అదే విన్యాసం

Published: Tue, 15 Mar 2022 03:51:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఐదురాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో, కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి (సీడబ్ల్యుసీ) ఆదివారం సమావేశమై నాలుగున్నర గంటలపాటు మేథోమథనం సాగించింది. ఈ ఘోరం ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు అన్న చర్చంతా చేసిన తరువాత సీడబ్ల్యుసీ ఆ పాపాన్ని  తననెత్తినవేసుకుంటూ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసింది. సోనియా నాయకత్వంమీద అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, అధోగతిలో ఉన్న పార్టీని బలోపేతం చేసి అగ్రస్థానంలోకి తీసుకుపోయే అధికారాన్ని కూడా ఆమెకే అప్పగించింది. సంస్థాగత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేవరకూ మీరు అదే స్థానంలో ఉంటూ మాకు మార్గనిర్దేశనం చేయండని పార్టీ నేతలంతా సోనియాను ఏకకంఠంతో ప్రార్థించారు. ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకోవాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యుడు వేణుగోపాల్ నోట ఈ విషయాలన్నీ విన్న తరువాత కాంగ్రెస్ విషయంలో తమ అంచనాలు మళ్ళీ తప్పినందుకు మీడియా షాక్ తిని ఉంటుంది.


ఎన్నికల ఫలితాలతో గాంధీ కుటుంబం మనసు గాయపడి, ఈ మారు ముగ్గురు గాంధీలు పార్టీకి రాజీనామా చేయాలని సంకల్పించారంటూ సమావేశం ముందురోజున ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఈ ఆలోచన ఆ కుటుంబానికి లేదనీ, ఫలితాల నుంచి ప్రజల దృష్టిని ఏ మార్చడానికీ, సానుభూతి సంపాదించడానికి ఇది ప్రచారంలో పెట్టి ఉంటారని కొందరి నమ్మకం. 2019 సార్వత్రక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజీనామా సమర్పించడం, దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతుగా పార్టీలోని చిన్నాపెద్దా సహా చాలా విభాగాలవారు ప్రదర్శనలు చేయడం తెలిసిందే. ‘గాంధీ కుటుంబం కారణంగానే పార్టీ బలహీనపడుతోందని కొందరు అంటున్నారు. సభ్యులకూ అదే అభిప్రాయం ఉంటే మేం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే’ అని సమావేశం ప్రారంభోపన్యాసంలో సోనియా అనకపోలేదు. దీనికి వర్కింగ్ కమిటీ సభ్యులు అంగీకరించకపోవడంతో పాటు, అచంచల విశ్వాసాన్ని ప్రకటించడంతో గతకాలపు విన్యాసాల్లాగానే ఇదీ మిగిలిపోయింది. సర్వసాధారణంగా సీడబ్ల్యుసీ భేటీలో ఓ ఇరవైమంది ముఖ్యులు మాత్రమే పాల్గొంటారనీ, ఈ మారు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు సహా యాభైఏడుమంది కూర్చున్నారనీ, ఇందులో ఎక్కువమంది గాంధీ కుటుంబ విధేయులేనని అంటారు. సమావేశానికి ముందు డికె శివకుమార్, అశోక్ గెహ్లాట్ వంటివారు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని మాట్లాడిన విషయం తెలిసిందే.


మూడుదశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధానిగా లేదా మంత్రిగా ఉండలేదనీ, పార్టీకి ఆ కుటుంబం చాలా ముఖ్యమనీఅన్నారు. సమావేశం ఆరంభానికి ముందు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలవారంతా గుమిగూడి రాహుల్ కు జేజేలుకొడుతూ, ఆయనను అధ్యక్షుడిని చేయలంటూ నినాదాలు చేసిన విషయమూ తెలిసిందే. తాత్కాలిక అధ్యక్ష స్థానంలో సోనియా ఉంటూ, శాశ్వత స్థానాన్ని మూడేళ్ళుగా ఖాళీపెట్టిన పార్టీ ఇప్పుడు తక్షణభర్తీతో కొత్తగా నొల్లుకోగలిగేది ఏమిటో తెలియదు. రాహుల్ చేతిలో రాజదండం లేనందువల్లనే పార్టీకి ఇంతటి నష్టం వాటిల్లిదని ఎవరూ అనుకోరు. అమ్మను అలా కూచోబెట్టి పిల్లలిద్దరూ చక్రం తిప్పారనీ, ఎవరెన్ని చెప్పిన వినకుండా పంజాబ్ లో వీరు చేపట్టిన సాహసోపేతమైన ప్రయోగం దెబ్బతినడంతో ఇప్పుడు అధికారాల గురించి మాట్లాడుతూ వర్కింగ్ కమిటీ తప్పు తననెత్తిన వేసుకుందని అర్థమవుతూనే ఉంది. ఇక, నేను కేవలం ఒక ఎంపీని మాత్రమే అని సగర్వంగా ప్రకటించుకొనే రాహుల్ గాంధీ ఒకవేళ రాజీనామా చేయాలనుకున్నా ఏ పదవికి చేస్తారు? అన్నదీ ప్రశ్నే. ఈ సమావేశంలో అసమ్మతి గొంతులు అంతబలంగా లేకపోయాయనీ, ముకుల్ వాస్నిక్ ను కూచోబెట్టండి అన్న మాట కూడా సులువుగా గాలిలో కలిసిపోయిందనీ అర్థమవుతోంది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో మిగిలింది. తన వ్యూహవైఫల్యాలతో, తప్పటడుగులతో ఒక్కో రాష్ట్రాన్నీ వదులుకున్న పార్టీ పునరుజ్జీవం కావాలనీ, బలమైన విపక్షంగా నిలబడాలనీ అనేకులు కోరుకుంటున్నారు. ఎంతకాదనుకున్నా ఇప్పటికీ ఓ ఇరవైశాతం ఓటుబ్యాంకు నికార్సుగా ఉన్న కాంగ్రెస్ ఇరుసు లేకుండా విపక్ష కూటములు ఏర్పడటమూ, నడవడమూ, నిలబడటమూ కష్టమే. అలాగే, ఎవరికి నచ్చినా నచ్చకున్నా గాంధీల నాయకత్వంలో లేని కాంగ్రెస్ ప్రజల మన్ననలను పొందడమూ కష్టమే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.