Cyberabad ట్రాఫిక్‌ డీసీపీకి స్థాన చలనం..?

ABN , First Publish Date - 2022-03-06T12:31:22+05:30 IST

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ బదిలీ అయినట్లు తెలుస్తోంది.

Cyberabad ట్రాఫిక్‌ డీసీపీకి స్థాన చలనం..?

హైదరాబాద్‌ సిటీ : సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా 2018 మార్చిలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నాలుగేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ సిబ్బందిని పరుగులు పెట్టించారు. రహదారి భద్రతకు పెద్దపీట వేసిన ఆయన రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులను ఛేదించడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అధ్యయనం చేయడానికి రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఆర్టీఏఎమ్‌) ఏర్పాటు చేశారు. అయితే డీసీపీ బదిలీపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.


సిటీకి కొత్తగా ముగ్గురు డీసీపీలు

హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లో మూడు జోన్‌లకు ముగ్గురు ఐపీఎస్‌లను డీసీపీలుగా నియమించినట్లు సమాచారం. సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా రాజేష్‌ చంద్ర, సౌత్‌జోన్‌ డీసీపీగా సాయి చైతన్య, ఈస్టు జోన్‌ డీసీపీగా సతీ‌ష్‌ను నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నలుగురు ఐపీఎస్‌ల బదిలీల వార్త శనివారం వైరల్‌గా మారింది. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడం గమనార్హం. బదిలీ స్థానాల్లో మార్పులు ఉంటాయా..? లేక వారినే కేటాయించే అవకాశం ఉందా అనే దానిపై స్పష్టత లేదు.

Updated Date - 2022-03-06T12:31:22+05:30 IST