ఎన్టీఆర్‌, నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ సమయంలో వార్తలన్నీ నావే

Published: Thu, 07 May 2020 16:01:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎన్టీఆర్‌, నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ సమయంలో వార్తలన్నీ నావే

కాంగ్రెస్‌లా మరే పార్టీ ఆకాశవాణిని దుర్వినియోగం చేయలేదు

శ్రోతల అదృష్టం కొద్దీ నాకు పాటలు పాడటం రాదు

మొదటి జీతం రూ.150.. నా వాయిస్‌ చాలా మంది వింటారని చేరా..

సింగీతం శ్రీనివాసరావు సినిమాకు కథ రాశా

అప్పట్లో ఆకాశవాణి.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. దానికి బాకా ఊదింది

ఎఫ్‌ఎం రేడియోల్లో వాడే భాష నాకు నచ్చదు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో.. ఆకాశాణి వెంకట్రామయ్య


‘ ఆకాశవాణి..వార్తలు.. చదువుతున్నది డి.వెంకట్రామయ్య..’ ఆ మాట వినగానే రేడియోకు అతుక్కుపోయేవారు తెలుగు శ్రోతలు. ఎక్కడి పనులు అక్కడ నిలిపేసి.. చెవులు రిక్కించి.. వార్తలు వింటే కానీ కడుపు నిండేది కాదు. వెంకట్రామయ్య రేడియో న్యూస్‌రీడర్‌ మాత్రమే కాదు. నాటక రచయిత, కథా రచయిత కూడా! హిట్‌ చిత్రం ‘పంతులమ్మ’ రచనా ఆయనదే! రేడియో జర్నలిజంలో మూడున్నర దశాబ్దాల పైగా పని చేసిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలితో.. ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం కోసం.. ఎబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ సంభాషించారు..

 

దాదాపు మూడున్నర దశాబ్దాలు ‘ఆకాశవాణి’లో వార్తలు చదివారనుకుంటా?

నేను న్యూస్‌రూమ్‌లో వార్తలు ఒక్కటే చదవలేదు. ట్రాన్స్‌లేటర్‌ కమ్‌ న్యూస్‌రీడర్‌గా పనిచేశాను. నాకున్న అభిరుచి, ఆసక్తి వల్ల వార్తల ఎడిటింగ్‌ కూడా చేసేవాణ్ణి.

 

అప్పటికీ, ఇప్పటికీ పోలిస్తే మీకు ఏమనిపిస్తుంటుంది?

భాషా పరిజ్ఞానం బాగా తగ్గిపోయింది. ఎంత సీనియర్‌ జర్నలిస్టుకయినా ఒక వార్తను ఎలా రాయాలి? ఏ విధంగా ప్రారంభించాలి? ఏ విధంగా ముగించాలి? అన్న అవగాహన ఉండాలి. రేడియోకు ఇది చాలా అవసరం. ఇప్పుడు అది కొరవడింది. నేర్చుకోవాలన్న జిజ్ఞాస తగ్గింది.


మొదటి బులెటిన్‌ చదివినప్పుడు ఎలా ఫీలయ్యారు?

1963లో ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా చేరాను. 1967లో మొదటిసారిగా న్యూస్‌రూమ్‌లో అడుగుపెట్టాను. అప్పటికే రేడియోలో రకరకాల అనౌన్స్‌మెంట్‌లు చేశాను, కాబట్టి ఫస్ట్‌బులెటిన్‌లో ఎలాంటి ఆందోళనా చెందలేదు.


ప్రతి న్యూస్‌రీడర్‌కీ ఒక మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఉంటుంది. అలాంటిది మీకేమైనా ఉందా? ఆ వార్తను మొదటగా నేనే చదివాను అన్న జ్ఞాపకం ఉందా?

