్‌ను అతి కష్టం మీద చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కమీషన్‌లో కోత పెట్టడం, తమకూ భారమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటంతో  డీలర్లు సందిగ్ధంలో పడ్డారు. 

ఇస్తామన్న కమీషన్‌ కూడా బడ్జెట్‌ తర్వాతేనట..! 

డీలర్లకు మరో షాక్‌. కేంద్రం ఇస్తానన్న 35 శాతం కమీషన్‌ను కూడా వెంటనే చెల్లించదట. పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటపుడు దీనికి సంబంధించి కేటాయింపులు చేస్తామని ప్రకటించడంతో డీలర్లు మరింత డీలా పడిపోయారు. బడ్జెట్‌ అంటే వచ్చే సంవత్సరంలోనే ఉంటుంది. కేటాయింపులు చేసి, విడుదల కావడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశముంది. 

ఈ-పోస్‌లో డబుల్‌ ప్రింట్‌ ఆప్షన్‌ తొలగింపు

ఈ-పోస్‌లో రెండుసార్లు వేలి ముద్రలు ఇవ్వటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను కొద్దిరోజుల నుంచి ఏపీ ఎఫ్‌పీ షాప్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతలు మండాది వెంకట్రావు, శివప్రసాద్‌ తదితరులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సివిల్‌ సప్లయిస్‌ ఆదివారమే ఈ-పోస్‌లో డబుల్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఆప్షన్‌ను తొలగించింది. 

Updated Date - 2020-12-01T06:34:10+05:30 IST