కేసీఆర్ ప్రతీసారీ మైనస్‌లో పోతున్నాడు

ABN , First Publish Date - 2020-02-07T19:58:03+05:30 IST

రాజకీయాల్లో చాలావరకు అదృష్టం మిమ్మల్ని వరిస్తూనే వచ్చింది. కానీ కీలక సమయాల్లో మొహం చాటేస్తోంది...

కేసీఆర్ ప్రతీసారీ మైనస్‌లో పోతున్నాడు

ఉద్యమం కేసీఆర్‌ చేతిలో లేదు..

ముఖ్యమంత్రి పదవిని నేనెన్నడూ లెక్కచేయలేదు

కేసీఆర్ మాటలు ఏవీ నిజం కావడం లేదు

ఉద్యమాన్ని హైలైట్ చేసింది కాంగ్రెసే

5-7-10న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో డీఎస్‌


రాజకీయాల్లో చాలావరకు అదృష్టం మిమ్మల్ని వరిస్తూనే వచ్చింది. కానీ కీలక సమయాల్లో మొహం చాటేస్తోంది...

(నవ్వు) పార్టీలోనే పెరిగాను కనక నా జీవిత లక్ష్యం పార్టీ అధ్యక్షుడు కావాలనే. భగవంతుడి దయ, సోనియా ఆశీస్సులతో సాధించా. రాజశేఖరరెడ్డి కాంబినేషన్‌లో వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగా. ఇంత పేరు వచ్చిన తర్వాత, సంతృప్తికరంగా ఉన్నాను కనక మొహం చాటేస్తోందేమో!! అది విధిరాత. నాకు రాసి ఉంటే తప్పకుండా వస్తుంది. ఎప్పుడూ ఏమిటీ అనేది భగవంతుడు నిర్ణయించాలి. రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. 33 పార్లమెంటు సీట్లు, 156 అసెంబ్లీ సీట్లు గెలిచిన తర్వాత నేనెందుకు ఓడిపోవాలి!? నాకు ముఖ్యమంత్రి అయ్యే సమయం రాలేదేమో!


ఈ ఎన్నికల్లో గెలిస్తే మీకు అడ్వాంటేజి రావచ్చు. గెలవలేకపోతే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది కదా!?

కీలక పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడు పోటీ చేయకుండా ఉంటే తప్పుడు సమాచారం వెళుతుంది. అవి అసలు మావి కాదు కనక ఒక్క సీటు వచ్చినా మంచి ఫలితమే కదా! గత సాధారణ ఎన్నికల తర్వాత.. నియోజకవర్గ ప్రజలు అరే ఈసారి కాంగ్రెస్‌ వస్తుందని అనుకోలేదే. మా నాయకుడిని ఓడగొట్టుకున్నాం. పొరపాటు అయిపోయింది. అభివృద్ధిఆగిపోయిందన్న భావన వ్యక్తపరచినట్లు సమాచారం వచ్చింది. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. లెక్కింపు తర్వాత కానీ ఫలితం తెలియదు.


కేసీఆర్‌ కానీ ఇతర నేతలు కానీ టీఆర్‌ఎస్‌కు తప్ప మిగిలినవాళ్లకు డిపాజిట్లు రావని చెబుతున్నారు...

నేను కూడా చెబుతాను. మేం చెప్పిన మాటలు చాలావరకు సత్యమవుతున్నాయి. కానీ ఆయన మాట్లాడిన మాటలు సాధారణంగా సత్యమవుతున్నట్లు రుజువవడం లేదు. ప్రతిసారీ మైనస్‌లో పోతున్నాడు. ఉద్యమాన్ని హైలైట్‌ చేసింది మేమే.


కానీ దాన్ని ఆయనకు అప్పగించారు కదా! కాంగ్రెస్‌ పుణ్యమంటూ కేసీఆర్‌ పెరిగారన్న అభిప్రాయం ఉంది.

