ఈ-జీ మోసాలు

Published: Sun, 22 May 2022 00:58:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ-జీ మోసాలు

పెరిగిపోతున్న ఆన్‌లైన్‌ నేరాలు

ఆదమరిస్తే అంతే సంగతులు

ఈ-మెయిల్‌ హ్యాకింగ్‌.. ఈజీగా పాస్‌వర్డ్‌ సేకరణ

పరిజ్ఞానాన్ని పెంచేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు

కొత్తరకం మోసాలపై సీఆర్‌సీఐడీఎఫ్‌ అవగాహన

విస్తుగొలిపే విషయాలపై వివరణ


సాంకేతిక పరిజ్ఞానం మనిషిని డిజిటల్‌ వస్తువుగా మార్చేస్తోంది. అవగాహన లేని విజ్ఞానం మిషన్‌ను చేసేస్తోంది. కాలు కదపకుండా, చేయి జరపకుండా సాగిపోతున్న ఆన్‌లైన్‌ లావాదేవీలు అప్పటివరకు బాగానే ఉన్నా.. భద్రతను మాత్రం ప్రశ్నార్థకం చేస్తున్నాయి. టెక్నాలజీ ఎలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైపైకి వెళ్తుందో, దాన్ని ఉపయోగించుకుని జరుగుతున్న నేరాలూ అలాగే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మితిమీరుతున్న ఈ-నేరాల నుంచి ఎలా తప్పించుకోవచ్చన్న అంశాలపై అవగాహన కల్పించడానికి సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌) సంస్థ శనివారం నగరంలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఆశ్చర్యం కలిగించే అనేక ఆన్‌లైన్‌ మోసాలను వివరించింది.

- ఆంధ్రజ్యోతి, విజయవాడ


ఫుట్‌ ప్రింటింగ్‌

షాిపింగ్‌కు వెళ్లినా, ఏదైనా వస్తువును కొన్నా ఫీడ్‌బ్యాక్‌ కోసం ఈ-మెయిల్‌ను అడుగుతుంటారు. ఆలోచించకుండా వెంటనే ఇచ్చేస్తాం. మెగా షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు ఈ-మెయిల్‌తో పాటు ఫోన్‌ నెంబర్‌ కూడా రాసేస్తాం. ఇలాంటి ఘటనల్లో డేటా భద్రంగా ఉన్నంత వరకు ఎలాంటి బెంగ ఉండదు. సైబర్‌ నేరగాళ్లకు మెయిల్‌, ఫోన్‌ నెంబర్‌ దొరికితే చాలు వాటికి సంబంధించిన వ్యక్తుల మొత్తం సమాచారాన్ని లాగేసుకుంటారు. సైబర్‌ నేరగాళ్లు హేవ్‌ ఐ బీన్‌ ఫోన్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా వారికి లభించిన మెయిల్‌ను చెక్‌ చేసుకుంటారు. ఫోన్‌ నెంబర్‌ను సంపాదిస్తారు. తద్వారా నకిలీ మెయిల్‌ను రూపొందించి అసలు మెయిల్‌ను హ్యాక్‌ చేస్తారు. ఈ విధానాన్నే సైబర్‌ పరిభాషలో ఫుట్‌ ప్రింటింగ్‌ అంటారు. సైబర్‌ నేరగాళ్లు ఏడు సెక్షన్లలో 10 లక్షల నకిలీ పాస్‌వర్డ్‌లు తయారు చేయగలరని ఒక అంచనా. బ్రూట్‌ఫోర్స్‌, రెయిన్‌బో టేబుల్‌ అనే డిజిటల్‌ టూల్స్‌ను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. మెయిల్‌ చేతికి చిక్కగానే సంబంధిత వ్యక్తుల వివరాలను ప్రొఫైలింగ్‌ చేస్తారు. ఫేస్‌బుక్‌లో ఉన్న పుట్టిన, పెళ్లిరోజులకు సంబంధించిన తేదీలను తెలుసుకుంటారు. వాటన్నింటినీ ఒక ఎక్స్‌ఎల్‌ షీట్‌లో వేసుకుంటారు. వాటితో పాటు ఫోన్‌ నెంబర్లలో ఉండే కామన్‌ పాయింట్లను తెలుసుకుని పాస్‌వర్డ్‌లను తయారు చేస్తారు. 