చాలా అరుదైన అనుభవం ఒకటుంది. 1964లో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చనిపోయారు. అప్పటికి నేను అనౌన్సర్‌గా ఉన్నాను. మధ్యాహ్నం సమయంలో ‘ప్రైమ్‌ మినిస్టర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నో మోర్‌’ అని పీటీఐ ప్రింటర్‌లో ఫ్లాష్‌ న్యూస్‌ వచ్చింది. అప్పుడు బి.ఎన్‌.మూర్తి అని అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఉండేవాడు. ఆయన గబాగబా ఆ కాగితం పట్టుకుని స్టేషన్‌ డైరెక్టర్‌కు చూపించాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ‘‘ఏంటి మూర్తిగారు’’ అని అడిగితే విషయం చెప్పాడు. తరువాత ట్రాన్స్‌మిషన్‌ బ్రేక్‌ చేసి ‘‘శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన... ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ కొద్ది సేపటి క్రితం ఢిల్లీలో పరమపదించారు’’ అని అనౌన్స్‌ చేశాను. ప్రతి పది నిమిషాలకొకసారి అనౌన్స్‌ చేశాం. అది మరిచిపోలేని సంఘటన. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చనిపోయినపుడు కూడా నేనే వార్తలు రాశాను. రేడియోలో చదివాను. ఎన్టీఆర్‌, నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ సమయంలో కూడా చాలా మటుకు వార్తలను నేనే రూపొందించడం, చదవడం జరిగింది.


మొదటి జీతం ఎంత?

మొదటి జీతం 150 రూపాయలు. అది కూడా ‘కాంట్రాక్ట్‌ బేస్‌ మీద’ అని చెప్పారు. అప్పటికే నాకు పెళ్లయింది. ‘ఆ కొద్దిపాటి జీతం ఏం సరిపోతుంది! వద్దు’ అని చాలా మంది అన్నారు. కానీ నా వాయిస్‌ చాలా మంది వింటారు కదా అది చాలు అనుకుని చేరిపోయా. ఏడాదిన్నర తరువాత పర్మినెంట్‌ చేశారు. రిటైర్‌ అయ్యే నాటికి గ్రాస్‌ శాలరీ 17 వేలు ఉంది. రిటైర్‌ అయి ఇరవై ఏళ్లు అవుతోంది.

ఎన్టీఆర్‌, నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ సమయంలో వార్తలన్నీ నావే

అప్పట్లో మీరు సినిమాలకు కథలు కూడా రాశారు కదా! ఎందుకని మధ్యలో ఆపేశారు?

నవత పిక్చర్స్‌ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘పంతులమ్మ’ (దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు) అనే సినిమాకు రాశాను. 1978లో విడుదల అయ్యింది. వాసిరెడ్డి సీతాదేవి నవల ‘మట్టిమనిషి’కి స్ర్కిప్టు రాయమని దుక్కిపాటి మధుసూదనరావు అవకాశం ఇచ్చారు. కొన్నేళ్ల పాటు చర్చలు నడిచాయి. నా చేత కొంతవరకు రాయించారు. అప్పటికే దుక్కిపాటికి వయసు మీద పడింది. చివరికి ఆ సినిమా రాలేదు.


ఆ తరువాత ఎందుకు సినిమా కథలు రాయలేదు?

నేను హైదరాబాద్‌లోని ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను. కాబట్టి చెన్నై వెళ్లలేకపోయాను. అప్పట్లో సినిమా పరిశ్రమ మొత్తం అక్కడే ఉంది. నా అంతట నేను వెళ్లి ఏ ప్రొడ్యూసర్‌నూ అవకాశాలను ఇవ్వమని అడగలేదు. నా నుంచి స్వల్ప ప్రయత్నం ఉండుంటే.. ఈపాటికి పాతిక, ముప్ఫయ్‌ చిత్రాలకు రాసుండేవాణ్ణి.


ఆకాశవాణి స్టేషన్లలో అరాచకం రాజ్యమేలింది

ఆకాశవాణి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది కాబట్టి.. వార్తను తిమ్మినిబమ్మి చేసిన సందర్భాలు ఉన్నాయా?

కొంచెం... ఆ మాట నేను వాడను కానీ.. కొన్ని సందర్భాలు ఉండేవి. దానికి కారణం మాది ప్రభుత్వశాఖ కాబట్టి! కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం జరిగిపోయేది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయాల్సి వచ్చేది.

