సైబర్‌.. కేటుగాళ్లు

ABN , First Publish Date - 2021-10-09T05:46:21+05:30 IST

ముఖ్యమైన పండుగులు.. కంపెనీల వార్షికోత్సవాల పేరుతో ఇటీవల సైబర్‌ కేటుగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు.

సైబర్‌.. కేటుగాళ్లు

బహుమతుల పేరిట వల

చిక్కితే బాధితుల ఖాతాలు ఖాళీనే

ఆన్‌లైన్‌ బుకింగ్‌లపై కేటుగాళ్ల చూపు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు


దసరా సందర్భంగా ఈ కామర్స్‌లో మీరు ఫోను బుక్‌ చేశారు. లాటరీలో ఖరీదైన బహుమతి గెలుచుకున్నారు. బహుమతి ఉచితం. కాకపోతే దీనికి సంబంధించి కొంత మొత్తం ట్యాక్సుల రూపంలో చెల్లించాలి.  ఆ మొత్తం చెల్లిస్తే  బహుమతి ఇస్తాం.. ఇలా సైబర్‌ కేటుగాళ్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. వీరి కాల్స్‌కు స్పందించామా ఇక వారి వలకు చిక్కినట్లే. పండుగ ఆఫర్లను అడ్డుపెట్టుకుని, ఈ కామర్స్‌ సైట్లు ద్వారా మన సమాచారాన్ని దొంగిలించి మనల్ని మోసం చేయడానికి సైబర్‌ కేటుగాళ్లు ఎంచుకున్నా నయా దందా ఇది. ఇటువంటి ఫోన్‌కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా.. బహుమతుల ఆశతో అనేక మంది చిక్కి తీవ్రంగా నష్టపోతున్నారు. 



59 శాతం ఆన్‌లైన్‌ నేరాలు 

2021 జాతీయ నేరజాబితా ప్రకారం 17 శాతం సాధారణ నేరాలు జరిగాయి. అదే ఆన్‌లైన్‌ నేరాలు 59 శాతం నమోదయ్యాయి. అంటే  సైబర్‌ కేటుగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందులో చాలామంది మొబైల్‌, కంప్యూటర్‌ వాడే వారే సైబర్‌ మోసాలకు గురయ్యారు. ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోళ్లపై సరైన రక్షణ, నియమాలు పాటించకపోవడం వల్లే 67 శాతం సైబర్‌ నేరాలు నమోదు అవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


గుంటూరు(తూర్పు), అక్టోబరు 8: ముఖ్యమైన పండుగులు.. కంపెనీల వార్షికోత్సవాల పేరుతో ఇటీవల సైబర్‌ కేటుగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. పండుగల వేళ ఈ కామర్స్‌ వ్యాపారులు తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తుంటారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలుకు ప్రత్యేక ఆశక్తి చూపుతుంటారు. ఇదే అవకాశంగా సైబర్‌ నేరగాళ్లు తమ చేతులకు పనులు చెప్పి వినియోగదారులకు ఆశ చూపించి వారిని బుట్టలో వేసుకుంటారు.  ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లావాదేవీలను సైబర్‌ కేటుగాళ్లు గమనిస్తూ ఉంటారు. అందుకే వస్తువును బుక్‌ చేసుకున్న తరువాత వచ్చే ప్రతి  ఫోన్‌ కాల్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలను మాత్రం ఎవరితో పంచుకోవద్దంటారు.


బహుమతులు అంటూ ఎస్‌ఎమ్‌ఎస్‌లు 

సెల్‌ఫోను ద్వారా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే వారు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వారి వివరాలను సైబర్‌ నేరగాళ్లు సేకరిస్తారు.  వీరికి లాటరీలు, బహుమతులు అని ఎరవేస్తూ వారి ఫోన్లకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుతుంటారు. ఇలాంటి ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేసి, వివరాలను తెలపగానే అవతలి నుంచి ఒక వ్యక్తి ఫోను చేసి మనం ఈ కామర్స్‌లో బుక్‌ చేసుకున్న వస్తువు వివరాలను తెలుపుతారు. దీంతో మనం కూడా అవతలి వ్యక్తి మాటలు పూర్తిగా నమ్ముతాం.. దీనినే ఫ్రెండ్లీ ఫ్రాడ్‌ అని కూడా అంటారు. వారి మాటలను నమ్మి డబ్చులు కట్టగానే అవతలి వ్యక్తి ఫోను స్విచ్‌ ఆఫ్‌ అయిపోతుంది.   


హాట్‌ మెయిల్‌కు స్పందిస్తే అంతే

హాట్‌ మెయిల్‌ ద్వారా వచ్చే మెయిల్స్‌కు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. జీ మెయిల్‌, యాహూ మెయిల్‌ ఖాతాల్లాగా సైబర్‌ నేరస్తులు ఎక్కువుగా హాట్‌మెయిళ్లను ఉపయోగిస్తుంటారు. హాట్‌మెయిల్‌ ఉండే టోర్‌టీ అనే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దాని సాయంతో మన సెల్‌ఫోన్లను హ్యాక్‌ చేసి మన సమచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దీంతో ఒక్కోసారి మన వ్యాలెట్‌లో ఉండే డబ్బులు కూడా పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్లలో యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోరు నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  


ఈ జాగ్రత్తలు తప్పనిసరి.......

- ఎవరైనా క్యూఆర్‌ కోడ్‌ పంపి స్కానింగ్‌ చేసి డబ్బులు పంపాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌ నగదు చెల్లింపునకు ఉపయోగించే యాప్‌ పాస్‌వర్డ్‌లను కనీసం నెలకు ఒక్కసారైనా మార్చాలి.  

- అపరిచిత వ్యక్తులు ఏదైనా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయమంటే చేయవద్దు. కస్టమర్‌ కేర్‌ నెంబరు కోసం అధికార వైబ్‌సైట్‌లు, యాప్‌లలో మాత్రమే వెతకాలి. +11, +123,+15151 అనే ఫోను నంబర్లును నుంచి ఛాటింగ్‌ చేస్తే సహకరించరాదు.

- హెవ్‌ ఐ బీన్‌ పాన్డ్‌ అని క్రోమ్‌ టైప్‌ చేసి మీరు వినియోగించే మీ ఫోను, ల్యాప్‌టాప్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.


ఇలా ఫిర్యాదు చేయవచ్చు

సైబర్‌ కేటుగాళ్లకు చిక్కి నష్టపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్‌ పోలీసులకే కాదు  సమీప పోలీసుస్టేషన్లలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మోసాలకు గురైన వారు 90176 66667 అనే వాట్సాప్‌ నెంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. 72191 09619 అనే నెంబరకు నేరుగా ఫోను చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు. అకౌంట్‌ నుంచి డబ్బు పోతే వెంటనే 155260 అనే హెల్ప్‌లైన్‌ నెంబరుకు సమాచారం ఇవ్వాలి.  


అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ కేటుగాళ్ల వలకు చదువుకున్న వారు కూడా చిక్కుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మన ఫోను, కంప్యూటర్‌లోని సమాచారాన్ని ఎవరికీ తెలియనివ్వరాదు. మోసపోయాం అని తెలియగానే ఫిర్యాదు చేయండి.  

 - చదలవాడ హరిబాబు   

రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు, వినియోగదారుల ఫెడరేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు

 

Updated Date - 2021-10-09T05:46:21+05:30 IST