సైకోసొమాజిట్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్య ఎవరిలో ఎక్కువంటే..?

ABN , First Publish Date - 2022-04-26T23:01:53+05:30 IST

‘‘ఆస్పత్రుల చుట్టు తిరిగీ, తిరిగీ డబ్బులు వృథా అవుతున్నాయే తప్ప, నా జబ్బేంటో బయటపడడం లేదు. ఏ ఒక్క డాక్టరుకూ నా జబ్బు అంతు పట్టడం లేదు.

సైకోసొమాజిట్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్య ఎవరిలో ఎక్కువంటే..?

ఆంధ్రజ్యోతి(26-04-2022)

‘‘ఆస్పత్రుల చుట్టు తిరిగీ, తిరిగీ డబ్బులు వృథా అవుతున్నాయే తప్ప, నా జబ్బేంటో బయటపడడం లేదు. ఏ ఒక్క డాక్టరుకూ నా జబ్బు అంతు పట్టడం లేదు. నాకున్న వ్యాధిని కనిపెట్టే డాక్టర్లే లేరా?’’... ఇలా ఆవేదన పడేవాళ్లను మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ నిజానికి అసలు సమస్య వీళ్ల శరీరంలో కాకుండా మనసులో ఉంటుంది. సైకోసొమాజిట్‌ డిజార్డర్‌ అనే ఈ మానసిక సమస్యను వాళ్ల మనసుకు చేరువగా ఉంటూ సరిదిద్దుకోవాలి అంటున్నారు మానసిక వైద్యులు.


ఏ ఆరోగ్య సమస్య అయినా వైద్య పరీక్షలతో నిర్థారణ అవుతుంది. ఫలితాన్ని బట్టి వైద్యులు సూచించిన చికిత్స తీసుకుంటే, కచ్చితంగా సమస్య పరిష్కారమవుతుంది. కానీ కొందరి విషయంలో ఇలా జరగదు. వాళ్లకున్న ఆరోగ్య సమస్య ఏ పరీక్షకూ చిక్కదు. ఏ వైద్యుడికీ అంతుపట్టదు. దాంతో వాళ్లు వైద్యులను మారుస్తారు, ఆస్పత్రులను మార్చేస్తారు. చివరకు వ్యాధి కనిపెట్టలేదని వైద్యుల మీదే నెపం వేస్తారు. ఇలా ఏళ్ల తరబడి సమయాన్నీ, డబ్బునూ వృథా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల అసలు సమస్యను కనిపెట్టి, వాళ్లను అనునయించి, వాళ్ల మనసుకు మరమ్మత్తు చేయించడం అవసరం. సైకోసొమాటిక్‌ డిజార్డర్‌ హఠాత్తుగా తలెత్తే సమస్య కాదు. ఈ సమస్యకు ఎన్నో పరిస్థితులు, స్వభావాలూ కారణమవుతాయి. 


ఎవరిలో ఎక్కువంటే...

ఈ సమస్య 16 నుంచి 35 ఏళ్ల లోపు మహిళల్లోనే ఎక్కువ. ఈ వయసు మహిళల్లో చోటుచేసుకునే హార్మోన్ల అవకతవకలు వారిలో ఆందోళన, ఒత్తిడిలను పెంచుతాయి. అలాగే బాధను లోలోపలే దాచుకునే వారి స్వభావం ఫలితంగా క్రమేపీ ఒత్తిడిలు, ఆందోళనలు శారీరక లక్షణాల రూపం దాలుస్తాయి. పైగా ఈ వయసు మహిళలకు ఆరోగ్య సమస్యల లక్షణాల పట్ల అవగాహన, అనుభవం కూడా తక్కువ. కాబట్టి లక్షణాలను వేర్వేరు ఆరోగ్య సమస్యలకు అన్వయించుకుంటారు. అయితే మరి వీరిలో నిజంగానే శారీరక సమస్య ఉంటుందా, లేక దాన్ని వాళ్లు పూర్తిగా ఊహించుకుంటున్నారా? అనే అనుమానం కూడా రావచ్చు. నిజానికి ఈ కోవకు చెందిన వాళ్లలో బాధ 10% ఉంటే, దాన్ని వాళ్లు 100%గా ఊహించుకుంటారు. చిన్నాచితకా శారీరక అసౌకర్యాలను భూతద్దంలో చూసుకుంటూ వాటికే ప్రాథాన్యం ఇస్తారు. సమీప బంధువుల మరణాలను దగ్గరగా చూసిన కొందరు అదే తరహా లక్షణాలతో తమకూ ఆ పరిస్థితి రావచ్చనే  భావనలో ఉంటారు. ఎప్పటికీ  పరిష్కారం కాని తగాదా, విభేదాలతో కూడిన పరిస్థితిలో చిక్కుకుపోయినవాళ్లు వాటి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించే మెలకువలు తెలియక, ఆ బాధ, వేదనలను శారీరక సమస్యగా అన్వయించుకుంటారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే చాకచక్యం లేని వాళ్లు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేవాళ్లు కూడా లేని శారీరక సమస్యలను సృష్టించుకుంటారు. 