అయితే డెస్కులో నేను ఉన్నప్పుడు, ఇతరులు ఉన్నప్పుడు కొంత వ్యత్యాసం కనిపించేంది. ఈ వార్త రేడియోకు పనికొస్తుందా, లేదా? ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? వార్తలోని వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వొచ్చా.. ఇవ్వకూడదా? ఎంతవరకు ఇవ్వాలి? అనే విషయాలను జాగ్రత్తగా ఆలోచించేవాళ్లం. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ.. ఎవరి విషయంలోనైనా ఇలాగే ఉండేవాణ్ణి. నాకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. కానీ, ఎవరు ఏమీ చేయలేకపోయారు. స్టేషన్‌ డైరెక్టర్‌ నన్ను పిలిచి.. ఈ వార్త ఎందుకు ఇచ్చావు? అదెందుకు అని అడిగేవారు.

 

ఎమర్జెన్సీలో ఈ పరిస్థితి పరాకాష్ఠకు చేరుకుందా?

ఆకాశవాణి స్టేషన్లలో అరాచకం రాజ్యమేలింది. ఇప్పటికీ తల్చుకుంటే బాధ అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. దానికి బాకా ఊదడం అంతే! వార్తలు ఇచ్చేవాళ్లకు వెన్నెముక లేకపోవడం, స్వతంత్రభావాలు లేకపోవడం కారణం. ప్రజలు ఇప్పటికీ అంత మూర్ఖులు కాదు. ఎప్పుడో ఒకసారి అసలు విషయం తెలిసిపోతుంది.

 

జనతా ప్రభుత్వానికి కూడా అదే భజన చేశారా?

ప్రభుత్వ ప్రసార సాధనాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసినంతగా మరెవరూ చేయలేదు. ఒక గల్లీస్థాయి నాయకుడు కూడా మా న్యూస్‌రూమ్‌కు వచ్చి.. పనికిమాలిన వార్తల్ని తీసుకొచ్చి.. ప్రసారం చేయమనేవారు. నాకు కొన్నిసార్లు ఉద్యోగంలో విరక్తి కలిగేది.

 

ఎఫ్‌ఎంలు వచ్చాక.. ఆకాశవాణి ప్రాధాన్యం కోల్పోయినట్లేనా..

అందులో సందేహం లేదు. ప్రాధాన్యం తగ్గింది. అందుకు ప్రధాన కారణం.. ఆకాశవాణి అనేది శబ్ద మాధ్యమం. దూరదర్శన్‌ దృశ్యమాధ్యమం. అరగంట రేడియోలో చదివే వార్తకు.. అర నిమిషం టీవీల్లో చూపించే దృశ్యానికీ చాలా తేడా ఉంటుంది. దృశ్యానికే అధిక ప్రభావం ఉంటుంది.

ఎన్టీఆర్‌, నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ సమయంలో వార్తలన్నీ నావే

మరి, ఎఫ్‌ఎం రేడియోలు ప్రాచుర్యంలోకి వచ్చాయి కదా..!

అవును. అయితే ఎఫ్‌ఎం రేడియోల్లో వాడే భాష నాకు నచ్చదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆకాశవాణిలో ఇలాంటి వార్తల్ని చదవడం, ఉద్యోగం చేయడం కొన్నిసార్లు ఇబ్బంది అని చెప్పాను కదా! అయితే నేటి చానళ్లలో వచ్చే వార్తలకంటే.. ఆ నాడు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో వచ్చే వార్తలే బావుండేవి అనిపిస్తుంది. జర్నలిస్టుకు పాండిత్యం అక్కర్లేదు. భాష పట్ల ప్రాథమిక అవగాహన ఉండాలి. నిత్య అధ్యయనం ఉండాలి. దురదృష్టవశాత్తూ నేటి జర్నలిస్టుల్లో ఆ పరిస్థితి కొరవడింది.

 

రోజూ వందల్లో ఉత్తరాలు!

