‘కారు చౌక’ మోసం.. రూ. 1.85 కాజేసిన కేటుగాళ్లు

ABN , First Publish Date - 2021-03-26T19:01:35+05:30 IST

పొల్యూషన్‌ తక్కువగా ఉండే కారును చౌక ధరకు అమ్ముతామంటూ

‘కారు చౌక’ మోసం.. రూ. 1.85 కాజేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌ : పొల్యూషన్‌ తక్కువగా ఉండే కారును చౌక ధరకు అమ్ముతామంటూ బురిడీ కొట్టించి రూ. 1.85లక్షలు కొల్లగొట్టిన భోపాల్‌ సైబర్‌ ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరికి చెందిన పరుచూరి శ్రీకాంత్‌ అక్కడే ఇసుక వ్యాపారం చేసేవాడు. తాగుడుకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో వేరే పనికోసం భోపాల్‌కు వెళ్లాడు. అక్కడ అంకిత్‌ జైన్‌, అమన పటేల్‌ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి ఏదో ఒక మోసం చేసి డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. నకిలీ పత్రాలతో మూడు కొత్త సిమ్‌కార్డులు కొనుగోలు చేశారు. ఇంటర్నెట్‌లోంచి బీఎస్‌-4 వాహనం ఫొటోను డౌన్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. కొత్తగా తీసుకున్న  ఫోన్‌ నంబర్‌లు అప్‌లోడ్‌ చేశారు. రాచకొండ కమిషనరేట్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దాన్ని కొనుగోలు చేద్దామని వారిని ఫోన్‌లో సంప్రదించాడు. అతన్ని మాయ మాటలతో నిందితులు తక్కువ ధరకే ఖరీదైన కారు అమ్మేస్తున్నట్లు నమ్మించారు. అడ్వాన్స్‌గా రూ. 1.85లక్షలు ఆన్‌లైన్‌ ట్రాన్సఫర్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్‌లు స్విచాఫ్‌ చేశారు. దాంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా భోపాల్‌కు వెళ్లి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - 2021-03-26T19:01:35+05:30 IST