గుండెల్లో తుఫాను

ABN , First Publish Date - 2020-11-24T06:11:04+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్‌ తుఫాను రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది.

గుండెల్లో తుఫాను

రైతులను వెంటాడుతున్న వర్ష భయం

వరి నేలవాలితే ‘కోత’ భారం

నేటినుంచి నాలుగు రోజులు వర్షాలు!

పంటలను కాపాడుకునేందుకు పరుగులు

25వేల హెక్టార్లలో వరి..

7,500 హెక్టార్లలో పత్తి పంటలపై ప్రభావం


బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్‌ తుఫాను రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. మంగళవారం నుంచి జిల్లాలో భారీ వర్షాలతోపాటు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరించింది. దీంతో పొలాల్లో చేతికందే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు  సోమవారం రైతులు పరుగులు పెట్టారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరును కోసి, కుప్పలు వేస్తున్నారు. ఇందుకు గానూ గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు కూలీ చెల్లించాల్సి వస్తోంది.   యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసినవారు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : నివార్‌ తుఫాను ప్రభావం 25 వేల హెక్టార్లలోని వరి, 7,500 హెక్టార్లలోని పత్తిపై పడుతుందని జిల్లా వ్యవసాయశాఖ సోమవారం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 45 వేల హెక్టార్లలో వరికోతలు పూర్తయినట్లు అఽధికారులు చెబుతున్నారు.  


యంత్రాలతో వరికోతలకు ఆటంకం 

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.45 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. కోతకు పది రోజుల ముందు నుంచి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటారు. అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో వరి మొదళ్లు బలహీనపడి, పైరు నేలపై వాలిపోయింది. నేలవాలిన పైరును యంత్రాల ద్వారా కోయడం ఇబ్బందవుతుంది. ఆరుదల ఉన్న భూముల్లో కోత యంత్రాలకు గంటకు రూ.18వందల నుంచి, రెండువేల రూపాయలు ఇచ్చేవారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం గంటకు మూడువేల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు. 


70 శాతం నేలవాలిన వరి 

జిల్లాలో ఈ ఏడాది 2.45 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. భారీ వర్షాల కారణంగా 70 శాతం పైరు నేలవాలిందని రైతులు అంటున్నారు.  వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లో వరి ఏపుగా ఎదిగి, బరువుతో అధిక శాతం  నేలవాలింది. ఈ పొలాల్లో యంత్రాల ద్వారా కోతకు వీలులేకపోవడంతో కూలీలద్వారా కోయించాల్సి వస్తోంది. ఎకరానికి రూ.7నుంచి పది వేల వరకు కూలీగా డిమాండ్‌ చేస్తుండటంతో ఈ ఏడాది తమకు ఏమీ మిగలదని  రైతులు వాపోతున్నారు. కూలీ ఇంత ఎక్కువగా ఉన్నపుడు కోత కోయిస్తే అప్పులే మిగులుతాయని కౌలు రైతులు వాపోతున్నారు. ఇప్పటికిపుడు కోతలు పూర్తిచేసినా, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి తడవకుండా నిల్వచేయడం సాధ్యమయ్యే పని కాదని, అంత జాగా, గిడ్డంగులు అందుబాటులో ఉండవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


మినుముకు నష్టమే

రబీలో అపరాల పంటగా రైతులు 3.50 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారు. వరికోతకు వారం ముందుగానే పొలంలో మినుము విత్తనాలు చల్లుతారు. కంకిపాడు, ఉయ్యూరు తదితర మండలాల్లో మినుము విత్తనాలు  చల్లారు.  ఈ తరుణంలో భారీవర్షాలు కురిస్తే, పొలంలో నీరు చేరుతుందని, ఆ నీరు ఎక్కువరోజులు నిల్వ ఉంటే మినుము మొక్కదశలోనే చనిపోతుందని రైతులు అంటున్నారు. 

Updated Date - 2020-11-24T06:11:04+05:30 IST