ఇన్వాయిస్‌ క్రైం

ఒక సంస్థలో ఉన్న సమాచారాన్ని ఎలాంటి పరిచయం లేని వ్యక్తులకు పంపడాన్ని ఇన్‌సైడర్‌ త్రెట్‌గా వ్యవహరిస్తారు. ఇలా సమాచారాన్ని ఇచ్చే సంస్థలోని ఉద్యోగులను రోగ్‌ ఎంప్లాయిస్‌గా పరిగణిస్తారు. ఈ తరహా నేరాలు ఎక్కువగా బహుళజాతి, వాణిజ్య సంస్థల్లో జరుగుతాయి. వ్యాపారి వస్తువును పంపాక కొనుగోలుదారుడు డబ్బు చెల్లిస్తాడు. ఇది ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, పేమెంట్‌ వాలెట్స్‌ మొత్తం షిఫ్ట్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. ఆ సంస్థల్లోని ఉద్యోగుల ద్వారా సమాచారం తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఉత్పత్తిదారుడు మాదిరిగా ఒక నకిలీ మెయిల్‌ను తయారుచేసి కొనుగోలుదారుడికి పంపుతాడు. అందులో వ్యాపారి చెప్పినట్టుగా తన అకౌంట్‌ మారిందని, కొత్త ఖాతాకు డబ్బు పంపాలని అకౌంట్‌ నెంబర్‌ను ఇస్తారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ సమయంలో ఈ ఇన్వాయిస్‌ క్రైం ఎక్కువగా జరిగింది. 

లింగ్విస్టిక్‌ ఇంటెలిజెన్స్‌

ఒక వ్యక్తి సిమ్‌ను బ్లాక్‌ చేయించి.. ఆయా సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి కొత్త సిమ్‌ తీసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు దాని స్వాపింగ్‌ ద్వారా నేరాలు చేస్తున్నారు. ప్రభుత్వాధికారులను, రాజకీయ నేతలను బెదిరిస్తున్నారు. జిరాక్స్‌ షాపుల్లో ఉండే ఆధార్‌కార్డు ఫొటోస్టాట్‌ కాపీలను సేకరించి సర్వీస్‌ ప్రొవైడర్ల వద్దకు వెళ్లి అసలు సిమ్‌లను బ్లాక్‌ చేయిస్తున్నారు. ఆధార్‌కార్డు ఫొటోను మార్ఫింగ్‌ చేస్తున్నారు. ట్రూకాలర్‌లో నిఘా వర్గాల పేరుతో ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. ఈవిధంగా సిమ్‌ను బ్లాక్‌ చేయించిన ఓ వ్యక్తి ట్రూకాలర్‌లో తన పేరును సీఐ ఏసీబీ పేరు ఫీడ్‌ చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులకు ఫోన్‌ చేసి అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పి డబ్బు డిమాండ్‌ చేశాడు. చివరకు అది నకిలీ ఫోన్‌కాల్‌ అని తేల్చారు. 

సైబర్‌ సెక్స్‌టార్షన్‌

ఈ నేరాలు ఎక్కువగా రాత్రి పది నుంచి రెండు గంటల వరకు జరుగుతాయి. సైబర్‌ నేరగాళ్లు కొంతమంది అమ్మాయిలతో చాటింగ్‌ చేయిస్తారు. కొద్దిరోజులకు శృంగార సంభాషణలకు ఉసిగొల్పుతారు. రాత్రిపూట అమ్మాయి మాట్లాడుతుందనే సరికి చాలామంది యువకులు వీడియో కాల్స్‌ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు చెప్పినట్టు వింటున్నారు. వాటిని వీడియో రికార్డింగ్‌ చేసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలోనూ, పోర్న్‌ వెబ్‌సైట్లలోనూ అప్‌లోడ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలా చేయకుండా ఉండటానికి భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేరాలను సైబర్‌ ఎక్స్‌టార్షన్‌ లేక సైబర్‌ సెక్స్‌టార్షన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఈ-జీ మోసాలు

ఆరోగ్య భద్రత వంటిదే సైబర్‌ సెక్యూరిటీ

సైబర్‌ సెక్యూరిటీ అనేది ఆరోగ్య భద్రత వంటిదే. అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో అలాగే సైబర్‌లోనూ పాటించాలి. అప్పుడే సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉంటాం. సైబర్‌ నేరాల్లో నష్టపోయిన వారిలో దాదాపు 80 శాతం మందికి అవగాహన లేదు. మిగిలిన 20 శాతం మంది అవగాహన ఉన్నా తప్పులు చేసి ఇరుక్కుపోయారు. - వినోద్‌బాబు, సీఆర్‌సీఐడీఎఫ్‌ డైరెక్టర్‌

ఈ-జీ మోసాలు

ఫోన్‌ ఇవ్వకపోయినా అనుమతులిచ్చేస్తున్నాం

ఫోన్‌ పక్క వారికి ఇవ్వడానికి భయపడుతున్న జనం అనుమతులు మాత్రం చాలా సులువుగా ఇచ్చేస్తున్నారు. గూగుల్‌లో కొత్తకొత్త యాప్‌లు వస్తున్నాయి. ఎవరో చెప్పారని వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. యాప్‌లో అడిగిన అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చేస్తున్నాం. ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ నెంబర్లు, ఫొటోలు, ఈ-మెయిల్‌ అన్నింటికీ చాలామంది అనుమతులు ఇస్తున్నారు. ఇదే ప్రమాదాలను తెస్తోంది.

- పాటిబండ్ల ప్రసాద్‌, సీఆర్‌సీఐడీఎఫ్‌ డైరెక్టర్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.