వాస్తవమే. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ కనక తెలంగాణ అంశంపై దానికో దృష్టికోణం ఉంది. ఈ డిమాండ్‌ సరైన డిమాండే అన్న విషయాన్ని వర్కింగ్‌ కమిటీ ఒప్పుకొంది. దీనిని పరిష్కరించాలని కూడా అంది. ఏరకంగా చేయాలన్న విషయంలోనే జాప్యం జరుగుతోంది. 2004లోనే ఎస్‌ఆర్‌సీ వేసి ఉంటే ఈపాటికి నివేదిక వచ్చేసేది. ఇప్పుడు ఎస్‌ఆర్‌సీకి ఆమోదయోగ్యత లేదు. కనక పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆషామాషీగా అనుకున్నారో ఏమో.. ఆ పార్టీ నేతలు ఇచ్చేశారు. వెనక్కి తగ్గారు. దాంతో చివరికి శ్రీకృష్ణ కమిటీని వేసింది. అది సరైన నిర్ణయం, సరైన నివేదిక ఇస్తుందన్న విశ్వాసం నాకుంది.


ఒకవేళ ఆ కమిటీ కలిసి ఉండాలి అని అంటే..

మా మేనిఫెస్టో, వర్కింగ్‌ కమిటీ తీర్మానం, 2009 ఫిబ్రవవరి 12న వైఎస్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన ... ఇవన్నీ అధికారిక పత్రాలు. ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ అంతా చూస్తే తెలంగాణ ఏరకంగా ఇవ్వాలి అన్నదానికే అని స్పష్టమవుతోంది.


తెలంగాణ ఇచ్చినా తెచ్చినా మీరే. అయినా తెలంగాణ, సెంటిమెంట్‌ విషయంలో కేసీఆర్‌కు వచ్చినంత అడ్వాంటేజీ కాంగ్రెస్‌కు ఎందుకు రావడం లేదు?

మీరెందుకలా అనుకుంటున్నారు? 2004లో ఆయనకు 42 ఇస్తే.. ఇంకా పదిచోట్ల అదనంగా పోటీ చేశారు. 26 చోట్ల గెలిచారు. తర్వాత, రాజీనామా చేసిన 16 సీట్లలో మేం ఐదు గెలిచాం. 2009లో టీడీపీతో జట్టుకట్టి పదికి వచ్చారు. ఆయనకు ఎక్కడ అడ్వాంటేజి వచ్చింది.



అసలు తెలంగాణ అనేది పరిష్కారమయ్యే సమస్యేనంటారా? రాష్ట్రంలో రాజధానితో సహా విభజించాల్సిన పరిస్థితి. రాష్ట్ర విభజన సంక్లిష్టం కావడానికి హైదరాబాద్‌ మినహా ఇంకేమైనా ఉందా!?

హైదరాబాద్‌ సంక్లిష్టం కావడానికి వీలే లేదు. కోస్తాంధ్రాకు కానీ రాయలసీమకు కానీ దానితో లింకు ఎక్కడ ఉంది? ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతమన్న వాదనకు అవకాశాలు లేవు. అందరం తెలుగువాళ్లమన్న ప్రేమాభిమానాలు ఇటీవల తగ్గుతున్నాయి. ద్వేషాన్ని పెరగనీయకుండా ఉంచాలి. కేంద్రం కంటే కూడా ఇక్కడి పార్టీలు స్పష్టంగా ఓ నిర్ణయానికి రావాలి. ఏ పార్టీతో సంబంధం లేని పెద్దమనుషులు ఒకరిద్దరు ముందుకు వస్తే మంచిదే. శ్రీకృష్ణ కమిటీ తన పని తాను చేస్తున్నప్పుడు సమాంతరంగా తెలంగాణపై చర్చ, కమిటీని ప్రభావితం చేయడం సమంజసం కాదు. రోజూ దానిపైనే మాట్లాడి ద్వేషాలను పెంచడమూ మంచిదికాదు. అధిష్ఠానం కూడా ఇదే చెప్పింది.


డిసెంబర్‌ 9నచిదంబరం ప్రకటన తొందరపాటు కాదా!?

ఒకరకంగా చూస్తే తొందరపాటు కావచ్చు. రాజకీయ పార్టీలు తీర్మానం పెట్టండి. మేం మద్దతు ఇస్తాం అని ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం.


విభజనకు ఒక దశలో అవతలి ప్రాంతం వాళ్లు కూడా మానసికంగా సిద్ధమైపోయారు. కానీ కేసీఆర్‌ దీక్ష తర్వాత.. దాని ప్రతిపదికన ప్రకటన చేసేసరికి క్రెడిట్‌ ఆయనకు వెళ్లడం ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి.

