విద్యార్థుల్లో చైతన్యం కోసమే సైబర్‌ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-08-12T05:51:06+05:30 IST

విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం కోసమే పోలీసు శాఖ సైబర్‌ కాంగ్రెస్‌ పేరిట శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు.

విద్యార్థుల్లో చైతన్యం కోసమే సైబర్‌ కాంగ్రెస్‌
జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీపీ సత్యనారాయణ

- సీపీ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 11: విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం కోసమే పోలీసు శాఖ సైబర్‌ కాంగ్రెస్‌ పేరిట శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు. విద్యార్థులను ఆన్‌లైన్‌ మోసాలపై చైతన్యవంతులను చేయడం కోసం యంగిస్తాన్‌ సొసైటీ సహకారంతో సైబర్‌ కాంగ్రెస్‌ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్‌ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ మోసాలకు గురైన వారికి సహాయంగా ఉండి భరోసా కల్పిస్తామన్నారు.  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. అవగాహన లేని యాప్‌లను వినియోగించకూడదని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మాట్లాడుతూ పోలీసుశాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను అర్థం చేసుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలన్నారు. సైబర్‌ కాంగ్రెస్‌ పేరిట రూపొందించిన హ్యాండ్‌బుక్‌ ఉపయోగకరంగా ఉందని చెప్పారు. సోషల్‌ మీడియాను అవసరాల మేరకే వినియోగించాలని, అనవసరమైన వాటికి ఉపయోగించి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. సైబర్‌ కాంగ్రెస్‌ పేరిట నిర్వహించిన ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాల ఉద్దేశాన్ని వర్చువల్‌ విధానం ద్వారా డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సందేశాన్ని వినిపించారు. శిక్షణ కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, మెంటర్లకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, అడిషనల్‌ డీసీపీ (ఎల్‌అండ్‌వో) ఎస్‌ శ్రీనివాస్‌, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, సి ప్రతాప్‌, నోడల్‌ అధికారిని కృపారాణి, ఇన్‌స్పెక్టర్లు నటేశ్‌, మల్లేశం, రమేశ్‌, మురళి  పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:51:06+05:30 IST