‘నివర్‌’ ముప్పు..!

ABN , First Publish Date - 2020-11-25T05:27:16+05:30 IST

జిల్లాలో పలు సాగునీటి వనరుల ఆధారంగా ఖరీ్‌ఫలో 45 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు.

‘నివర్‌’ ముప్పు..!
కమలాపురం మండలంలో కోతకొచ్చిన వరి పైరు

తుఫాన్‌ హెచ్చరికతో రైతుల్లో ఆందోళన

ఇప్పటికే వరద, అధిక వర్షాలకు తీవ్ర నష్టం

పంట చేతికొచ్చేవేళ తుఫాన్‌ గండం

వరి, పత్తి, ఉద్యాన పంటలకు ముప్పే అంటున్న నిపుణులు 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. నేడు తీరం దాటుతుందని, మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరికే కాదు పత్తి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. నేటి నుంచి మొదలయ్యే నివర్‌ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టరు గౌతమి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు సాగునీటి వనరుల ఆధారంగా ఖరీ్‌ఫలో 45 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వల్లూరు, కమలాపురం, చెన్నూరు మండలాల్లో ఇప్పటికే వరి కోతలు 30 శాతం పూర్తి అయ్యాయి. ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, కడప, మైలవరం, పోరుమామిళ్ల, బద్వేలు, ఒంటిమిట్ట, నందలూరు తదితర మండలాల్లో మరో వారం పది రోజుల్లో కోతలు మొదలుకానున్నాయి. కీలకమైన ఈ సమయంలో నివర్‌ తుఫాన్‌ హెచ్చరికలు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. రైతులు సెప్టంబరు, అక్టోబరు నెలల్లో వరదలు, అధిక వర్షాలకు భారీగా నష్టపోయారు. దిగుబడి కూడా భారీ తగ్గనుంది. ఈ కాస్త దిగుబడి కూడా చేతికందుతుందో లేదో అనేలా నివర్‌ తుఫాను భయపెడుతోంది. పత్తి సుమారు 25 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇప్పుడిప్పుడే పత్తికోత మొదలైంది. తుఫాన్‌ దాటికి తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడ్డ (పప్పు) శనగ 45 వేల హెక్టార్లలో సాగు చేశారు. ముందుగా సాగు చేసిన పంట పూత దశలో ఉంది. తుఫాన్‌ ప్రభావం శనగ పైరుపై తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ అధికారుల అంచనా. 1.09 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. అరటి 20 వేల హెక్టార్లలో, బొప్పాయి 7-8 వేల హెక్టార్లలో సాగు చేశారు. పూలు, కూరగాయలు, ఉల్లి సరేసరి. భారీ గాలులతో తుఫాన్‌ వస్తే అరటి, బొప్పాయి తీవ్రంగా బెబ్బతినే ప్రమాదం ఉందని ఉద్యానవన శాఖ డీడీ తెలిపారు.


ఇప్పటికే భారీ నష్టం

సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో దాదాపుగా 7,500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం రూ.11.12 కోట్ల నష్టం జరిగింది. ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిని రూ.25 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి కోలుకోకనే మళ్లీ నివర్‌ తుఫాన్‌ కత్తి మెడపై వేలాడుతోందని తెలిసి కష్టజీవులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నివర్‌ తుఫాన్‌ నుంచి రైతులకు అన్ని విధాలుగా సహాయక చర్యలు అందించడానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ మురళికృష్ణ మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అప్రమత్తం చేశారు.


రేపు అత్యంత భారీ వర్ష సూచన

బుధవారం నుంచే జిల్లాలో తఫాన్‌ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చిట్వేలి, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పెనగలూరు, పుల్లంపేట, రాజంపేట, టి.సుండుపల్లె మండలాల్లో 73.44 మి.మీల నుంచి 123.2 మి.మీల వర్షపాతం, మిగిలిన మండలాల్లో 10-25 మి.మీల వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం పెండ్లిమర్రి మండలంలో 283.37 మి.మీలు, పోరుమామిళ్లలో 306.82, రామాపురంలో 206.41, మైదుకూరులో 279.53, వల్లూరులో 209.16, వీఎన్‌ పల్లెలో 261.96, వేంపల్లిలో 261.96, వేములలో 234.88, ఎర్రగంట్లలో 217.88, ఒంటిమిట్ట మండలంలో 157.82 మి.మీలు, మిగిలిన మండలాల్లో 113 మి.మీలకు పైగా వరపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.


జిల్లా కంట్రోల్‌ రూం నంబరు : 08562 245259

జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు గౌతమి ఆధ్వర్యంలో సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. కలెక్టరేట్‌లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. నెంబరు 08562 245259కు ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు. ప్రతి తహసీల్దారు కార్యాలయంలోనూ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సచివాలయ ఉద్యోగుల నుంచి మండలస్థాయి అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


Updated Date - 2020-11-25T05:27:16+05:30 IST