రేడియోలో నాకు మంచి పేరు తీసుకొచ్చింది ‘కార్మికుల కార్యక్రమం’. రాంబాబు అన్న పేరుతో సుమారు పదేళ్ల పాటు ఆ ప్రోగ్రామ్‌ను నిర్వహించాను. ఆ కార్యక్రమానికి రూపకల్పన చేసింది నేనే! చిన్నక్క (రతన్‌ప్రసాద్‌), ఏకాంబరం (వి. సత్యనారాయణ) అని ఇద్దరుండేవారు. ఆ కార్యక్రమంలో వారు చెప్పే మాటలను నేను రాశాను. ప్రోగ్రామ్‌ బావుందంటూ.. రోజూ కొన్ని వందల ఉత్తరాలు వచ్చేవి. ఈ సీరియల్‌ నాటకం సినిమా తీస్తే బావుంటుంది అని శ్రోతల నుంచి సలహాలు కూడా వచ్చేవి. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వినేవారు.

 

నన్ను ఇంటర్వ్యూ చేసింది ‘దేవులపల్లి’

మాది గుడివాడ దగ్గరున్న దొండపాడు. గుడివాడ ఏఎన్నార్‌ కాలేజీలో చదువుకున్నాను. కాలేజ్‌లో నాటకాలు బాగా వేసే వాణ్ణి. చాలాసార్లు బెస్ట్‌ యాక్టర్‌గా బహుమతులు తీసుకున్నాను. ఒకరోజు ఆల్‌ ఇండియా రేడియోలో అనౌన్సర్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రకటన వచ్చింది. అప్పటికి నా డిగ్రీ పూర్తయింది. మా ఇంట్లో రేడియో కూడా లేదు. గుడివాడలో కొందరు మిత్రులు ఆ ప్రకటన విని నాకు చెప్పారు. దాంతో అప్లికేషన్‌ నింపి పంపాను. రెండు, మూడు నెలల తరువాత ఇంటర్వ్యూకు రమ్మని లెటర్‌ వచ్చింది. బ్యాగు సర్దుకుని హైదరాబాద్‌ బయలుదేరా. రైలెక్కి నాంపల్లిలో దిగా. ఒక చిన్న లాడ్జిలో ఉన్నా. మరునాడు ఇంటర్వ్యూ. సాయంత్రం పబ్లిక్‌గార్డెన్స్‌ చూద్దామని బయలుదేరా. అక్కడ నా సీనియర్‌ మిత్రుడొకరు కలిశాడు. ఏంటి ఇలా వచ్చావని అడిగితే ఇంటర్వ్యూ ఉందని చెప్పా. ఒకసారి చూద్దామని ఆల్‌ ఇండియా రేడియో దగ్గరకు వెళ్లాం. సెక్యూరిటీ వాళ్లు లోపలకి వెళ్లనివ్వలేదు. మరుసటి రోజు వెళితే రాతపరీక్ష, వాయిస్‌ టెస్ట్‌ పెట్టారు. ఆ రోజుల్లోనే ఆ ఉద్యోగానికి 200 మంది హాజరయ్యారు. తరువాత ఇంటర్వ్యూకు పిలిచారు. ఇంటర్వ్యూ చేసే గదిలోకి వెళితే ఇద్దరున్నారు. ఒకరు అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ ధర్మజ్ఞ. మరొకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. నాకిప్పటికీ బాగా గుర్తు. కృషశాస్త్రి గారు ‘ఇంటి పేరు డి అంటే ఏమిటి నాయనా దేవులపల్లా?’ అని నవ్వారు. ‘‘కాదు సార్‌! ‘డి’ అంటే దివి’ అన్నాను. వెంటనే ‘ఓహో దివి నుంచి భువికి దిగి వచ్చావన్నమాట’ అని అన్నారు. బసవరాజు సుబ్బారావు గారు నా నాటకానుభవం గురించి రాసిచ్చిన ఒక టెస్టిమోనియల్‌ను, నాటకాలకు వచ్చిన సర్టిఫికెట్లను చూపించా. అంతే.. ఇంటర్వ్యూ అంతకుమించి ఏం జరగలేదు.

