మటన్‌ కావాలంటూ రూ.75వేలు కాజేశాడు...

ABN , First Publish Date - 2022-06-26T05:54:15+05:30 IST

మటన్‌ కావాలంటూ రూ.75వేలు కాజేశాడు...

మటన్‌ కావాలంటూ రూ.75వేలు కాజేశాడు...

 ఆన్‌లైన్‌లో సైబర్‌ మోసగాడి మాయ

 హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో వెలుగుచూసిన మోసం

కమలాపూర్‌, జూన్‌ 25: ఆన్‌లైన్‌లో మటన్‌ వ్యాపారికి ఆర్డర్‌ ఎర వేసి, ఓ సైబర్‌ మోసగాడు రూ.75 వేలు కాజేశాడు. ఈ సంఘటన  కమలాపూర్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సంజీవ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కమలాపూర్‌కు చెందిన ఆన్‌కార్‌ రాహుల్‌ సోనాల్‌ అనే మటన్‌ వ్యాపారికి ఈనెల 20న రాత్రి 9.48 గంటలకు వికాస్‌ పటేల్‌ అనే వ్యక్తి 063712 78595 నెంబరు నుంచి ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌లో మటర్‌ ఆర్డర్‌ చేశాడు. 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు 20 కిలోల మటన్‌ కావాలని కోరాడు.  దీంతో  మీరు ఎవరో పరిచయం లేదని, ఎలా ఇవ్వాలని మటన్‌ వ్యాపారి ప్రశ్నించగా, సదరు వికాస్‌ పటేల్‌ తన ఐడీకార్డు ప్రూఫ్‌ను వాట్సాప్‌ చేశాడు. మరుసటి రోజు 21న ఉదయం 9.14 గంటలకు మరోసారి ఫోన్‌ చేసి మటన్‌ డబ్బులు ఎంత అవుతాయని అడిగాడు. మటన్‌ వ్యాపారి రూ.14వేలు అవుతుందని చెప్పగా, ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తానని చెప్పి, తనది ఆర్మీ అకౌంట్‌ అని వాట్సా్‌పలో క్యూఆర్‌ కోడ్‌ను పంపాడు. 

దీంతో మటన్‌ వ్యాపారి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంతో వికాస్‌ పటేల్‌ అతడి ఖాతాలో రూ.5 జమ చేశాడు. కన్ఫర్మేషన్‌ కోసం మరోసారి కోడ్‌ను స్కాన్‌ చేయాలని వికాస్‌ పటేల్‌ సూచించడంతో మటన్‌ వ్యాపారి అలాగే చేశాడు. అంతే మరుక్షణం మటన్‌ వ్యాపారి ఖాతాలో ఉన్న రూ.75వేలు మాయమయ్యాయి.  షాక్‌తిన్న  మటన్‌ వ్యాపారి రాహుల్‌ సోనాల్‌ వెంటనే వికా్‌సపటేల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ సంజీవ్‌ తెలిపారు.

Updated Date - 2022-06-26T05:54:15+05:30 IST