ఇలా కనిపెట్టాలి

కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా వైద్యుల దగ్గరకు పరుగులు పెడతాం. పరీక్షలు చేయిస్తాం. అయితే ఇద్దరు, ముగ్గురు వైద్యులను మార్చినా వ్యాధి నిర్థారణ కాకపోతున్నా, పదే పదే చేయించే వ్యాధి నిర్థారణ పరీక్షల్లో వ్యాధి బయటపడకపోతున్నా సైకోసొమాటిక్‌ డిజార్డర్‌గా అనుమానించాలి. వైద్యులు కూడా అదే సమస్యగా నిర్థారించినప్పుడు... ఆ నిర్థారణతో పాటు సదరు వ్యక్తుల్లో ఈ లక్షణాలను కూడా గమనించాలి. అవేంటంటే....


రాత్రుళ్లు నిద్రపోకపోవడం

ఆకలి తగ్గడం

పదే పదే తమకున్న శారీరక లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉండడం

గూగుల్‌లో, యూట్యూబ్‌లో వాటి గురించి సెర్చ్‌ చేస్తూ ఉండడం

చదువు మీద దృష్టి పెట్టకపోవడం

తనకు జబ్బు ఉందని అందరితో వాదనకు దిగడం

ఈ బాధలు నేను పడలేను, చచ్చిపోతాను అని తరచూ అంటూ ఉండడం

లక్షణాల గురించి చెప్తున్నప్పుడు ముఖంలో, శరీరంలో ఎటువంటి భావాలూ పలకకపోవడం

బాధ గురించి ఎక్కువగా మాట్లాడుతూ, అన్ని పనులూ చక్కగా చేసుకోగలుగుతూ ఉండడం

బాధను ఏకధాటిగా గంటల తరబడి వ్యక్తపరుస్తూ ఉండడం 


చికిత్స ఇలా...

సైకోసొమాటిక్‌ డిజార్డర్‌ ఉన్నవాళ్లు... ‘‘డాక్టర్లకీ నాలెడ్జ్‌ లేదు, వ్యాధి నిర్థారణ పరీక్షలు తప్పుడు ఫలితాన్నిస్తున్నాయి. నాకున్న జబ్బును కనిపెట్టలేక నాకు మానసిక వ్యాధి ఉందని ముద్ర వేస్తున్నారు’’... అంటూ బలంగా వాదిస్తూ ఉంటారు. అంతేకాకుండా.. తమకు జబ్బు ఉందని నిరూపించాలనే బలమైన నమ్మకం, పట్టుదలలతో డాక్టర్లనూ, ఆస్పత్రులనూ మారుస్తూ ఏళ్లతరబడి సమయాన్నీ, డబ్బునూ వృథా చేసుకుంటూ ఉంటారు. వీళ్లు మానసిక వైద్యులను కలవడానికి ఇష్టపడరు. ఒకవేళ కుటుంబసభ్యుల బలవంతం మీద మానసిక వైద్యులను కలిసినా, వైద్యులతో కూడా వాదనకు దిగుతారు. ఇలాంటి వాళ్లకు కౌన్సెలింగ్‌లో భాగంగా మానసిక సమస్యలు శారీరక సమస్యలుగా బయల్పడే తీరును వైద్యులు వివరించడంతో పాటు అవసరమైతే సాక్ష్యాలతో నిరూపించి తమకున్న సమస్యను వాళ్లు అంగీకరించే స్థితికి తీసుకువస్తారు. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే మందులు కూడా అవసరం పడతాయి.

