300 కోసం ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే.. లక్షా తొంభైవేలు మాయం

ABN , First Publish Date - 2021-06-06T16:14:29+05:30 IST

మూడు వందల కోసం ప్రయత్నించి ...

300 కోసం ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే.. లక్షా తొంభైవేలు మాయం

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : మూడు వందల కోసం ప్రయత్నించి సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కి రెండు లక్షల దాకా పోగొట్టుకుంది నగరానికి చెందిన ఓ మహిళ. సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్‌కు చెందిన విశాలాక్షి ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసింది. ఈకామర్స్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే కొరియర్‌ సంస్థకు చెందిన ప్రతినిధి వస్తువులను ఇంటికి వచ్చి అందజేశాడు. డబ్బులను ఆమె డెలివరీ బాయ్‌కు చెల్లించి రశీదు(పీఓడీ) తీసుకుంది. అతడు వెళ్లిపోయిన తర్వాత పీఓడీని పరిశీలించగా డెలివరీ బాయ్‌ తన వద్ద మూడు వందలు అదనంగా వసూలుచేసినట్టు గ్రహించింది. 


అయితే అతడి మొబైల్‌ నెంబర్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో గూగుల్‌సెర్చ్‌లో ఈకామర్స్‌ ఎక్స్‌ప్రెస్‌ కాల్‌సెంటర్‌ కోసం వెతికింది. ఈ క్రమంలో ఒక నెంబర్‌ కనిపించడంతో ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసింది. మీ డెబిట్‌ కార్డు వివరాలు, వ్యక్తిగత వివరాలు ఇస్తే మూడు వందలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని అవుతలివైపు వ్యక్తి చెప్పడంతో ఆమె అన్ని వివరాలు చెప్పింది. ఓటీపీ వివరాలు కూడా చెప్పింది. దీంతో క్షణాల్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షా తొంభై ఒక్కవేలు ఖాళీ అయ్యాయి. ఆ వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-06-06T16:14:29+05:30 IST