 

తరువాత ఇంటికి వెళ్లిపోయాను. మూడు నెలలు గడిచాయి. నాలుగు నెలలు గడిచాయి. ఎలాంటి సమాచారమూ లేదు. దాంతో ఇంగ్లీష్ లో ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌కు ఒక లెటర్‌ రాశాను. ఇరవై రోజులకు రిప్లై వచ్చింది. ఇంకా మేం అనౌన్సర్‌ ఉద్యోగం విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీసుకుంటే తప్పక తెలియజేస్తాం అని సమాధానమిచ్చారు. ఆ తరువాత రెండు, మూడు నెలలకు కూడా ఎలాంటి సమాచారమూ లేదు. ఎన్నాళ్లు ఖాళీగా ఉంటాం. అందుకే స్కూల్లో సైన్స్‌ టీచర్‌గా చేరా. మూడు వారాలు పనిచేశా. ఆ సమయంలోనే ఆల్‌ ఇండియా రేడియో నుంచి సెలక్ట్‌ అయ్యానని ఉత్తరం వచ్చింది. దాంతో ఆ ఉద్యోగం మానేసి, హైదరాబాద్‌ వచ్చి చేరిపోయా.

 

పిలిపించిన ‘విజయ’ చక్రపాణి

మద్రాసు సినిమా ప్రముఖులు కూడా రేడియోలో నా కార్యక్రమాలను ఆసక్తికరంగా వినేవారు. అలా విని.. ‘విజయ’ నిర్మాతల్లో ఒకరైన చక్రపాణిగారు తనను కలవమని నాకు కబురు పంపారు. అదెలా జరిగిందంటే.. హైదరాబాద్‌లోని హాకా భవనం దగ్గరే చక్రపాణిగారి ఇల్లు ఉండేది. మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిపోతుండేవారు. ఒక రోజున - దండమూడి మహీదర్‌తో (‘చందమామ’ పత్రికలో హిందీ అనువాదకులు) చక్రపాణిగారు.. ‘‘ఎవరీ వెంకట్రామయ్య? ఎవరీ రాంబాబు రూపకర్త?’’ అని అడిగారట. అప్పుడు మహీధర్‌ నా గురించి చెప్పారు. ‘మిమ్మల్ని చక్రపాణిగారు కలవమన్నారు’ అని మహీధర్‌ నాతో చెప్పారు. నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఎక్కడ ‘విజయ’ సంస్థ.. ఎక్కడ చక్రపాణి.. అంతటి గొప్ప వ్యక్తి నన్ను కలవమనడం ఏమిటని సంతోషపడ్డాను. ఒకసారి వెళ్లి కలిశాక.. మళ్లీ నాలుగైదుసార్లు వెళ్లి కలిసే అవకాశం లభించింది. చక్రపాణిగారు చనిపోయిన నాలుగైదేళ్ల ముందు జరిగిందీ సంఘటన. నేను ఆయన్ని కలిసిన ప్రతిసారీ.. ‘యువ’ పత్రికకు ఏదైనా రాస్తుండు అనడిగేవారు. ఆ పత్రిక ఆయన ఆధ్వర్యంలోనే వచ్చేది.

 

నా వృత్తి రేడియో జర్నలిజం. నా సర్వీసు మొత్తం న్యూస్‌రూమ్‌లోనే! రేడియోలో న్యూస్‌ చదవడం, రాయడం వరకే కాదు. నేను కనీసం 150 నుంచి 200 వరకు నాటకాలు రాశాను. నేనే ప్రొడ్యూస్‌ చేశాను. చాలా నాటకాల్లోని ప్రధాన పాత్రల్లో నేనే నటించాను. అప్పట్లో రేడియోలో సీరియల్స్‌ రాశాను. ‘ఆకాశవాణిలో నా అనుభవాలు’ పుస్తకం రాశాను. అందులో మొదటి వాక్యం ‘శ్రోతల అదృష్టం కొద్దీ పాటలు పాడటం నాకు చేత కాదు’ అని రాశాను. అంటే నేను పాటలు ఒక్కటే పాడలేదు. మిగిలిన సాహిత్య ప్రక్రియలన్నింటినీ రాశాను. ఇదే పుస్తకంలో ముగింపు వాక్యం రాశాను. అది ‘ఆరున్నర దశాబ్దాల ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్ర చరిత్రలో నేనూ ఒక పాత్రధారిని. కాదు, బహు పాత్రధారిని!! కానీ, ఈ పాత్రలు అన్నింటిలోను న్యూస్‌రూమ్‌లో రేడియో జర్నలిస్టుగా నేను నిర్వహించిన పాత్ర సామాన్యమైనది కాదనుకుంటున్నాను’ అని రాశాను.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.