సైబర్‌ ‘వారియర్స్‌’

Published: Thu, 18 Aug 2022 00:39:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సైబర్‌ వారియర్స్‌

- పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్‌ అంబాసిడర్లకు శిక్షణ

- నేరాలను నియంత్రించడమే లక్ష్యం

- విద్యార్థులు...ఉపాధ్యాయులకు మెళకువలు

- జిల్లాలో ఇప్పటికే వంద మందికిపైగా సిద్ధం


జగిత్యాల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో బురిడీ కొట్టించి.. వివరాలను సేకరించి దోచుకుంటున్నారు. తీరా మోసపోయామని గ్రహించిన వారు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు. సైబర్‌ మోసాల బారిన పడుతున్న వారిలో ప్రజలే కాదు. విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులు, మహిళలు సైతం ఉండటం ఆందోళనకర పరిణామంగా తయారయింది. ఇటువంటి పరిస్థితులను అదిగమించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 

 ఉన్నతాధికారుల పర్యవేక్షణ..

జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పోలీసు సబ్‌ డివిజన్‌లు ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా మండలాల్లో ఏర్పాటు  చేసిన పోలీస్‌స్టేషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో ఇద్దరు చొప్పున సైబర్‌ విభాగం చూస్తున్నారు. వారు సైబర్‌ నేరాల నియంత్రణకు, ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. బాధితులు మరోసారి మోసపోకుండా అవగాహన కల్పిస్తారు. ఈ నేపథ్యంలో సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఆయా కేసులపై తక్షణమే స్పందించేలా స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ నుంచి ఎస్పీ వరకు ప్రతీ నిత్యం ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. కేసు ఏ పరిస్థితిలో ఉంది.. బాధితులకు న్యాయం జరిగిందా లేదా.. తదితర వివరాలపై ఆరా తీస్తుంటారు.

- విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ..

విద్యార్థులకు ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించడం వల్ల వారితో పాటు కుటుంబ సభ్యులను చైతన్యం చేసే విషయంపై పోలీసు శాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున వంద మంది సైబర్‌ అంబాసిడర్లకు శిక్షణను అందించారు. యంగిస్థాన్‌ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాలో 1,650 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నుంచి 3,300 మంది విద్యార్థులకు సైబర్‌ భద్రతపై శిక్షణ ఇచ్చారు. జగిత్యాల జిల్లా పరిధిలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో 8వ, 9వ తరగతులకు చెందిన సుమారు వందకు పైగా విద్యార్థులకు, 50 మంది ఉపాధ్యాయులకు పది నెలల పాటు సైబర్‌ నేరాలపై అవగాహన, నివారణకు శిక్షణను అందించారు.  వారం రోజుల క్రితం శిక్షణ ముగింపు సందర్భంగా గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, గుర్తింపు కార్డులను అందించారు.

- పది నెలలుగా ఆన్‌లైన్‌ శిక్షణ..

జిల్లాలో సైబర్‌ అంబాసిడర్ల తయారీకి గడిచిన పది నెలలుగా ప్రత్యేక ఆన్‌లైన్‌ శిక్షణను పోలీసు శాఖ అందించింది. సెల్‌ఫోన్‌ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, లాటరీలు, ఇతర అత్యాశ చూపుతూ జరిగే మోసాలు తదితరాలపై చైతన్యం చేశారు. ఎంపికైన విద్యార్థుల స్నేహితులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు సైతం ఆన్‌లైన్‌లో మోసపోకుండా ఉండేలా తీర్చిదిద్ది చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 50 పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని విద్యార్థులకు మెంటర్‌గా ఎంపిక చేశారు. వీరందరిని సైబర్‌ కాంగ్రెస్‌గా సంబోదిస్తున్నారు. కేవలం సైబర్‌ మోసాల గురించి కాకుండా మహిళలు, చిన్నారుల విషయంలో జరుగుతున్న వేధింపులపై అప్రమత్తంగా ఉండడం, డయల్‌ 100తో పాటు చిల్డ్రన్‌ హెల్ప్‌లైన్‌ 1098 వివరాలపై చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

- శిక్షణలో ప్రధాన అంశాలు ఇలా...

పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్‌ అంబాసిడర్లకు శిక్షణను అందిస్తున్నారు. ఇందులో సైబర్‌-1 కింద అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకమైన నెల రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. డిజిటల్‌ వెల్‌నెస్‌, సైబర్‌ భద్రతపై అవసరమైన మెళకువలను అందించారు. సైబర్‌-2 అనే పర్సువల్‌ స్టేషన్‌ ద్వారా మరో ప్రత్యేక శిక్షణ అందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కౌమరదశలో ఉన్న పిల్లలను ఎంపిక చేసి శిక్షణ అందించారు. సైబర్‌ భద్రతపై పట్టణ ప్రాంతాల్లో క్లబ్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. సైబర్‌-3 అనే ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులను, ఒక్కో ఉపాధ్యాయుడిని మెంటర్‌గా ఎంపిక చేశారు. పాఠశాలల్లో సైబర్‌ సేఫ్టీ క్లబ్‌ల ఏర్పాటు చేయడం,  చిన్నపిల్లలు పోలీసు శాఖ మధ్య బలమైన సంబంధాలు ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక డిజిటల్‌ పౌరసత్వం, నెట్‌ క్యూట్‌లు, మొబైల్‌ బ్రౌజర్లు, యాంటి వైరస్‌, సైబర్‌ బెదిరింపులు, యాప్‌ భద్రత, మొబైల్‌ భద్రత లక్షణాలు, డిజిటల్‌ గుర్తింపు, సైబర్‌ డ్రామా, సైబర్‌ ట్రోలింగ్‌, సైబర్‌ సెక్సింగ్‌, సైబర్‌ పరువు నష్టం, సైబర్‌ గేమింగ్‌, ఆన్‌లైన్‌ చట్టాలు తదితర అంశాలపై నైపుణ్యాన్ని అందించారు. సైబర్‌ అంబాసిడర్‌లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకు సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు. జిల్లాలో ఇటీవల జరిగిన గ్రాండ్‌ ఫినాలేతో ఆపకుండా ఎడ్యూకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉమెన్‌ సేఫ్టీ పోలీసు సహకారాలతో మరింత మంది సైబర్‌ అంబాసిడర్లను తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితో పాటు ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌పై జరిగే నేరాలను నిరోదించడానికి షీ టీమ్స్‌, ఉమెన్‌ సేఫ్టి వింగ్‌ల సహకారాలతో ముందుకు వెళ్లడంపై దృష్టి సారించారు.

- జిల్లాలో ఆన్‌లైన్‌ మోసాలు..

జిల్లాలో గడిచిన యేడాదిలో పలు పోలీస్‌స్టేషన్లలో ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో గత యేడాది 276 సైబర్‌ క్రైం కేసులు నమోదు చేశారు. బాధితులు తమ బ్యాంకు ఖాతా నుంచి రూ. 18,92,237 నష్టపోయారు. పోలీసులకు ఫిర్యాదు అందగానే సత్వరమే స్పందించి 22 కేసుల్లో రూ. 5,71,335 నగదు రికవరీ చేశారు. ప్రస్తుత సంవత్సరంలో జూలై మాసాంతం వరకు 201 సైబర్‌ కేసులు నమోదు అయ్యాయి. బాధితులు రూ. 71,38,395 నగదును కోల్పోయారు. 42 కేసుల్లో రూ. 4,34,575 నగదును రికవరీ చేశారు. కాగా జిల్లాలో డయల్‌ 100కు 21,449 కాల్స్‌ రాగా ఇందులో 380 సంఘటనలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సోషల్‌ మీడియాకు సంబంధించి వాట్సాప్‌ ఫిర్యాదులు 88 రాగా 15 వాటిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఒకటి పెట్టీ కేసు నమోదు చేశారు. మూడు ఫేస్‌బుక్‌కు సంబంధించి ఫిర్యాదు రాగా రెండు సంఘటనల్లో కేసులు నమోదు చేశారు. ట్విట్టర్‌కు సంబంధించి 143 ఫిర్యాదులు అందగా ఒక సంఘటనపై కేసు నమోదు అయింది. వీటితో పాటు ఆయా పోలీస్‌ స్టేషన్‌లో ఆన్‌లైన్‌ మోసాలపై పలు కేసులు నమోదు అయ్యాయి.

- వెంటనే సంప్రదిస్తే మేలు..

జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో వినియోగంలోకి తెచ్చింది. సైబర్‌ క్రైమ్‌ గవ్‌ డాట్‌ ఇన్‌ అనే వెబ్‌ సైట్‌లో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లేదంటే ఆన్‌లైన్‌లో మోసపోగానే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి వివరాలను అందించాలి. సంబంధిత పోలీసులు స్పందించి నగదు చేజారకుండా ఖాతాను ఫ్రీజింగ్‌ చేసేలా చూస్తారు. కేంద్ర సైబర్‌ క్రైమ్‌ అధికారులు, రాష్ట్ర అధికారులకు తగిన సమాచారం ఇస్తారు. రాష్ట్ర అధికారులు జిల్లా స్థాయి అధికారులకు అక్కడి నుంచి క్షేత్ర స్థాయి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం వెళ్తుంది. దీంతో బాధితుడికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.