వాస్తవమే. ఇది జనంలోకి వెళ్లాల్సిన అంశం కాదు. ప్రజాందోళన అవసరం లేదు. దీనికి పరిష్కారం రావల్సిందే.


సమైక్యంగా ఉండి కూడా జరిగిన లోపాలను సరిదిద్దే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదా!?

గత ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్‌ బాగానే చేసింది. కానీ ఈరోజు పరిస్థితి చాలా దూరం పోయింది. స్వయంపాలన అనే దగ్గరకు వచ్చింది.


తెలంగాణను ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరిస్తే ఆ క్రెడిట్‌ కేసీఆర్‌కు వెళుతుందన్న వాదన ఉంది. ఆ దశకు వస్తే.. తెలంగాణ ఇవ్వడానికి అధిష్ఠానం ఒప్పుకుంటే మీరు మాలో కలవాలని కేసీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదన ఏదైనా చేస్తారా?

కాంగ్రెస్‌ ఏ నిర్ణయానికి రావాలన్నా శ్రీకృష్ణ కమిటీ నివేదిక రావాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. క్రెడిట్‌ ఎవరికి వస్తుందనేది కాదు. నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేది ముఖ్యం. తెలంగాణ వ్యక్తి ఉద్యమం కాదు. ప్రజా ఉద్యమం. కేసీఆర్‌ చేతిలో కూడా ఎప్పుడూ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన అధికారాన్ని వదిలేసుకుని చేయడానికి సిద్ధం కాదు.


వ్యక్తిగతంగా సోనియా అభిప్రాయం ఏమిటి?

వ్యక్తిగతంగా ఆవిడ మనకు చెబుతుందా ఏమిటి కానీ బాడీ లాంగ్వేజి, చర్చల సందర్భంగా.. ఏ ప్రాంత ప్రజలనూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. తొందరలో సరైన నిర్ణయం వస్తే బాగుంటుందన్న భావనతో ఉంది.


రాబోయే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి డీఎస్‌ అన్న వాదన వస్తోంది..

ముఖ్యమంత్రి పదవిని నేనెన్నడూ లెక్కచేయలేదు. తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలన్నదే నా కోరిక. అందుకు ప్రశాంతంగా విడిపోవడమే మార్గం అనిపిస్తోంది. మళ్లీ ప్రేమాభిమానాలతో ఇలాగే ఉండాలి. ఒకరిపై మరొకరికి ద్వేషం వద్దే వద్దు.


అధిష్ఠానం రోశయ్యను సీఎంను చేసిన తర్వాత చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. పార్టీలో క్రమశిక్షణను నెలకొల్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కదా!

కాంగ్రెస్‌ పార్టీ సఫర్స్‌ విత్‌ ఎక్సెసివ్‌ డెమొక్రసీ (కాంగ్రెస్‌ పార్టీ మితిమీరిన ప్రజాస్వామ్యంతో బాధపడుతోంది) మళ్లీ సందర్భం రాగానే పూర్తిగా క్రమశిక్షణ వస్తుంది.


8న జగన్‌ యాత్ర చేపట్టబోతున్నాడు. పీసీసీ అధ్యక్షుడిగా వద్దని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?

అధిష్ఠానమే చెప్పింది. వద్దని. గతంలో యాత్ర విషయమై నాతో మాట్లాడాడు. వెళ్లు జగన్‌. ఆ కార్యక్రమమే తప్ప దానిని డైవర్ట్‌ చేసుకోవద్దు. లో ప్రొఫైల్‌లో ఉంటేనే మంచి పేరు వస్తుందని చెప్పా. అది ఆ రకంగా జరగలేదు. ఇంకో రకంగా జరిగింది. అందుకే నేను దానిలోకి పోదలచుకోలేదు.


ఉన్నత పదవికి ప్రతిబంధకం కాకుండా డైట్‌ పాటిస్తారా?

శారీరకంగా కూడా మేథాశక్తితో పని చేయగలుగుతామన్న విశ్వాసం నాకుంది. నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. షుగర్‌, బీపీ వంటి సమస్యలు లేవు. మీరు సలహా ఇస్తే పాటిస్తాను.

Updated Date - 2020-02-07T19:58:03+05:30 IST