 

కుటుంబ సభ్యుల తోడ్పాటు కీలకం

సైకోసొమాటిక్‌ డిజార్డర్‌ ఉందని వైద్యులు నిర్థారించిన తర్వాత, సాధారణంగా సదరు వ్యక్తి పట్ల కుటుంబసభ్యుల ధోరణి మారిపోతూ ఉంటుంది. అంత కాలం పాటు లేని వ్యాధి గురించి అవస్థలు పడ్డామనే ఆలోచనతో అసహనానికి లోనై, కోపం తెచ్చుకుంటారు. కానీ సైకోసొమాటిక్‌ డిజార్డర్‌ ఉన్న వాళ్ల పట్ల ఇలా ప్రవర్తించడం సరి కాదు. అప్పటికే బాధతో ఉన్నవాళ్లు, మరింత బాధలో కూరుకుపోతారు. ఆ బాధను వ్యక్తపరచకుండా, లోలోపలే మధన పడుతూ మరో మానసిక సమస్యను కొని తెచ్చుకుంటారు. ఫలితంగా మరొక శారీరక సమస్య మొదలవుతుంది. ఈ సైకిల్‌ను బ్రేక్‌ చేయాలంటే సదరు వ్యక్తులకు మానసికంగా దగ్గర కావాలి. లక్షణాల రూపంలో వేధిస్తున్న మానసిక సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ మూల కారణానికి తగిన పరిష్కారం వెతకాలి.


శరీరం మీద ఎందుకు?

దీర్ఘకాలంగా ఎలాంటి మానసిక ఒత్తిడి కొనసాగినా, అంతిమంగా శరీరపరమైన అభద్రతాభావనకు దారితీస్తుందని సైకాలజీ చెప్తోంది. ఒత్తిళ్లు వదిలించుకునే మెలకువలు లేని వాళ్లు, దాని ఫలితంగా మొదలయ్యే స్వల్ప లక్షణాల మీద మాత్రమే ఫోకస్‌ పెడతారు. దాంతో శరీరంలో న్యూరోకెమికల్స్‌ ఉత్పత్తై 10ు తీవ్రత కలిగిన లక్షణం కాస్తా 100 శాతానికి పెరిగిన భావనకు లోను చేస్తుంది. దీనికంతటికీ కారణం ఆత్మవిశ్వాసం లోపం, అభద్రతాభావనలే!



నాలుగు రకాలుగా...

హైపోకాండ్రియాసస్‌: ఈ కోవకు చెందిన వాళ్లు లక్షణాల గురించి మాట్లాడకుండా, నాకు బిపి ఉంది... షుగర్‌ ఉంది... గుండె జబ్బు ఉంది అంటూ ఒక వ్యాధిని ప్రస్తావిస్తూ ఉంటారు. 


కన్వర్షన్‌ డిజార్డర్‌: దీనికి మరొక పేరు హిస్టీరియా. ఈ కోవకు చెందిన వాళ్లు ఎటువంటి ఆరోగ్య సమస్య లేకపోయినా, హఠాత్తుగా మూర్ఛలతో కింద పడిపోతారు. 


సొమటైజేషన్‌ డిజార్డర్‌: తలనొప్పి, కడుపు నొప్పి, ఛాతీ నొప్పి... ఇలా లక్షణాల గురించి పదే పదే చెబుతూ ఉంటారు. అయితే ఎలాంటి జబ్బు ఉండి ఉండవచ్చు అనే ప్రశ్నకు వీళ్ల దగ్గర సమాధానం ఉండదు. 


బాడీ డిస్మార్ఫిక్‌ డిజార్డర్‌: తమ శరీరంలో ఏదో లోపం ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. 


డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి,

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌,

ల్యూసిడ్‌ డయాగ్నొస్టిక్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-04-26T23:01:53+05:30 IST